బొజ్జల, గల్లాకు చుక్కెదురు | Fattening, gallaku resolution | Sakshi
Sakshi News home page

బొజ్జల, గల్లాకు చుక్కెదురు

Apr 27 2014 5:37 AM | Updated on Apr 3 2019 5:55 PM

బొజ్జల, గల్లాకు చుక్కెదురు - Sakshi

బొజ్జల, గల్లాకు చుక్కెదురు

ఈ ఇద్దరూ జిల్లాలోనే సీనియర్ రాజకీయ నాయకులు. మంత్రిపదవులూ వెలగబెట్టారు. ఎన్నికలవగానే నియోజకవర్గాల ముఖం చూడడం మానేశారు.

ఈ ఇద్దరూ జిల్లాలోనే సీనియర్ రాజకీయ నాయకులు. మంత్రిపదవులూ వెలగబెట్టారు. ఎన్నికలవగానే నియోజకవర్గాల ముఖం చూడడం మానేశారు. ఫలితంగా ఎక్కడి సమస్యలు అక్కడ పేరుకుపోయాయి. తాజాగా ఎన్నికలు రావడంతో ఆ ఇద్దరు నేతలకు నియోజకవర్గాలు మళ్లీ గుర్తొచ్చాయి. ఓట్ల వేటలో భాగంగా ప్రజల్లోకి వచ్చారు. ఇప్పటికే ఆగ్రహంతో ఉన్న ప్రజలు వారిని నిలదీశారు.
 
రేణిగుంట/చంద్రగిరి న్యూస్‌లైన్: ‘‘ఐదేళ్ల ముందు వచ్చావు..బోరు వేయిస్తానన్నావు..బాలబడి, గుడి, మురుగునీటి కాల్వలు నిర్మిస్తానన్నావు..అవేమీ చేయకుండా ఇప్పుడు వచ్చావు.. ఏమి మాట్లాడాలి నీతో.’’ అంటూ మాజీ మంత్రి, శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని మహిళలు నిలదీశా రు. బొజ్జల శనివారం రేణిగుంట మండలంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. కృష్ణాపురం నుంచి ఆయన ప్రచారం మొదలెట్టారు. ఆయన గ్రామంలో ఒకచోట కూర్చుని అక్కడకు వచ్చిన టీడీపీ కార్యకర్తలతో మాట్లాడి వెళ్లిపోతున్నారు. దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లవరం సమీపంలోని ఎల్‌ఎన్ కండ్రిగకు చేరుకున్న బొజ్జలను మహిళలు నిలదీశారు.

గత ఎన్నికలప్పుడు గ్రామానికి వచ్చి బోలెడన్ని హామీలిచ్చారని, అప్పటి నుంచి సమస్యలు పరిష్కరించకుండా ఇప్పుడు ఐదేళ్ల తర్వాత గ్రామానికి ఓట్ల కోసం వచ్చారని నిలదీశారు. గ్రామానికి చెందిన జయంతి, ఏకదంతం, వాసంతి గ్రూపులకు చెందిన రాణెమ్మ, మునిలక్ష్మి, గౌరి, లక్ష్మమ్మలతోపాటు మరికొంత మంది మహిళలు ఎమ్మెల్యేను నిలదీశారు. మహిళలు అడిగిన దానికి ఆయన సరైన సమాధానం చెప్పకుండా దాటవేసే ప్రయత్నం చేశారు.

ఈ సారి తెలుగుదేశం పార్టీ వస్తే మీ సమస్యలు పరిష్కరిస్తానని, ఏ పని కావాలన్నా జరిగిపోతుందని చెబుతూ అక్కడ నుంచి వెళ్లి పోయారు. బొజ్జల తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ నుంచి దిగువ మల్లవరం వెళ్లిన ఆయనకు పార్టీ నాయకులే సమస్యలు ఏకరువు పెట్టారు. ఇరవై ఏళ్లుగా గ్రామానికి రోడ్డు లేకుండా అవస్థలు పడుతున్నామని మొరపెట్టుకున్నారు. ఎన్నికలైన తర్వాత చూద్దాంలే అంటూ వెళ్లిపోయారు. అనంతరం ఆయన మల్లవరం, కుమ్మరపల్లె, సుబ్బయ్యగుంట, వెదళ్లచెరువు గ్రామాల్లో పర్యటించారు.
 
