చంద్రబాబు చరిత్ర మోసాలమయమే


 • రైతు దీక్షలో ధ్వజమెత్తిన నేతలు  

 •  అధికార దాహంతో హామీలు గుప్పించి.. సీఎం అయ్యాక ప్రజలను దగా చేశారు

 •  ప్రజల పక్షాన పోరాటంలో ప్రతిపక్ష నేతగా జగన్ తన బాధ్యత నిర్వర్తిస్తున్నారు

 •  బాబుపై రైతు దీక్షలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతల మండిపాటు

 • తణుకు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘‘మంత్రి పదవి ఇచ్చిన కాంగ్రెస్‌కు చెయ్యిచ్చి తెలుగుదేశం పార్టీ పంచన చేరిన అవకాశవాది చంద్రబాబు.. కూతుర్నిచ్చి పెళ్లి చేసి, పదవులు ఇచ్చి గౌరవం పెంచిన మామను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవిని కాజేసిన చరిత్ర హీనుడు చంద్రబాబు.. తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలను వంచించి పదేళ్ల విరామం తరువాత అధికార దాహంతో హామీలు గుప్పించి తీరా సీఎం కుర్చీ ఎక్కాక ప్రజలను దగా చేస్తున్న చంద్రబాబు చరిత్ర మొత్తం మోసాలమయమే’’ అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రిపై పలువురు నేతలు నిప్పులు చెరిగారు. చంద్రబాబు హామీల అమలు కోరుతూ రైతులు, మహిళలకు బాసటగా ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి శనివారం పశ్చిమగోదావరి జిల్లా తణుకులో చేపట్టిన రైతుదీక్షలో పలువురు నేతలు మాట్లాడుతూ.. చరిత్రలో నిలచిపోయే రాజధాని నిర్మిస్తానని చెబుతున్న చంద్రబాబు.. వాస్తవానికి ప్రజలను మోసంచేయడంలో చరిత్రలో నిలిచిపోతాడంటూ ధ్వజమెత్తారు. ప్రజల పక్షాన పోరాటంలో ఎంత కష్టమైనా వెన్నుచూపని, మడమతిప్పని జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా తన బాధ్యతలను నిర్వర్తిస్తుంటే.. పాలక టీడీపీ నేతల వెన్నులో వణుకు పుట్టి అవాకులు చెవాకులు పేలుతున్నారని వారు మండిపడ్డారు. నిరంతరం ప్రజల తరఫున నిలిచి పోరాడే తత్వం వై.ఎస్.రాజశేఖరరెడ్డి వారసుడైన జగన్క్త్రంలోనే ఉందని ఉద్ఘాటించారు. ఆయా నేతల ప్రసంగాల్లోని ముఖ్యాంశాలు వారి మాటల్లోనే...

  బాబు మారలేదు

   ‘‘తాను మారానని గతంలో చేసిన తప్పులు చేయననీ, తనను నమ్మాలని ఎన్నికల్లో ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏ మాత్రం మారలేదు. రైతులు, మహిళలను తేలిగ్గా మోసం చేయొచ్చనే భావనతోనే చంద్రబాబు రుణ మాఫీ హామీలు ఇచ్చారు. మోసపోయిన ప్రజలు కన్నెర్ర చేస్తే ఆగ్రహంతో కొట్టుకుపోతారని చంద్రబాబుకు ప్రజలు తెలియచేయాలి.’’

  - ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి

   

  సీమలో ఎన్నడూ లేనంత కరువు

   ‘‘రాయలసీమలో గతంలో ఎన్నడూ లేనంత కరువు వుంది. వరి మద్దతు ధర దారుణంగా పడిపోయింది. వేరు శెనగ ధరా అలానే వుంది. బ్యాంకులు ఈ సీజన్‌కు రూ. 55 వేల కోట్ల రుణ లక్ష్యాన్ని పెట్టుకుంటే 10 శాతం కూడా ఇవ్వలేకపోయారు. రుణ మాఫీ తీరే ఇందుకు కారణం.  అనంతపురం జిల్లాలోనే రూ. 700 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ రైతులు కోల్పోయారు.  ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధం కావాలి.’’   

