అసెంబ్లీ  టు అసెంబ్లీ  నిరసన పరుగు

Farmer Son Run Assembly to Assembly - Sakshi

గిట్టుబాటు ధర కోసం రైతుబిడ్డ వినూత్న చర్య

రేపు హైదరాబాద్‌లో మొదలు, 19న అమరావతిలో ముగింపు

సాక్షి, హైదరాబాద్‌: అన్నదాతకు మద్దతుగా ఓ రైతుబిడ్డ వినూత్న నిరసనకు సమాయత్తమవుతున్నాడు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ చేస్తూ సుదీర్ఘ పరుగుకు శ్రీకారం చుట్టాడు. ఈ నెల 14న హైదరాబాద్‌లోని అసెంబ్లీ నుంచి పరుగు మొదలు పెట్టనున్నాడు. ఇది ఈ నెల 19న అమరావతిలోని ఏపీ అసెంబ్లీ వద్ద ముగియనుంది. గిట్టుబాటు ధర కల్పించాలన్న లక్ష్యంతో పరుగు చేపట్టనున్నట్లు వెంకట ఫణీంద్రకుమార్‌ అనే యువకుడు ‘సాక్షి’కి తెలిపారు. కృష్ణా జిల్లా అప్పికట్లకు చెందిన ఫణీంద్ర గుడివాడలో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చదివాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆర్‌ఆర్‌బీ ఇంజనీరింగ్‌ టెక్నాలజీస్‌ సంస్థలో అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్నాడు. 

తండ్రి నాగరాజు కౌలురైతు. గిట్టుబాటు ధర దక్కక ఏటా తన తండ్రి దిగాలు చెందేవాడని, 26 ఏళ్లుగా అదే పరిస్థితి అని పేర్కొన్నాడు. పంటలు బాగున్నప్పుడు ధరలు పతనమవుతున్నాయని, పంటలు బాగాలేనప్పుడు ధరలు పెరిగిపోతున్నాయని, దీంతో రైతులు ఆర్థికంగా చితికిపోయి ఆత్మహత్యలకు పాల్ప డుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ‘కాలం బాగుందని అప్పు చేసి పత్తి, మినుములు, మిర్చి వంటి వాణిజ్య పంటలను రైతులు సాగుచేస్తున్నారు, తీరా పంటలు చేతికి అందే సమ యంలో దిమ్మతిరిగేలా ధరలు పడిపోతున్నాయి. దీంతో అన్నదాతలకు దిక్కుతోచడం లేదు’అని పేర్కొన్నాడు. తన పరుగుతో 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు కనువిప్పు కలిగి అన్నదాతలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నాడు. తనకు ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని స్పష్టం చేశాడు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top