వర్గీకరణ కోసం కదంతొక్కిన ఎమ్మార్పీఎస్

వర్గీకరణ కోసం కదంతొక్కిన ఎమ్మార్పీఎస్ - Sakshi

  • ఏపీ అసెంబ్లీ ముట్టడికి యత్నం

  • ఎక్కడికక్కడ కార్యకర్తల అరెస్టు

  • చంద్రబాబుకు వ్యతిరేకంగా హోరెత్తిన నినాదాలు

  • సాక్షి,హైదరాబాద్: ఎస్సీల వర్గీకరణపై మాట తప్పిన ఏపీ సీఎం చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని, వర్గీకరణ తీర్మానాన్ని ప్రవేశపెట్టే వరకు ఆయనను వెంటాడి తీరుతామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ హెచ్చరించారు. చంద్రబాబు మాదిగలను మోసం చేశాడని, ఏపీలో తెలుగుదేశం గద్దె దిగే వరకు వదిలిపెట్టబోమని, అలాగే తెలంగాణలో టీడీపీ ఉనికిని  కోల్పోక తప్పదని  ధ్వజమెత్తారు. ఎస్సీ వర్గీకరణ  తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ బుధవారం చేపట్టిన ‘చలో ఏపీ అసెంబ్లీ’ సందర్భంగా  తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.  



    ఏపీలోని వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వచ్చి న ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను పోలీసులు నగర శివా రు ప్రాంతాలు, బస్‌స్టేషన్లు, రైల్వేస్టేషన్లలోనే అదుపులోకి తీసుకున్నారు. లక్డీకాఫూల్‌లో మంద కృష్ణతో పాటు, పలువురు నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు  వారిని  కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మరోవైపు  ఆందోళనకారులను అడ్డుకొనేందుకు ఉదయం నుంచే  ఇందిరాపార్క్‌ను పూర్తిగా తమ స్వాధీనంలోకి  తీసుకున్న పోలీ సులు  రెండు వైపులా బారికేడ్లను ఏర్పాటు చేసి  రాకపోకలు నిలిపివేశారు.



    అసెంబ్లీకి వెళ్లే దారులన్నింటినీ మూసివేశారు. అసెంబ్లీ పరిసరాల్లో  భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అయినప్పటికీ నిర్బంధాన్ని ఛేదించి పలువురు కార్యకర్తలు వాహనాల్లో అసెంబ్లీ వరకు వెళ్లి ముట్టడికి యత్నించారు. శాసన సభలోకి వెళ్లేందుకు  యత్నించిన వారిని పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. కాగా, ఇందిరాపార్కు వద్ద ఆందోళనకు దిగిన కార్యకర్తలను పోలీసులు గోషామహల్, గాంధీనగర్,బొల్లారం తదితర పోలీస్‌స్టేషన్‌లకు తరలిస్తున్న క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  



    ఈ సందర్భంగా  ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు టీడీపీ పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వం తమపై  తీవ్ర నిర్బంధాన్ని  అమలు చేసినప్పటికీ అసెంబ్లీ ముట్టడి విజయవంతమైందని  మంద కృష్ణ ప్రక టించారు. ఎస్సీ వర్గీకరణ చేసి  పెద్ద మాదిగగా పేరు తెచ్చుకుంటానన్న చంద్రబాబు తమను మోసం చేశారన్నారు.



    చంద్రబాబు గెలుపు కోసం  ఎమ్మార్పీఎస్  ఎన్నో త్యాగాలు చేసిందని  గుర్తు చేశారు. వర్గీకరణపై తెలుగుదేశం పొలిట్‌బ్యూరోలో తీర్మానం చేసిన  చంద్రబాబు ఏపీలో వర్గీకరణను వ్యతిరేకిస్తూ, తెలంగాణలో మద్దతునిస్తూ  రెండు నాల్కల ధోరణిని ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. వర్గీకరణపై ఇప్పటికైనా చంద్రబాబు మాట నిలబెట్టుకోవాలని, మాదిగల రుణం తీర్చుకోవాలని డిమాండ్ చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top