  - విశ్వేశ్వరరెడ్డి, ఉరవకొండ ఎమ్మెల్యే

   

  జగన్‌పైనే జనం నమ్మకం

   ‘‘చంద్రబాబు మోసాలను ఎండగడుతూ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి దీక్ష చేపట్టడం ప్రజల కు భరోసా ఇచ్చినట్లయింది. చంద్రబాబు కుటిల రాజకీయాలు అందరికీ అర్థం అవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో జగన్ మీదే జనం నమ్మకం పెట్టుకున్నారు.’’

   - ఎంఎల్‌సీ మేకా శేషుబాబు

   

  జనం కోసం జగన్ దీక్ష

   ‘‘ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రాజధాని జపం చేస్తున్న చంద్రబాబుకు కనువిప్పు కలిగేలా జగన్‌మోహన్‌రెడ్డి రైతు దీక్ష చేపట్టారు. ఆయన దీక్షను చూసి కంగారు పడిన టీడీపీ నేతలు పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారు. అధికారం కోసం అనేక హామీలు గుప్పించిన బాబు మెడలు వంచేందుకు, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ప్రజలకు మేలు చేసేందుకు ప్రతిపక్ష నేతగా జగన్‌మోహన్‌రెడ్డి తన బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. ప్రజా సమస్యలను వదిలి చంద్రబాబు రాజధాని, యోగా అంటూ కొంగజపం చేస్తున్నారు. తట్టలో రాయి తీయలేని వాడు.. నోట్లోకి వెళ్లిన రాయిని తీస్తాలే అన్నట్టుగా ఉంది చంద్రబాబు తీరు. ఉద్యోగులకు జీతాలు లేవంటూనే మంత్రుల విదేశీ విహారయాత్రలు, బాబు ప్రత్యేక విమానాల యాత్రలకు డబ్బులు దుబారా చేయడానికి ఎలా వస్తున్నాయో ఆయన ప్రజలకు చెప్పాలి. రాజధాని నిర్మాణం కోసం సింగపూర్, మలేసియా, జపాన్‌లు తిరుగుతున్న చంద్రబాబు తెలుగు రాష్ట్రంలోని తెలుగువారి పరువు తీస్తున్నారు. పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న బాబు ఏడు నెలల కాలంలోనే ప్రజలకు రాక్షస పాలన చూపిస్తున్నారు.’’    

  - ఆర్.కె.రోజా, ఎమ్మెల్యే

   

  హామీల చంద్రబాబు గౌరవంగా తప్పుకోవాలి

   ‘‘అధికారంలోకి వస్తే చాలనే ఆలోచనతో హామీలు గుప్పించిన చంద్రబాబు వాటిని తాను అమలు చేయలేనని చేతులెత్తేసి గౌరవంగా తప్పుకోవాలి. రుణ మాఫీ చేయకుండా చేసినట్లు సన్మానాలు చేయించుకోవడం, అభివృద్ధిని పక్కకు పెట్టి యోగాలు, డ్యాన్సులు చేయడం చంద్రబాబుకే చెల్లింది. జగన్ ప్రజల కోసం దీక్షచేపట్టడం రాష్ట్రానికి వరం.’’

   - కాకాణి గోవర్ధన్‌రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే

   

  అబద్ధాల్లో చంద్రబాబు రికార్డు

  ‘‘అబద్ధాల్లోను, మాట మార్చడంలోను చంద్రబాబు రికార్డు నెలకొల్పారు. బాబు నోట నిజం మాట రాదు. అబద్ధాల బాబు, వాగ్ధానాల బాబు, ఆల్ ఫ్రీ బాబుగా ఆయనకు ఎన్నో బిరుదులు ఇవ్వొచ్చు. పిల్లనిచ్చిన మామను మోసం చేసి పదవిని లాక్కున్నాడు. ఇప్పుడు తనకు ఇదే ఆఖరి అవకాశం అనుకుని నోటికొచ్చిన వాగ్దానాలు చేసి, తీరా గెలిచాక వాటిని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నాడు. మాట ఇస్తే నెరవేర్చాలన్న కార్యశుద్ధి వైఎస్ తనయుడు జగన్‌లో చూశాను. జగన్‌మోహన్‌రెడ్డికి వస్తున్న జనాదరణను చూసి బాబుకు గుండెల్లో దడ పుడుతోంది. రుణమాఫీ అమలు చేయడం చేతకాని బాబు ఇప్పుడు రాజధాని పేరుతో రెండు, మూడు పంటలు పండే సారవంతమైన భూములను లాగేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అన్నదాతలు ఆగ్రహిస్తే.. మహిళామ తల్లులు ఆక్రోశిస్తే బాబు అడ్రస్ గల్లంతే. రైతు దీక్షకు వచ్చిన స్పందన చూస్తే ఇక రోజూ మాకు ధర్నాలు, దీక్షలు చేయాల్సిన అవసరం ఏర్పడుతోంది.’’    

