అన్న దౌర్జన్యాన్ని ఎదుర్కోలేక తమ్ముడి ఆత్మహత్య | Farmer Suicide Attempt in Medak | Sakshi
Sakshi News home page

అన్న దౌర్జన్యాన్ని ఎదుర్కోలేక తమ్ముడి ఆత్మహత్య

Sep 24 2013 1:34 AM | Updated on Nov 6 2018 7:53 PM

‘‘ఇల్లు అమ్మనివ్వటం లేదు. ఎవరినీ కొన నీయటం లేదు. ఉన్న ఇల్లు అమ్మి నా చిన్నకూతురు పెళ్లి చేద్దామంటే నా అన్న, అతని కొడుకులు...

మెదక్ రూరల్, న్యూస్‌లైన్: ‘‘ఇల్లు అమ్మనివ్వటం లేదు. ఎవరినీ కొన నీయటం లేదు. ఉన్న ఇల్లు అమ్మి నా చిన్నకూతురు పెళ్లి చేద్దామంటే నా అన్న, అతని కొడుకులు... అడుగడుగునా అడ్డుపడుతున్నారు. ఇక జీవితంలో నా కూతురు పెళ్లి చేయలేను, అతని దౌర్జన్యం ముందు నేను నిలబడలేక పోతున్నా... గ్రామపెద్దలారా...మీరే న్యాయం చేయండి. ఎస్‌ఐగారూ నా ఆత్మహత్యకు కారణమైన నా అన్నను, అతని కొడుకులను చట్టప్రకారం శిక్షించండి’’ అంటూ సూసైడ్ నోట్ రాసిన ఓ వ్యక్తి తొలుత విషం తాగి, అనంతరం తన అన్న ఇంటి ఎదుట ఉన్న ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
 
 హృదయవిదారక ఈ సంఘటన మెదక్ మండలం పోచమ్మరాళ్‌లో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం...మెదక్ మండల పరిధిలోని పోచమ్మరాళ్ గ్రామానికి చెందిన బీర్ల మల్లయ్య(40), బీర్ల నారాయణలు అన్నదమ్ములు. బీర్ల మల్లయ్యకు ముగ్గురు కూతుళ్లు సంతానం. నాలుగేళ్ల క్రితమే భార్య మృత్యువాతపడింది. తన వాటాగా వచ్చిన భూములను విక్రయించిన మల్లయ్య ఆ వచ్చిన సొమ్ముతో ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు జరిపించాడు. పొలాలన్నీ అమ్మివేయగా మల్లయ్యకు ఓ ఇల్లు, ఆ ఇంటి ముందు ఖాళీ స్థలం మిగిలింది.
 
 దీంతో వాటిని కూడా విక్రయించి చిన్నకూతురు పెళ్లి చేయాలని భావించాడు. అందుకోసం తన ఇళ్లు ఖాళీ చేసి ఊళ్లోనే ఉన్న అల్లుడి ఇంట్లో చిన్నకూతరుతో సహా ఉంటున్నాడు. అయితే మల్లయ్య తన ఇంటిని అమ్మేందుకు ప్రయత్నించగా అతని అన్న బీర్ల నారాయణ, అతని కుమారులు అడ్డుకున్నారు. అంతేకాకుండా తాము కొనం, ఇతరులను కొననివ్వమంటూ పేచీ పెట్టారు. దీంతో తగవు గురించి తెలుసుకున్న గ్రామస్తులెవరూ మల్లయ్య ఇంటిని కొనేందుకు ముందుకు రాలేదు. దీంతో మల్లయ్య కొన్నిరోజులుగా తీవ్ర ఆవేదనలో ఉన్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి ఓ పుస్తకంలో తన ఆత్మహత్యకు గల కారణాలన్నీ రాసి కూల్‌డ్రింక్‌లో విషం కలుపుకుని తాగాడు. అనంతరం అక్కడ నుంచి తన అన్న నారాయణ ఇంటి వద్దకు వెళ్లి ఇంటి ఎదుటే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం ఆ రోడ్డు వెంట వెళ్లేవారు గమనించి విషయాన్ని కుటుంబీకులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న మెదక్ రూరల్ ఎస్‌ఐ వేణుకుమార్ కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
 
 న్యాయం చేసి ఆదుకోండయ్యా....
 బీర్ల మల్లయ్య మృతితో అతని కూతుళ్లు ముగ్గురూ శోకసంద్రంలో మునిగిపోయారు. గతంలోనే తమ తల్లి చనిపోయిందనీ, ఇపుడు తండ్రి ఆత్మహత్య చేసుకోవడంతో తాము దిక్కలేనివారమయ్యామంటూ రోదించారు. తమ పెదనాన్న నారాయణ, అతని కుమారులు వల్లే తమ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని వారిని కఠినంగా శిక్షించాలన్నారు. తండ్రి మృతదేహంపై పడి వారు రోదించిన తీరు చూసి స్థానికులు కూడా కంటతడి పెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement