జిల్లాలో భర్తీ చేయనున్న 64 గ్రామ రెవెన్యూ అధికారులు(వీఆర్‌ఓ), 167 గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్‌ఏ) పోస్టులకు దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా వచ్చాయి.
అనంతపురం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో భర్తీ చేయనున్న 64 గ్రామ రెవెన్యూ అధికారులు(వీఆర్‌ఓ), 167 గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్‌ఏ) పోస్టులకు దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. సోమవారంతో దరఖాస్తు గడువు ముగిసింది. వీఆర్‌ఓ పోస్టులకు 59,237, వీఆర్‌ఏ పోస్టులకు 2,941, రెండింటికి 1,681 కలిపి మొత్తం 63,858 దరఖాస్తులు వచ్చినట్లు డీఆర్వో హేమసాగర్ వెల్లడించారు.
ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపు గడువు 12వ తేదీతోనే ముగిసింది. గడువులోగా ఫీజు చెల్లించిన వారు మాత్రమే సోమవారం దరఖాస్తు చేసుకున్నారు. గత నెల 28 నుంచి ఆన్‌లైన్‌లో మీసేవా కేంద్రాలు, సీసీఎల్‌ఏ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులను స్వీకరించారు. 16 రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ చేపట్టారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 19 నుంచి హాల్‌టిక్కెట్‌లు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ నెల 30లోగా ప్రశ్నపత్రాలు జిల్లాకు చేరతాయి. ఫిబ్రవరి 2న రాత పరీక్ష ఉంటుంది. వీఆర్‌ఓ అభ్యర్థులకు 185, వీఆర్‌ఏ అభ్యర్థులకు 10 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. వీఆర్‌ఓ అభ్యర్థులకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు, వీఆర్‌ఏ అభ్యర్థులకు మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్ష జరుగుతుంది. ఫిబ్రవరి 4న ప్రాథమిక కీ, 10న తుది కీ విడుదల చేస్తారు. 20న పరీక్ష ఫలితాలు ప్రకటిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు 26 నుంచి నియామక పత్రాలు అందజేస్తారు.