సచివాలయాల్లో జాబితాలు 

Financial aid to 479623 People from AP Govt - Sakshi

4,79,623 మందికి ఆర్థిక సాయం 

వైఎస్సార్‌ కాపు నేస్తం, జగనన్న చేదోడులకు సర్వం సిద్ధం.. జూన్‌లో అందించనున్న ప్రభుత్వం 

లబ్ధిదారుల షాపులకు జియో ట్యాగింగ్‌

సాక్షి, అమరావతి: ‘వైఎస్సార్‌ కాపు నేస్తం’ ‘జగనన్న చేదోడు’ పథకాలకు సంబంధించి 4,79,623 మంది లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేయనుంది. వైఎస్సార్‌ కాపు నేస్తం పథకానికి 2,29,416 మంది మహిళలను ఎంపిక చేయగా ఒక్కొక్కరికి రూ.15,000 చొప్పున జూన్‌ 24న ఆర్థిక సాయం అందించనుంది. జగనన్న చేదోడు పథకానికి 2,50,207 మంది లబ్ధిదారులు ఎంపిక కాగా వీరిలో దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులు ఉన్నారు. వీరికి జూన్‌ 10న రూ.10,000 చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేస్తారు.

అభ్యంతరాలుంటే 25లోగా తెలపాలి..
► ఈ రెండు పథకాలకు సంబంధించి లబ్ధిదారుల జాబితాను బుధవారం నుంచి సచివాలయాల నోటీసు బోర్డులో ప్రదర్శించాలని ఎంపీడీవోలు, మునిసిపల్‌ కమిషనర్లకు బీసీ కార్పొరేషన్‌ ఎండీ రామారావు ఆదేశాలిచ్చారు. అభ్యంతరాలను ఈనెల 25లోగా తెలియచేయాలి. 
► అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం ఎంపీడీవోలు, మునిసిపల్‌ కమిషనర్లు జిల్లా బీసీ కార్పొరేషన్‌ ఈడీలకు జాబితాను పంపించాలి. కలెక్టర్‌ అనుమతితో బీసీ కార్పొరేషన్‌ ఈడీలు ఈ జాబితాను రాష్ట్ర బీసీ కార్పొరేషన్‌ ఎండీ, కాపు కార్పొరేషన్‌ ఎండీ కార్యాలయాలకు పంపిస్తారు. 
► వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం ద్వారా 45 – 60 ఏళ్ల లోపు మహిళా లబ్ధిదారులకు ఏటా రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తారు. 

మూడు వర్గాలకు ‘చేదోడు’...
► జగనన్న చేదోడు పథకం లబ్ధిదారుల షాపులకు వలంటీర్ల ద్వారా జియో ట్యాగింగ్‌ చేయించాలి. జియో ట్యాగింగ్‌ చేయించకుంటే మంజూరు ఉత్తర్వులు ఆపివేస్తారు. 
► జగనన్న చేదోడు పథకానికి సంబంధించి సామాజిక తనిఖీ బృందాలు మండలాలు, మునిసిపాలిటీల్లో పర్యటిస్తున్నట్లు బీసీ కార్పొరేషన్‌ ఎండీ రామారావు తెలిపారు. 
► ఈ పధకానికి 1,29,749 మంది దర్జీలు, రజకులు 81,815 మంది, 38,643 మంది నాయీ బ్రాహ్మణులు ఎంపికయ్యారు. వీరికి వృత్తి పనుల కోసం ఏటా ఒక్కో కుటుంబానికి రూ.10,000 చొప్పున ప్రభుత్వం సాయం అందజేస్తుంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top