
వేలి ముద్రల సమస్యకు ఇక చెక్
‘జన్మభూమి-మన ఊరు’ కార్యక్రమానికి తొలి ప్రాధాన్యం ఇస్తామని జిల్లా కలెక్టర్ కె.భాస్కర్ చెప్పారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో
సాక్షి, ఏలూరు : ‘జన్మభూమి-మన ఊరు’ కార్యక్రమానికి తొలి ప్రాధాన్యం ఇస్తామని జిల్లా కలెక్టర్ కె.భాస్కర్ చెప్పారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడుతో కలసి మాట్లాడారు. అక్టోబర్ 2 నుంచి 20వ వరకూ (విజయదశమి, ఆదివారాలు మినహా) జరిగే ఈ కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులతో కలసి అధికారులంతా పాల్గొంటారని కలెక్టర్ చెప్పారు. ముఖ్యమంత్రి ప్రకటించిన ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్ల సాధనకు, ప్రజల సమస్యలు తెలుసుకుని అభివృద్ధి ప్రణాళికలు రూపొం దించడానికి జన్మభూమి కార్యక్రమం సాధనంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. జిల్లాలో సామాజిక పింఛన్లు పొందుతున్న వారిలో దాదాపు 27వేల మందిని అనర్హులుగా గుర్తించామని, దాదాపు 3 లక్షల మందికి ఆధార్ అనుసంధానం చేశామని తెలిపారు. వేలిముద్రలు పడని వృద్ధులు, లెప్రసీ బాధితులకు వారి కనుపాపలను స్కాన్ చేసే ఐరిష్‌తో ఆధార్ ఇచ్చేలా కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొం దిస్తున్నామని తెలిపారు. ఇంటినుంచి కదలలేని వారుంటే అధికారులను వారి చెంతకు పంపించి పింఛన్ ఇప్పిస్తామన్నారు. అర్హులైనా ఆధార్ లేని లబ్ధిదారు లకు రెండు నెలలపాటు పింఛన్ అందిస్తామని స్పష్టం చేశారు.
ధాన్యం కొనుగోలుకు ఆన్‌లైన్
ఛత్తీస్‌గఢ్ తరహాలో ధాన్యం కొనుగోలు విధానాన్ని ఆన్‌లైన్ చేసే యోచనలో ఉన్నట్టు కలెక్టర్ వెల్లడించారు. ఇందుకు అవసరమైన కంప్యూటర్లు, ఇతర పరికరాలు సమకూర్చుకోవడానికి దాదాపు రూ.కోటి ఖర్చవుతుందని అంచనా వేశామన్నారు. సుమారు రూ.2,500 కోట్ల మేరకు ధాన్యం వ్యాపార లావాదేవీలు జరిగే అవకాశం ఉన్నందున ప్రభుత్వం నుంచి ఇందుకు అనుమతులు లభిస్తాయని భావిస్తున్నామన్నారు. జిల్లాలో థర్డ్ ఆర్డర్ పరిధిలోని ఒక ట్రాక్టర్ ఇసుక ధరను రూ.2వేలుగా నిర్ణయించినట్టు కలెక్టర్ ప్రకటించారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు జీపీఎస్ విధానాన్ని అసుసరిస్తున్నామని, వాహనం నిర్ధేశించిన మార్గాన్ని దాటితే అధికారులకు సమాచారం తెలుస్తుందని వివరించారు. ఏలూరును సోలార్ సిటీగా చేయడానికి ప్రతిపాదనలు పంపామని చెప్పారు.
కూరగాయ రైతులకు ఐడీ కార్డులు
జిల్లాలో 6వేల మంది కూరగాయల రైతులు ఉంటే రైతు బజార్లలో కేవలం 27 మంది మాత్రమే కనిపించారని కలెక్టర్ చెప్పారు. ఈ దృష్ట్యా ఆ రైతులకు గుర్తిం పు కార్డులు ఇవ్వాలనుకుంటున్నామన్నారు. దీని కోసం సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నామన్నారు. రైతు బజార్లను జి ప్లస్ టు పద్ధతిలో ప్రధాన కూడళ్లలో నిర్మిస్తామన్నారు. ఇప్పటికే 18 ప్రాంతాలను గుర్తించామని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకానికి సన్నబియ్యం అందించేందుకు రవాణాదారులతో చర్చలు జరుపుతున్నామని, రెండు రోజుల్లో ఇది కొలిక్కి వస్తుందని పేర్కొన్నారు. భీమవరంలో పాస్‌పోర్ట్ కేంద్రం ఏర్పాటుకు సంబంధిత అధికారులతో మాట్లాడామని, నవంబర్ నెలలో పాస్‌పోర్టు మేళా నిర్వహిస్తామని తెలిపారు.