ఏలూరు (మెట్రో) : వ్యవసాయ రంగంలో రాష్ట్రంలోనే మొదటి స్థానాన్ని దక్కించుకున్న మన జిల్లా పారిశ్రామిక రంగంలో మాత్రం అట్టడుగు స్థానంలో నిలబడింది.
వ్యవసాయంలో ఫస్ట్.. పరిశ్రమల్లో లాస్ట్
Sep 29 2016 12:04 AM | Updated on Sep 4 2017 3:24 PM
ఏలూరు (మెట్రో) : వ్యవసాయ రంగంలో రాష్ట్రంలోనే మొదటి స్థానాన్ని దక్కించుకున్న మన జిల్లా పారిశ్రామిక రంగంలో మాత్రం అట్టడుగు స్థానంలో నిలబడింది. విజయవాడలోని వెన్యూ ఫంక్షన్ హాల్‌లో బుధవారం నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో అభివృద్ధిని సీఎం సమీక్షించారు. వ్యవసాయ పరంగా ఉండి, ఉంగుటూరు, దెందులూరు నియోజకవర్గాలు వరుసగా 2, 3, 4 స్థానాల్లో నిలిచాయి. పారిశ్రామికంగా చూస్తే మాత్రం మన జిల్లా అట్టడుగు స్థానంలోకి వెళ్లింది.
రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ప్రాతినిధ్యం వహిస్తున్న చింతలపూడి నియోజకవర్గం 172వ స్థానంలోను, పోలవరం నియోజకవర్గం 171వ స్థానంలోను ఉన్నట్టు సీఎం ప్రకటించారు. తీర ప్రాంతం తక్కువగా ఉన్నప్పటికీ మత్స్యరంగంలో మన జిల్లా 32 శాతం వృద్ధి రేటు సాధించింది. తీరప్రాంతం 187 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న శ్రీకాకుళం జిల్లా వెనుకబడింది. మత్స్య రంగానికి సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లాను ఆదర్శంగా తీసుకోవాలని శ్రీకాకుళం జిల్లా అధికారులకు సీఎం సూచించారు. కలెక్టర్ల సదస్సులో జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ గురువారం కీలక అంశాలపై ప్రసంగించనున్నారు. జిల్లాలో ప్రాధాన్యతా రంగాల అభి వృద్ధిని ఆయన వివరిస్తారు.
Advertisement
Advertisement