  - నందమూరి లక్ష్మీపార్వతి

   

  దగాపడ్డ రైతులు, మహిళల కోసం దీక్ష

   ‘‘చంద్రబాబు మోసాలతో దగా పడిన రైతులు, మహిళలను ఆదుకోవడానికే జగన్ దీక్ష చేస్తున్నారు. ప్రభుత్వం మెడలు వంచేందుకే ఈ దీక్ష జరుగుతోంది. చంద్రబాబు హామీలను నమ్మి మోసపోయిన పశ్చిమగోదావరి జిల్లా వాసులకు అండగా నిలిచేందుకు జగన్ దీక్ష చేయడం అభినందనీయం.’’

   - ఆళ్ల నాని, వైఎస్సార్ సీపీ ప.గో. జిల్లా అధ్యక్షుడు

   

  బాబొచ్చాడు.. జాబు పోయింది

  ‘‘బాబొస్తే జాబు వస్తుంది అని ఎన్నికల్లో ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు ఆయన సీఎం అయ్యాక ఉన్న జాబులు కూడా పోయాయి. రైతు రుణ మాఫీ కోసం తొలి సంతకం చేస్తానని చెప్పిన చంద్రబాబు కోటయ్య కమిటీని వేసి హామీలను కృష్ణార్పణం చేశారు.’’

   - కారుమూరు నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే

   

  అభివృద్ధిలో బాబు తెల్లముఖం

   ‘‘ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏడు నెలల్లో ప్రజలకు చేసిందేమీ లేదు. తెల్లకాగితాలు (శ్వేత పత్రాలు) విడుదల చేసి గొప్పలు చెప్పుకున్న సీఎం చంద్రబాబు అభివృద్ధిలో తెల్లముఖం వేస్తున్నారు. బాబు మోసపూరిత హామీలపై ఇంటింటికీ తీసుకు వెళ్లి ప్రచారం చేయాలి.’’

   - మేరుగ నాగార్జున, వైఎస్సార్‌సీపీ ఎస్‌సీ సెల్ అధ్యక్షుడు

   

   వ్యవసాయాన్ని ఆదుకుంది ఎన్‌టీఆర్, వైఎస్‌ఆర్‌లే

   ‘‘రాష్ట్రంలో వ్యవసాయానికి ఉతమిచ్చి రైతును ఆదుకుంది ఎన్‌టీఆర్, వైఎస్‌ఆర్‌లే. వైఎస్ ఉచిత విద్యుత్ ఇస్తే తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని చంద్రబాబు అపహాస్యం చేశారు. వైఎస్ వ్యవసాయాన్ని పండగ చేస్తే చంద్రబాబు దండగ అన్నారు. రుణ మాఫీపై రోజుకో మాట మార్చి రైతులను చంద్రబాబు దగా చేశారు.’’     

  - ఎం.వి.ఎస్.నాగిరెడ్డి, వైఎస్సార్ సీపీ రైతు విభాగం అధ్యక్షుడు

   

   బాబు నిజం చెప్పరు

   ‘‘చంద్రబాబు ఎప్పుడూ నిజం చెప్పరు. ఆ అలవాటే ఆయనకు లేదు. అందుకే జనాన్ని మోసగించే హామీలు ఇచ్చి సీఎం అయ్యారు. ఇప్పుడు జగన్ దీక్షను చూసి టీడీపీ నేతలు గుబులు చెందుతున్నారు.’’

   - గౌస్ లాజం, వైఎస్సార్ సీపీ మైనారిటీ సెల్ కార్యదర్శి

   

   హామీల్లో చంద్రబాబుది ప్రపంచ రికార్డు

   ‘‘అధికారం కోసం ఎన్ని హామీలైనా ఇవ్వొచ్చని నిరూపించి చంద్రబాబు వరల్డ్ రికార్డు నెలకొల్పారు. మోసాల్లో ఆరితేరిన చంద్రబాబు బండారం రెండు నెలల్లోనే బయటపడింది. రుణ మాఫీ సక్రమంగా అమలు చేయలేక రాజధాని, ఇతర సాకులతో కాలయాపన చేస్తున్నారు.’’