గల్లాతో గ్రామస్తుల గలాట
 
మాజీ మంత్రి గల్లా అరుణకుమారికి తన సొంత నియోజకవర్గంలో చుక్కెదురైంది. ఎన్నికల ప్రచారం లో భాగంగా శనివారం ఆమె పాకాల మండలం సామిరెడ్డిపల్లెకు వెళ్లారు. ఊహించని విధంగా గ్రామస్తులు ఎదురు తిరిగారు. ‘‘మేము వైఎస్ అభిమానులం, మూడుసార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాం. ఇప్పుడు నీదారి నువ్వు చూసుకున్నావు.. మేం ఎవరినైతే ఓడిం చామో వారితోనే చేతులు కలిపావు.. మా గ్రామంలోకి రావద్దు’’ అంటూ అడ్డుకున్నారు. గ్రామస్తుల వైఖరితో గల్లా కంగుతిన్నారు.

ఈ వ్యవహారానికి రాజకీయ రంగు పులిమి సానుభూతి పొందాలని భావించారు. తన వాహన శ్రేణిలో ఉన్న అనుచరులను, తమ ఫ్యాక్టరీ ఉద్యోగులను గ్రామస్తులపైకి ఉసిగొలిపారు. దీంతో వారు రెచ్చిపోయారు. గ్రామంలో సభ ఏర్పాటు చేయించారు. తమ అనుచరులు, తమ ఫ్యాక్టరీ సిబ్బందితో పెద్దఎత్తున నినాదాలు, రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేయించారు. టపాకాయలు పేల్చి, గ్రామమంతా జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. దీంతో గ్రామస్తులు స్పందించారు.

ఇలా చేయడం సరికాదని నిలదీశారు. దీంతో గల్లా గ్రామస్తులపై కన్నెర్రచేశారు. ‘‘మీరెవ్వరు నన్ను రావద్దనడానికి’’ అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆపై తిట్ల పురాణం అందుకున్నారు. ఈ నేపధ్యంలో గల్లా అనుచరులకు, గ్రామస్తుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ తోపులాటలో గల్లా వాహనం వెనుక అద్దం పగిలిపోయింది. దీంతో చిర్రెత్తిన గల్లా అనుచరులు గ్రామస్తులపై రాళ్లదాడికి దిగారు. కాసేపటికి గొడవ సద్దుమణగడంతో గల్లా అనుచరులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. గంట తర్వాత గల్లా అనుచరులు, ఆమె ఫ్యాక్టరీ సిబ్బంది 300 మంది వరకు మళ్లీ గ్రామస్తులపై దాడికి యత్నించారు. దీంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. తోటపల్లె రహదారిపై గల్లా, ఆమె అనుచరులు ధర్నా చేశారు. గంట పాటు రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి.
 
తుమ్మలగుంటలోనే ఎత్తుగడ
 
తనను తుమ్మలగుంటలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీనాయకులు అడ్డుకున్నారనే దుష్ర్పచారాన్ని చేసేందుకు గల్లా ఎత్తుగడ వేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె రెండు రోజుల క్రితం తుమ్మలగుంటకు వచ్చారు. గ్రామ నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు, జెండాలు, తోరణాలు కట్టించారు. దీన్ని గ్రామస్తులు ప్రశ్నిస్తారని, తద్వారా తనను తుమ్మలగుంట గ్రామంలో అడ్డుకున్నారనే దుష్ర్పచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కుట్రపన్నారు. ఈ విషయంపై గ్రామస్తులు స్పందించకపోవడంతో ఆమె వ్యూహం బెడిసికొట్టింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement