అమ్మ రాదు..! అవ్వ లేదు.!!

Father And Grand Mother Died Mother In Kuwait Childrens In YSR Kadapa - Sakshi

మంచానికే పరిమితమైన వెంకటరమణ

కువైట్‌ వెళ్లి మూడేళ్లయినా.. ఇంటి ముఖం చూడని తల్లి

భార్యపై బెంగతో ఏడాది క్రితం చనిపోయిన భర్త నాగేంద్ర

రెండేళ్లుగా అన్నీ తానై.. పిల్లలను పోషించిన నానమ్మపై దేవుడి చిన్నచూపు

పాము కాటుతో తనువు చాలించిన రామసుబ్బమ్మ

అనాథలుగా మారిన చిన్నారులు  

సాక్షి, కడప : అమ్మకోసం ఎదురుచూపులు.. కళ్లు కాయలు కాస్తున్నా కనిపించడం లేదు.. అమ్మ మాట విందామన్నా వినిపించడం లేదు.. అమ్మ రాక..నాన్న లేక..అనుక్షణం పిల్లలను తలచుకుంటూ..పోషించడం కోసం పండుటాకు పడరాని కష్టాలను పడింది.. పిల్లల కోసం ప్రతినిత్యం పనికి వెళ్లి వారిని కంటికి రెప్పలా కాపాడుకుంది. ఒక వైపు అనారోగ్యంతో మంచంలో పడిన భర్తకు ఏ లోటు రాకుండా చూసుకుంటూ.. మరోవైపు చిన్నారుల కష్టాన్ని మోస్తూ వచ్చిన అవ్వను దేవుడు కూడా   కానరాని లోకానికి తీసుకెళ్లాడు. రెండేళ్లుగా ఎన్నో కష్టాలు...మరెన్నో బాధలు అనుభవించిన అవ్వ ఇక తిరిగి రాని లోకానికి వెళ్లిందన్న నిజాన్ని జీర్ణించుకో చిన్నారులు రోదిస్తున్న తీరు అందరినీ కలిచివేస్తోంది. బతికున్న సమయంలో కోడలి కోసం పోలీసు స్టేషన్‌కు..కడప కలెక్టరేట్‌కు..ఏజెంట్ల వద్దకు వెళ్లి మొర పెట్టుకుని బాధను వినిపిస్తూ వచ్చినా.. ఆ పండుటాకు వేదన అరణ్యరోదనగానే మిగిలింది. గాలివీడు మండలం రెడ్డివారిపల్లెకు చెందిన రామసుబ్బమ్మ మృతితో చిన్నారులు అనాథలుగా మారారు.

కష్టాల్లో ఉన్న కుటుంబం కోసం
కష్టాల్లో ఉన్న కుటుంబానికి అండగా నిలవాలని కువైట్‌కు వెళ్లింది చిన్నారుల తల్లి పార్వతమ్మ. దాదాపు మూడేళ్ల క్రితం వెళ్లిన ఆమె నుంచి ఇప్పటివరకు ఎలా ఉందో కూడా సమాచారం లేదు. ఒక్కసారంటే ఒక్కసారికూడా పిల్లలతోగానీ, కుటుంబ సభ్యులతోగానీ మాట్లాడిన పాపాన పోలేదు. నలు గురు పిల్లలను, భర్తను, కుటుంబాన్ని వదిలి సుదూ ర ప్రాంతానికి వెళ్లిన ఆమె ఆ తర్వాత కనిపించడం లేదు. ఇప్పుడు ఆ పిల్లలు అమ్మ కావాలంటూ మూడేళ్ల నుంచి కన్నీరు పెడుతూనే ఉన్నారు.

రెండేళ్లుగా అన్నీ తానై..
పార్వతమ్మ కువైట్‌కు వెళ్లిన తర్వాత ఏడాదికి భర్త నాగేందర్‌ నాయుడు భార్యపై బెంగతో.. మనో వేదనకు గురై.. మంచం పట్టి తనువు చాలించాడు. అమ్మ ఎక్కడో దేశంగానీ దేశంలో ఉన్నా ఆచూకీ తెలియకపోవడం.. తండ్రి చనిపోవడంతో ఇక భారమంతా నానమ్మ రామసుబ్బమ్మపైనే పడింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. నలుగురు చిన్నారులను పోషించడం నానమ్మ, తాతయ్యకు రోజురోజుకు కష్టతరంగా మారింది. అయినా మనవళ్లు, మనవరాళ్లు కావడంతో ఇతరులకు ఏమాత్రం తీసిపోకుండా అల్లారుముద్దుగా పెంచుకుంటూనే వచ్చింది. రామసుబ్బమ్మ భర్త వెంకట రమణ నాయుడు కూడా మంచంలో ఉండడంతో అటు పెద్దాయనను, ఇటు చిన్నారులను అన్నీ తానై పోషిస్తూ వచ్చింది.

ఏడాది కిందట నాన్న.. ఇప్పుడు నానమ్మ
పార్వతమ్మ మూడేళ్ల క్రితం కువైట్‌కని వెళ్లడం, తర్వాత సమాచారం లేకపోవడంతో భర్త రెడ్డి నాగేంద్ర కుంగిపోతూ చనిపోగా....అప్పటి నుంచి భారమంతా నాన్నమ్మ రామసుబ్బమ్మ మీద పడినా పోరాడుతూ వచ్చింది. విధి వక్రించి బుధవారం ఉదయం పాముకాటుకు గురై తనువు చాలించింది.

పొలం అమ్మి.. కూలి పనులు చేసి..
గాలివీడు మండలం గొట్టివీడు పంచాయతీలోని రెడ్డివారిపల్లెకు చెందిన రామసుబ్బమ్మ వయస్సు దాదాపు 70 ఏళ్లు. మనవళ్లు, మనవరాళ్లను పోషించడానికి తన వద్ద ఉన్న అర ఎకరా పొలాన్ని అమ్మి చిన్నారులను చదివిస్తోంది. అంతేకాకుండా కుటుంబ అవసరాల నిమిత్తం ప్రతిరోజు ఉపాధి హామీ కూలి పనులకు వెళుతూ కుటుంబానికి పెద్ద దిక్కుగా మారింది. ఉన్న ఫళంగా రామసుబ్బమ్మ మృతి చెందింది.

ఆమెను స్వదేశానికి రప్పించండి : ఎమ్మెల్యే
జిల్లా ఉన్నతాధికారులు, విదేశాంగ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకొని అనాథలైన పిల్లల తల్లి పార్వతమ్మను స్వగ్రామానికి తీసుకు వచ్చేందుకు చర్యలు తీసుకోవాలని రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి అధికారులకు విజ్ఞప్తి చేశారు. అనాథ పిల్లలకు అండగా ఉండి సహాయ, సహకారాలను అందిస్తామన్నారు. 

అనాథలైన చిన్నారులు
ఒకవైపు తల్లి కనిపించకపోవడం.. మరోవైపు ఇటీవలే తండ్రి మరణించడంతో చిన్నారుల వేదన అంతా ఇంతా కాదు. ఆలనా పాలనా చూడాల్సిన తల్లిదండ్రులు ఇద్దరూ లేకపోవడంతో ఆ భారమంతా చూస్తూ వచ్చిన రామసుబ్బమ్మ బుధవారం మృతి చెందడంతో పిల్లలు అనాథలుగా మారారు. వనజ (12) 7వ తరగతి చదువుతుండగా, రెడ్డి నాగేంద్ర (9) నాల్గవ తరగతి, శైలజ (7) మూడవ తరగతి, సునీల్‌ (4)లు దిక్కులేని వారుగా మిగిలారు.  అయితే గాలివీడు ఎస్‌ఐ మంజునాథ్‌ సంబం«ధిత ఏజెంట్లతో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లోనూ కువైట్‌లో ఉన్న తల్లిని రప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం చిన్నారులు చదువుకునేందుకు...కుటుంబ పోషణకు దయార్థ హృదయులు  ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top