   - కోలగట్ల వీరభద్రస్వామి, వైఎస్సార్ సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు

   

  రైతులు, మహిళా సంఘాల ఆవేదన

   

  బాబు నిజస్వరూపం తెలిసింది...

   ‘‘మా ఇంట్లో డ్వాక్రా, పంట రుణాలు మూడున్నా యి. ఇందులో ఒక్కటి కూ డా మాఫీ కాలేదు. మూడు లోన్లకు ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు నమ్మి ఆయన సీఎం అవుతూనే అప్పులన్నీ మాఫీ చేస్తారని నమ్మి మోసపోయాము. బాబు నిజ స్వరూపం ఏమిటో ఇప్పుడు తెలిసింది. ఇది డ్వాక్రా మహిళలందరికీ గుణపాఠం కావాలి. బాబును  దించేవరకు మనం నిద్ర పోకూడదు.’’     

  - జానకి, చింతలపూడి ,డ్వాక్రా మహిళా సంఘం సభ్యురాలు

   

   నమ్మించి నట్టేట్లో ముంచారు...

   ‘‘డ్వాక్రా రుణ మాఫీ అని చంద్రబాబు మమ్మల్ని మో సం చేశారు. ఎన్నికలప్పుడు మా అప్పులున్నీ మాఫీ చేస్తానని చెప్పడంతో మహిళలు ఆయనకు ఓట్లేశారు. ఎన్నికలయ్యాక దీని గురించి పట్టించుకోకుండా జ పాన్, సింగపూర్ అంటూ తిరుగుతున్నారు. రుణా లు మాఫీ చేస్తే నాకు కొంతైనా మేలు జరుగుతుం దని అనుకున్నాను. చంద్రబాబు నన్ను కూడా నమ్మించి నట్టేట్లో ముంచారు. మాఫీ చేయకపోతే బాబును మహిళలు ఇక జన్మలో నమ్మరు.’’

   - గంపల బ్రహ్మవతి, ఏలూరు,డ్వాక్రా సభ్యురాలు

   

   రాజధాని పేరుతో భూ దందా

   ‘‘విజయవాడను రాజధానిగా ప్రకటించిన చంద్రబాబు ల్యాండ్ పూలింగ్ పేరుతో 35 వేల ఎకరాలు సేకరించి రైతులను దగా చేస్తున్నారు. సొంత మనుషుల కోసం భూ దందాలు, కబ్జాలను ప్రోత్సహిస్తున్నారు. వ్యవసాయ భూములను  కాజేయడం చాలా దారుణం. ’’

   - వంగవీటి రాధా, వైఎస్సార్ సీపీ  యువజన విభాగం అధ్యక్షుడు


  బ్రిటిష్ వాళ్లే నయం

   ‘‘చంద్రబాబు పాలన కంటే బ్రిటిష్ పాలనే న యంగా ఉంది. ప్రజా వ్యతిరేక విధానాల్లో బ్రి టిష్ వాళ్ల కంటే చంద్రబాబు అపఖ్యాతి మూ టగట్టుకున్నారు. రైతులు, మహిళలు, అన్ని వర్గా ల వారిని మోసం చేశారు.’’

    - తెల్లం బాలరాజు, వైఎస్సార్ సీపీ ఎస్‌టీ సెల్ అధ్యక్షుడు

   

  అందర్నీ హోల్‌సేల్‌గా మోసం చేశారు...

   ‘‘మోసం, దగా, కుట్ర చంద్రబాబునాయుడు నైజం. రుణ మాఫీ, ఇంటికో  ఉద్యోగం, నిరుద్యోగ భృతి, డ్వాక్రా రుణాల మాఫీ అంటూ అంద ర్నీ హోల్‌సేల్‌గా మోసం చేశారు. రాజధాని లేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదు. చంద్రబాబు మోసాన్ని చూసి ఒక రైతుగా ఎంతో బాధపడుతున్నాను. జగన్ దీక్ష చూసైనా చంద్రబాబు మారి హామీలను అమలు చేయాలి.’’    

  - కుమార్, రైతు  నిడదవోలు, పశ్చిమగోదావరి జిల్లా

   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags:  

Read also in:
Back to Top