కృష్ణమ్మ పరవళ్లు

Four to Four and half lakh cusecs flood to Srisailam today - Sakshi

ఆల్మట్టి, నారాయణపూర్‌ల నుంచి నాలుగు లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల

నేడు శ్రీశైలానికి నాలుగు నుంచి 4.50 లక్షల క్యూసెక్కుల వరద

వరద ఇదే రీతిలో కొనసాగితే మూడు రోజుల్లో శ్రీశైలం.. వారంలో సాగర్‌ నిండే అవకాశం

సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌: నాలుగు రోజులుగా ఉగ్రరూపం దాల్చిన గోదావరి మంగళవారం శాంతించగా కృష్ణమ్మ ఉరకలెత్తుతోంది. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో వర్షాలు తగ్గడంతో వరద తగ్గుముఖం పట్టింది. ధవళేశ్వరం బ్యారేజీకి వచ్చిన వరద జలాల్లో 7,800 క్యూసెక్కులను డెల్టా కాలువలకు విడుదల చేసి, మిగులుగా ఉన్న 10,45,848 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలారు. బుధవారం వరద మరింత తగ్గే అవకాశం ఉంది. మరోవైపు కృష్ణా నదిలో వరద ఉధృతి పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్టులోకి మంగళవారం సాయంత్రానికి 2,10,312 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా.. కుడి, ఎడమ గట్టు విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా నాగార్జునసాగర్‌కు, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్, హంద్రీ–నీవా, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 82,661 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 868.6 అడుగుల్లో 135.94 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.

కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ప్రధానంగా నదీ జన్మస్థానమైన మహాబలేశ్వరం పర్వతాల్లో భారీ వర్షాలు కురవడం వల్ల ఎగువ నుంచి ఆల్మట్టి, నారాయణపూర్‌లలోకి భారీగా వరద వస్తోంది. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) హెచ్చరికల మేరకు ఈ రెండు జలాశయాల నుంచి మంగళవారం సాయంత్రం నీటి విడుదలను నాలుగు లక్షల క్యూసెక్కులకు పెంచారు. బీమా నదిపై మహారాష్ట్రలో నిర్మించిన ఉజ్జయిని ప్రాజెక్టు పూర్తిగా నిండింది. వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ జలాలు జూరాల ప్రాజెక్టు మీదుగా శ్రీశైలాన్ని చేరనున్నాయి. బుధవారం శ్రీశైలం ప్రాజెక్టులోకి నాలుగు నుంచి 4.50 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని జలవనరుల శాఖ అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. వరద ఇలాగే కొనసాగితే మూడు రోజుల్లో శ్రీశైలం, ఆ తర్వాత వారం రోజుల్లో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులు నిండుతాయి. తుంగభద్రలో సోమవారంతో పోల్చితే.. మంగళవారం వరద ప్రవాహం కాస్త పెరిగింది. 

శ్రీశైలంలో విద్యుత్‌ ఉత్పాదన
శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో ఉత్పత్తిని ప్రారంభించారు. మంగళవారం ఉదయం కుడిగట్టు విద్యుత్‌ కేంద్రంలో 0.226 మిలియన్‌ యూనిట్లు, భూగర్భ విద్యుత్‌ కేంద్రంలో 15.703 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. 

నేడు తీరం దాటనున్న వాయుగుండం
ఉత్తర బంగాళాఖాతంలో సోమవారం ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. బుధవారం ఉదయం తీవ్ర వాయుగుండంగా మారి ఒడిశాలోని బాలాసోర్‌ పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం తీరం దాటుతుందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) మంగళవారం రాత్రి విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించింది. తుపానుగా మారే అవకాశం లేదని స్పష్టం చేసింది. మత్స్యకారులెవ్వరూ చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులో ఒకటో నంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. 

ప్రభుత్వ సహాయ చర్యలు ముమ్మరం
తూర్పుగోదావరిలో వరదల్లో చిక్కుకున్న గ్రామాల్లో ప్రభుత్వం సహాయ చర్యలను ముమ్మరం చేసింది. ముంపునకు గురైన గ్రామాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. తూర్పు గోదావరి జిల్లాలో 18,809 మందికి 85 సహాయ, పునరావాస కేంద్రాల్లో వసతి కల్పించింది. వరదల వల్ల అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం నేపథ్యంలో ప్రభుత్వం ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే 85 వైద్య శిబిరాలను నిర్వహించింది. ఒక్కో వరద బాధిత కుటుంబానికి 25 కిలోల బియ్యం, రెండు లీటర్ల కిరోసిన్, కిలో కందిపప్పు, లీటరు పామాయిల్, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళాదుంపలు ఉచితంగా పంపిణీ చేసింది. ఉభయ గోదావరి జిల్లాల్లో 1,377.5 క్వింటాళ్ల బియ్యం, 10,100 లీటర్ల కిరోసిన్, 5,240 కిలోల కందిపప్పు, 6,967 లీటర్ల పామాయిల్, 6,967 కిలోల చొప్పున ఉల్లిపాయలు, బంగాళాదుంపలు పంపిణీ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కాగా, ఉభయగోదావరి జిల్లాల్లో మొత్తం 420 గ్రామాల ప్రజలు వరదలబారిన పడ్డారు. రహదారులు, వంతెనలు దెబ్బతినడంతో తూర్పుగోదావరి జిల్లాలో 64, పశ్చిమ గోదావరి జిల్లాలో 48 కలిపి మొత్తం 112 గ్రామాలకు రవాణా సదుపాయాలు లేకుండా పోయాయి. 17,737 ఇళ్లు గత 24 గంటలుగా జలదిగ్బంధంలో ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో సుమారు తొమ్మిది వేల ఎకరాల్లోని పంటలు వరద ముంపునకు గురయ్యాయి. సాంఘిక సంక్షేమ మంత్రి పినిపే విశ్వరూప్‌ మంగళవారం వరద బాధితులను పరామర్శించారు. వచ్చే ఉగాది నాటికి వరద బాధితులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top