అధికార్ల బాట.. క్షేత్ర పర్యటన | Field trips trail officers .. | Sakshi
Sakshi News home page

అధికార్ల బాట.. క్షేత్ర పర్యటన

Mar 11 2015 2:52 AM | Updated on Sep 2 2017 10:36 PM

మీరు ఎవరైనా అధికారిని కలవడానికి ప్రభుత్వ కార్యాలయాలకు ఉదయాన్నే వెళదామనుకుంటున్నారా?

 సాక్షి, కర్నూలు :  మీరు ఎవరైనా అధికారిని కలవడానికి ప్రభుత్వ కార్యాలయాలకు ఉదయాన్నే వెళదామనుకుంటున్నారా? అయితే కాస్త ఆగండి.. అధికారులెవ్వరూ ఇకపై అందుబాటులో ఉండడం లేదు. వారంలో సోమవారం (ప్రజాదర్బారు) మినహాయిస్తే మిగిలిన ఐదు రోజులు అధికారులు క్యాంపుల బాట పట్టనున్నారు. కాకపోతే సాయంత్రం ఐదు గంటల తర్వాతే వీరు ఆయా కార్యాలయాల్లో అందుబాటులో ఉండనున్నారు. సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ రెండు రోజుల క్రితం జరిగిన అధికారుల సమావేశంలో ఈ ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి.. ఉదయం పూట వివిధ పనుల నిమిత్తం కార్యాలయాలకు వెళ్తే మాత్రం సాయంత్రం వరకు పడిగాపులు కాయాల్సిందే.
 
 ఇక ఐదు రోజులు క్షేత్ర స్థాయిలోనే..
 అధికారులు ఇక వారంలో ఐదు రోజులపాటు మంగళవారం నుంచి శనివారం వరకు జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో పర్యటించాల్సిందేనంటూ కలెక్టర్ విజయమోహన్ అధికారులకు స్పష్టంగా ఆదేశించారు. రెండు రోజుల క్రితం జరిగిన జిల్లాస్థాయి అధికారుల సమావేశంలో కలెక్టర్ అధికారుల పనితీరును సమీక్షించారు.
 
  ఈ సందర్భంగా ఎవరెవరు క్షేత్రస్థాయిలో పర్యటించారని ప్రశ్నిం చగా ఓ అధికారి ‘సర్, నేను రెండు రోజులు పర్యటించాను’ అని సమాధానం ఇవ్వగా.. ఇందుకు కలెక్టర్ ‘ప్చ్..’ అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ‘లేదు.. ఐదు రోజులు పర్యటించాల్సిందే’ అన్నారు.  ప్రతి అధికారి సోమవారం ప్రజాదర్బారులో మినహా మిగిలిన రోజుల్లో  క్షేత్రస్థాయి పర్యటనల్లో ఉండాలని కలెక్టర్ సూచించారు. ఉదయమే ఫీల్డ్ విజిట్‌కు బయలుదేరి పనులు ముగించుకుని సాయంత్రంలో ఐదు గంటల తరువాత కార్యాలయాలకు వచ్చి ఆఫీసు పనులు చూసుకోవాలని ఆదేశించారు. కాగా, కలెక్టర్ ఆదేశాల వల్ల కిందిస్థాయిలో ఇబ్బందులు తెలుసుకునే అవకాశాలు ఉన్నప్పటికీ... అమలు వల్ల సరికొత్త ఇబ్బందులు తప్పవేమోనన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.
 
 అమలులో ఇబ్బందులు..
 పట్టణంలో ఏం జరుగుతోంది? పరిపాలన ఎలా సాగుతోంది? ప్రజలకున్న ఇబ్బందులు ఏమిటి? అని తప్పనిసరిగా పర్యవేక్షించాల్సింది జిల్లా స్థాయి అధికారులు. వారు నగరం/పట్టణాల్లో ఉంటే స్థానికులకు అందుబాటులో ఉంటారని, క్రమం తప్పకుండా పరిశీలిస్తారని ఆశించొచ్చు. ఇకపై అలాగే జరుగుతుందా అంటే కచ్చితమైన సమాధానం దొరకే పరిస్థితులు కనిపించట్లేదు.
 
 వాస్తవానికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధికారులు సగం రోజులు సమీక్షలకే సమయం కేటాయించాల్సి వస్తోంది. వీడియో కాన్ఫరెన్సులకు హాజరుకావాల్సి వస్తోంది. రాజధానికి, ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. అభివృద్ధి విషయంలో ఎక్కడ ఉన్నామనేది సమీక్షలు నిర్వహిస్తేనే తెలుస్తుంది. మరోవైపు వారంలో ఐదు రోజులు ఫీల్డ్ విజిట్‌కు వెళితే... ఫైళ్లు గుట్టలుగా పేరుకుపోయే ప్రమాదం ఉందనేది అధికారుల ఆవేదనగా ఉంది. అంతేకాకుండా ప్రజలకు అందుబాటులో ఉండకపోతే సరికొత్త సమస్యలూ తప్పవనేది వీరి అభిప్రాయం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement