రోడ్డెక్కిన అన్నదాతలు

Farmers stage mega dharna at Guntur - Sakshi

గుంటూరు–హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై ధర్నా

రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఆగ్రహం

దిగువకు నీరిస్తామన్న అధికారుల హామీతో ఆందోళన విరమణ

గుంటూరు /పేరేచర్ల:  నాలుగేళ్ల నుంచి సరైన గిట్టుబాటు ధరలు, కౌళ్లు, పెరిగిన ఏరువుల ధరలు, సక్రమంగా లేని సాగునీటితో సతమతమైన రైతులు ప్రస్తుత సంవత్సరంలో ప్రభుత్వం తీసుకొన్న రైతు వ్యతిరేక నిర్ణయాలతో కడుపు మండి రోడ్డెక్కారు. మిర్చి సాగు మీద ఆశలు పెట్టుకొన్న తరుణంలో ప్రభత్వం తీసుకొన్న వారబందీ నిర్ణయం రైతుకు గోరుచుట్టు మీద రోకటి పోటు చందంగా మారింది. ప్రాజెక్టులో సాగునీరు పుష్కలంగా ఉన్నా వారబందీ పెట్టటం వలన దిగువన సాగు చేసే భూములకు నీరందక పంటలు ఎండిపోతున్నాయని వైఎస్సార్‌ సీపీ నాయకులు, అన్నదాతలు శనివారం పేరేచర్ల గుంటూరు బ్రాంచ్‌ కెనాల్‌ వద్ద గుంటూరు–హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై «బైఠాయించి ధర్నాకు దిగారు.

గంటకుపైగా ఆందోళన : తాడికొండ, రావెల, మందపాడు, లాం, పొన్నెకల్లుతో పాటు మేడికొండూరు మండలం నుంచి పెద్ద సంఖ్యలో రైతులు ట్రాక్టర్లలో పేరేచర్ల గుంటూరు బ్రాంచ్‌ కెనాల్‌ వద్దకు చేరుకొని ప్రధాన రహదారిపై బైఠాయించి  గంటకుపైగా ధర్నా నిర్వహించారు. వారబందీ పేరిట ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని, ప్రభుత్వ విధానాల వలన రైతులు తీవ్రస్థాయిలో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వారబందీ వలన పంటలకు నీరు సక్రమంగా అందడం లేదని వారు తెలిపారు. విషయం తెలుసుకొన్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని వైఎస్సార్‌ సీపీ నాయకులు, రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసిన రైతులు ససేమిరా అంటూ ఎక్కడివారు అక్కడే బైటాయించారు. ఇరిగేషన్‌ అధికారులు రావాలని, అప్పుటి వరకు కదిలే ప్రసక్తి లేదని రైతులు మొండికేశారు. విషయం తెలుసుకొన్న ఇరిగేషన్‌ ఏఈ ఉమాశంకర్‌ ఘటనా స్థలానికి వచ్చి రైతులతో మాట్లాడి తప్పనిసరిగా దిగువ భూములకు నీరందిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. గంటకు పైగా ధర్నా నిర్వహించడంతో గుంటూరు–హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై రాకపోకలు స్తంభించాయి.

పాలడుగు అడ్డరోడ్డు వద్ద రాస్తారోకో
ధర్నా విరమించిన కొద్ది సేపటికి పాలడుగు అడ్డరోడ్డు వద్ద కొర్రపాడు, పాలడుగుతో పాటు వివిధ గ్రామాలకు చెందిన వందలామంది రైతులు అక్కడ రాస్తారోకోకు దిగారు. దీంతో పోలీసులు వారికి స్పష్టమైన హామీ ఇప్పించి ఆందోళన విరమింపజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ మేడికొండూరు, తాడికొండ మండల కన్వీనర్లు కందుల సిద్ధయ్య, బ్రహ్మారెడ్డి, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి ఆవుల సంజీవరెడ్డి, పేరేచర్ల ఎంపీటీసీలు చీలి నాగేశ్వరరావు, నేతలు ఉడతా శ్రీనివాసరావు, అబ్బాస్, కొరివి కిషోర్, సయ్యద్‌ సుభాని, రసూల్, పల్లెపోగు బుజ్జి, బుల్లా పంతులు, అల్లు శ్రీనివాసరెడ్డి, అవుతు శ్రీనివాసరెడ్డి, తాళ్ల శ్రీనివాసరెడ్డి, ఆళ్ల హనుమంతరావు, దేవదాసు, దాసరి రాజు, వెంకటస్వామి, వీరారెడ్డి, బాజి తదితరులు పాల్గొన్నారు. 

పంటలు ఎండిపోతున్నాయి
పత్తి, మిరప పంటలు సాగు చేశాను. సాగునీరు ఇప్పటి వరకు సక్రమంగా అందలేదు. ఏం చేయాలో తోచని పరిస్థితి. పత్తికి వర్షం సరిగా లేనందున దిగుబడి ఆశించినంత రాలేదు. ఐదు క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా రాని పరిస్థితి దాపురించింది. వారబందీ వలన మరింత ఇబ్బంది పడుతున్నాం.
    వి.లక్ష్మీనారాయణ, రైతు, రావెల

వారబందీ ఎత్తివేయాలి
ప్రభుత్వం వారబందీ పెట్టటం ద్వారా రైతులు తీవ్రస్థాయిలో నష్టపోతున్నారు. మిర్చి సాగు చేసే రైతులకు బొబ్బ రు తెగులు వచ్చి కొన్ని చోట్ల పంట పీకేస్తున్నారు. సాగు నీరు సక్రమంగా అందించి వారబందీ ఎత్తివేయక పోతే పెద్ద ఎత్తున ఉద్యమించటానికి వైఎస్సార్‌ సీపీ సిద్ధంగా ఉంది. ప్రభుత్వం తన నిర్ణయాన్ని తక్షణమే మార్చుకోవాలి.
–ఆవుల సంజీవరెడ్డి, వైఎస్సార్‌ సీపీ, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top