పంట ఎండి.. కడుపు మండి..

farmer Removed Loss Crop In Kurnool - Sakshi

కర్నూలు, కృష్ణగిరి: ఈ ఖరీఫ్‌ అన్నదాతలను పూర్తిగా ముంచేసింది. ఏ గ్రామమెళ్లినా ఎండిన పంటలు.. అన్నదాతల కంట కన్నీళ్లే  కనిపిస్తున్నాయి. కృష్ణగిరి మండలంలో ఈ ఖరీఫ్‌లో 12,162 హెక్టార్లలో వేరుశనగ, 4,092 హెక్టార్లలో పత్తి, 2,024హెక్టార్లలో ఆముదం, 4, 284 హెక్టార్లలో కంది పంటలను సాగు చేశారు. మొదటి నుంచి వర్షాభావ పరిస్థితులు వెంటాడుతుండడంతో వేరుశనగ పంట పూర్తిగా ఎండిపోయింది. దీంతో రైతులు ఆశలు వదిలేసుకున్నారు. కొందరు రైతులు పంటను తొలగించేస్తున్నారు. అమకతాడు గ్రామంలో శుక్రవారం కె.రామకృష్ణ, తలారి కుళ్లాయి అనే రైతులు తమ పొలాల్లో ఎండిన వేరుశనగ పంటను ఎద్దులతో తొలగించారు.  ఇలా మండల వ్యాప్తంగా పంటను తొలగించేందుకు చాలామంది సిద్ధమయ్యారు. విత్తనాలు, సేద్యాలు, ఎరువులు, కూలీల ఖర్చుల కింద ఎకరాకు రూ.15 వేల వరకు ఖర్చు చేసినట్లు రైతులు తెలిపారు.  మండలంలో ఇలాంటి పరిస్థితులు గత 60 ఏళ్లలో ఎన్నడూ చూడలేదని చెబుతున్నారు.   

ఇంత దారుణం ఎన్నడూ చూడలేదు
ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ చూడలేదని మా పెద్దలు కూడా అంటున్నారు. నాకు 18ఎకరాల భూమి ఉంది. నాలుగు ఎకరాల్లో వేరుశనగ, ఐదు ఎకరాల్లో పత్తి, మరో 9ఎకరాల్లో కంది పంటను జూన్‌ 10, 11తేదీల్లో సాగు చేశా.  పంట సాగు చేసినప్పటి నుంచి ఇంతవరకు చిరుజల్లులే తప్పా భారీ వర్షం పడలేదు. వేరుశనగ, పత్తిసాగుకు ఎకరాకు రూ.15 వేల వరకు ఖర్చు పెట్టా.  వర్షం లేక పంట ఎండిపోతుంటే గుండె తరుక్కుపోతోంది. అందువల్లే వేరుశనగ తొలగించేస్తున్నా. పత్తి ఎలాంటి ఎదుగుదల లేకపోవడంతో గొర్రెలకు మేపేశాం.  వేరుశనగ పంటపై మందులు పిచికారీ చేయడంతో పశువుల మేతకు కూడా పనికి రాకుండా పోయింది. కష్టాల్లో ఉన్న మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి.– రామకృష్ణ, అమకతాడు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top