టీడీపీ కార్యకర్తలకు కమిటీల ముసుగు | fight on sand reach maintenance | Sakshi
Sakshi News home page

టీడీపీ కార్యకర్తలకు కమిటీల ముసుగు

Nov 15 2014 1:55 AM | Updated on Aug 14 2018 3:47 PM

ఇసుక రీచ్‌ల నిర్వహణ బాధ్యతను నిర్వహించే కమిటీల నియామకం జిల్లాలో తీవ్ర దుమారం రేపుతోంది.

ఇసుక రీచ్‌ల నిర్వహణ బాధ్యతను నిర్వహించే కమిటీల నియామకం జిల్లాలో తీవ్ర దుమారం రేపుతోంది. డ్వాక్రా మహిళల ముసుగులో అధికార పార్టీ కార్యకర్తలకు పెద్దపీట వేస్తుండటం, ఆ పార్టీ నాయకులే పెత్తనం చెలాయిస్తుండటంతో వివాదాలు రేగుతున్నాయి. జిల్లాలో ఇప్పటికి పది కమిటీల నియామకాలు జరగ్గా దాదాపు అన్నీ వివాదాస్పదమయ్యాయి. పొదుపు, చిన్న చిన్న వ్యాపారాలతో ప్రశాంతంగా సాగిపోతున్న డ్వాక్రా సంఘాలు ఇప్పుడు ఇసుక తుపానులో చిక్కుకున్నాయి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. ఇసుక అమ్మకాలు ప్రారంభమైతే ఎలా ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
 
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఇసుక రీచ్ నిర్వహణను పేరుకు డ్వాక్రా సంఘాలకు కట్టబెట్టినా.. రీచ్‌ల నిర్వహణకు కమిటీల ఏర్పాటు ప్రక్రియలో అధికార పార్టీ జోక్యం పెరుగుతుండటం వివాదాలకు దారి తీస్తోంది. ప్రభుత్వం నిర్దేశించినట్లు ఎవరి ప్రమేయం లేకుండా మహిళా సంఘాలే రీచ్‌లను నిర్వహించుకుంటే ఎటువంటి సమస్య ఉండదు. కానీ ఈ సంఘాల ముసుగులో ఆధికార టీడీపీ కార్యకర్తల పెత్తనం పెరుగుతుండటంతో అప్పుడే వివాదాలు ప్రారంభమవుతున్నాయి.

రీచ్‌లను నిర్వహించే మహిళా కమిటీల్లో అధికార పార్టీ నేతలు తమ అనుయాయులనే ఎంపిక చేస్తూ, మిగిలిన వారిని విస్మరిస్తున్నారు. కొన్ని చోట్ల ‘ఆధికారం మాది, కమిటీల్లో మేమే ఉంటాం, మేమే రీచ్‌లు  నిర్వహిస్తామని టీడీపీ కార్యకర్తలు హల్‌చల్ చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. క మిటీల ఏర్పాటులో అవకతవకలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులు కూడా కలెక్టర్‌కు అందాయి.
 
13 రీచ్‌లకు అనుమతులు

జిల్లాలో 18 రీచ్‌లను ఆధికారులు ఇప్పటి వరకు గుర్తించారు. వీటిలో 13 రీచ్‌లకు అనుమతులు వచ్చాయి. వీటి నిర్వహణకు గ్రామ సంఘాల అధ్యర్యంలో కమిటీలు ఏర్పాటు చేసి మ్యాక్స్(సహకార) చట్టం కింద రిజిస్ట్రేషన్ చేయించాల్సి ఉంది. కాగా 10 రీచ్‌లకు కమిటీలు ఏర్పాటు చేసి, రిజిస్ట్రేషన్ తంతు కూడా పూర్తి చేసేశారు. దాదాపు వీటన్నింటిలోనూ వివాదాలు ఉన్నాయి. ఒక వర్గానికే ప్రాధాన్యమిచ్చి మిగిలిన వారిని విస్మరించారని, ఆధికార పార్టీ నేతలు సూచనల మేరకే కమిటీల్లో సభ్యుల నియామకం జరిగిందని మిగిలిన సభ్యులు ఆరోపిస్తున్నారు.  

ఇంకా అనుమతి రాని 5 రీచ్‌లకు వారం రోజుల్లో అనుమతి తీసుకొచ్చి, కమిటీ నియామక ప్రక్రియ పూర్తి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. జిల్లాలోని 10 మండలాల్లోని 18 గ్రామైఖ్య సంఘాల పరిధిలో 656 సంఘాలు ఉన్నాయి. రొటేషన్ పద్ధతిలో వీటికి రీచ్ బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. మరోవైపు పొన్నాడ, కల్లేపల్లి, తలవరం రీచ్‌లలో ఇసుక అమ్మకాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.  
 
ఇసుక లభ్యత వివరాలు
గుర్తించిన 18 రీచ్‌లలో 11,48,220 క్యూబిక్ మీటర్ల ఇసుక తరలించేందుకు వీలున్నట్లు అధికారులు గుర్తించారు. రీ చ్‌లవారీగా చూస్తే.. బూర్జ మండలం అల్లెనలో 38,450, కాఖండ్యాంలో 80,500, ఎచ్చెర్ల మండలం పొన్నాడలో 1,63,250, జలుమూరు మండలం దుం పాకలో 50 వేలు, శ్రీకాకుళం మండలం బట్టేరులో 35 వేలు, కిల్లిపాలెంలో 65 వేలు, కల్లేపల్లిలో 50 వేలు, సరుబుజ్జిలి మండలం పెద్ద సవలాపురంలో 2,42, 120, పురుషోత్తపురంలో 80,900, గరగాంలో 1.38 లక్షలు, సంతకవిటి మండ లం తమరాంలో 1.50 లక్షలు, వీరఘట ్టం మండలం తలవరంలో 55 వేలు, భామిని మండలం సింగిడిలో 50,400, బిల్లుమడలో 50,400, కొత్తూరు మండలం అంగూరులో 60 వేలు, సిరుసువాడలో 60 వేలు, కడుంలో 60 వేలు, ఆకులతంపరలో 60 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement