కరువు ఉరిమింది.. బతుకు బరువైంది

Farmers Facing Many Problems In Prakasam - Sakshi

వరుస కరువులతో రైతన్న వలవల ఏడ్చేను.. తోటలు ఎండుతుంటే రైతు గుండె చెరువాయే.. ఏడ్చనీకి కన్నీళ్లు రాక.. గుండె తడారిపాయే..! భూమి తవ్వినా బూడిదే మిగిలే.. భూమినే నమ్ముకున్న బతుకు బుగ్గిపాలాయే.. కన్నీళ్లింకే.. కాళ్లల్లో సత్తువ తగ్గే.. కూడు పెట్టే మనిషి కాటికి పయనమాయే..!! 

సాక్షి, పెద్దారవీడు (ప్రకాశం): తీవ్ర వర్షాభావంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వర్షాలు లేక వివిధ పంటలు సాగు చేసిన రైతులకు పెట్టుబడి కూడా దక్కడం లేదు. దీంతో చేసిన అప్పులు తీరేమార్గం కనిపించక రైతులు ఇతర ప్రాంతాలకు వలస బాటపడుతున్నారు. పశుగ్రాసం కొరతతో పాడి రైతులు పశుసంపదను కబేళాలకు తరలిస్తున్నారు. వరుస కరువులతో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటడంతో పత్తి, మిరప కంది, జోన్న, కూరగాయల తోటలు నిట్ట నిలువునా కళ్ల ఎదుటే ఎండిపోతున్నాయి.

దీంతో కంటికి రెప్పలా కన్న బిడ్డల కంటే ఎంతో మక్కువతో పెంచుకున్న తోటలు ఎండిపోతుంటే రైతుల గుండె చెరువై పోతోంది. ఈ ఏడాది రబీ, ఖరీఫ్‌లో పత్తి, మిరప, కంది, తదితర పంటలు పూర్తిగా తుడిచిపెట్టుకు పోయాయి. దీంతో కోట్ల రూపాయల మేర రైతులకు నష్టం వాటిల్లింది. వందల అడుగుల లోతు బోర్లు వేసినా చుక్క నీరు పడలేదు. పంటలను కాపాడేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రైతుల వ్యథలను ప్రభుత్వం, అధికార యంత్రాంగం పట్టించుకున్న పాపాన పోలేదు. 

నీరు లేక విలవిల
నియోజకవర్గంలో చెరువులు, కుంటల్లో చుక్క నీరు లేక ఎడారులను తలపిస్తున్నాయి. ఏటా వర్షపాతం నమోదులో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటాయి. ఫలితంగా సాగు, తాగు నీటికి ఇక్కట్లు పడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. మండలంలో ఇరిగేషన్‌కు సంబంధించిన చెరువులు 10 ఉన్నాయి. ఒక్క చెరువులోనూ చుక్క నీరు లేదు. వర్షాభావం కారణంగా చెరువులు, కుంటలు నీళ్లు లేక బావురుమంటున్నాయి. చెరువుల్లో నీళ్లు ఉంటే సమీపంలోని బోరు బావుల్లో కూడా నీళ్లు పుష్కలంగా ఉంటాయని రైతులు అంటున్నారు. వేసవిలో పంటల సాగుపై రైతుల్లో అయోమయం నెలకొంది. 
పచ్చని పంటలతో కళకళలాడాల్సిన పొలాలు బీటలు వారుతున్నాయి.

ట్రాక్టర్‌ గడ్డి రూ. 15 వేలు  
కరువు కారణంగా పచ్చిగడ్డి కరువైంది. దీనికితోడు పంటలు లేకపోవడంతో పాడి రైతులకు పశుపోషణ భారంగా మారింది. దీంతో మండలంలోని పాడి రైతులు ట్రాక్టర్‌ గడ్డికి రూ. 12 నుంచి రూ. 15 వేలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందక గ్రామీణ పాడి రైతులు ఇక్కట్లు పడుతున్నారు. 

గ్రాసం లేక పోషణ భారమై 
 నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులు పాడి రైతులకు శాపంగా మారింది. పచ్చిగడ్డి కూడా కరువైంది. గ్రాసం కొరతతో పాడి రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పశు పోషణ భారమై దిక్కు తోచడంలేదు. కరువు నేపథ్యంలో జీవాల పోషణ భారమై మేకలు, గొర్రెల పెంపకందారులు తమ జీవాలను గుంటూరు జిల్లా గురజాల, సత్తెనపల్లె లాంటి ప్రాంతాలకు తరలిస్తున్నారు. 

కష్టాల నుంచి గట్టెక్కవచ్చు

 
వర్షాలు కురుస్తాయో లేదోనని ఆలోచించి పంటలు పంటలు సాగు చేయాలి. రైతులకు ఉచితంగా వ్యవసాయ బోర్లు వేయిస్తే కరువు కాలం కష్టాల నుంచి గట్టెక్కవచ్చును. ఇప్పుడున్న పరిస్థితుల్లో వర్సాలు లేకపోవడంతో బోరు 600 అడుగులు వేస్తేగానీ నీరు పడటంలేదు. దీంతో రైతులు సాహసం చేయలేక వెనుకడుగు వేస్తున్నారు. జగన్‌ ఇచ్చిన ప్రకారం ఉచితంగా వ్యవసాయ బోర్లు వేస్తే ధైర్యంగా  వ్యవసాయం చేయవచ్చు. జగన్‌ హామీలు అమలైతే మళ్లీ రైతు రాజ్యం వస్తుంది. 
– ఏర్వ వెంకటనారాయణరెడ్డి, చట్లమిట్ల

ప్రభుత్వం రైతులను ఆదుకుంటేనే భవిష్యత్తు


ఏ ప్రభుత్వమైనా రైతులను అన్ని విధాల అదుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఏ మాత్రం రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. రైతులంతా ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నారు. ఇక రైతులను ఎవరు బాగుపర్చుతారు. రైతుకు ఏం అవసరమో తెలుసుకుని వారి జీవితాలకు భరోసా ఇచ్చిన వైఎస్సార్‌కు సాటిలేరు. చంద్రబాబు పాలనలో అవినీతి ఏరులై పారుతోంది తప్ప రైతులకు ఒరిగిందేమీ లేదు. 
– బూస పెరయ్య, చాట్లమడ అగ్రహారం

పెట్టబడికి ఇబ్బంది ఉండదు


దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హాయంలో రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతు రాజ్యం నడిచింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలకు అనుగుణంగా రైతుల శ్రేయస్సు గురించి ఆలోచించే వ్యక్తి జగన్‌మోణ్‌రెడ్డి మాత్రమే. జగన్‌మోహన్‌రెడ్డి రైతు భరోసా కింద రైతులకు ఉచిత బొర్లతో పాటు పెట్టుబడి సాయం కింద ఏడాదికి రూ 12,500 ఇస్తామంటున్నారు. పెట్టుబడి కోసం రైతులు బ్బందులు పడాల్సిన అవసరం ఉండదు. 
–బొచ్చు ఆంజనేయరెడ్డి, సానికవరం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top