రైతుల్లేకుండానే సదస్సులు ! | Sakshi
Sakshi News home page

రైతుల్లేకుండానే సదస్సులు !

Published Sat, Dec 13 2014 3:58 AM

Farmer Empowerment Conference without farmers

* మమ అనిపిస్తున్న అధికారులు
విజయనగరం కంటోన్మెంట్: రైతులకు రుణమాఫీ పత్రాలు అందించేందుకు నిర్వహిస్తున్న రైతు సాధికార సదస్సుల్లో రైతులు కానరావడం లేదు. జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సులకు రైతులు హాజరు కాకపోవడంతో వెలవెలబోతున్నాయి. అప్పులున్న వారికి రుణమాఫీ వర్తించకపోవడంతో రైతులు ఈ కార్యక్రమాలపై నిరాసక్తతతో ఉన్నారు. ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన ఈ సదస్సులను రైతులు కనీసం పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్యేలు, మంత్రులు, జిల్లా అధికారులు, మం డల స్థాయి అధికారులు హాజరవుతున్న సదస్సులు జనాల్లేక చప్పగా సాగుతున్నాయి. బలిజపేట మండలం చిలకలపల్లిలో నిర్వహించిన సదస్సులో రైతులు తమకు రుణమాఫీ పత్రాలు ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు.
 
అంతేకాకుండా గ్రామంలో రూ.50వేల లోపు రుణాలు కలిగి ఉన్న రైతులు ఎక్కువ మంది ఉన్నారని, వారికి ఎందుకు మాఫీ వర్తింపజేయలేదని అధికారులను నిలదీశారు. అదేవిధంగా బలిజిపేటలో కూడా దాదాపు వందమంది రైతులకు రుణాలు వర్తింపజేయకపోవడంతో వారంతా తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. పార్వతీపురం, మున్సిపాలిటీ, రూరల్ ప్రాంతాల్లో సదస్సులు పేలవంగా జరిగాయి. సాలూరు మున్సిపాలిటీ పరిధిలోని మెంటాడ వీధి, గాడి వీధుల్లో నిర్వహించిన సదస్సులకు రైతులు కరువయ్యారు.

ఎక్కడ చూసినా రైతులు లేకపోవడంతో కొద్ది మంది మాత్రమే వచ్చిన అధికారులు కూడా తిరుగుముఖం పట్టారు. సాలూరు మండలం కందులపదం, కొట్టు పరుపు గ్రామాల్లో అధికారులు పర్యటించినపుడు రైతుల జాడ లేదు. వాస్తవానికి ఈ ప్రాంతాల్లో ఉన్న వారు అరటి రైతులు కావడంతో వారికి రుణమాఫీ వర్తించకపోవడంతో అక్కడున్న కొద్దిపాటి రైతులను గుర్తించి వారి చేతిలో రుణ విముక్తి పత్రాలను అధికారులు పెట్టి వెళ్లిపోయారు. అయితే పత్రాలిచ్చిన వారికి కూడా ఖాతాల్లో సొమ్ము పడకపోవడంతో నిరాశగా ఉన్నారు.

బొబ్బిలి, రామభద్రపురం, బాడంగి, తెర్లాం మండలాల్లో ఉన్న పలు గ్రామాల్లో రైతులు లేని సాధికార సదస్సులను అధికారులు మమ అనిపించారు. విజయనగరం డివిజన్‌లోని నెల్లిమర్ల, చీపురుపల్లి నియోజకవర్గాల్లో రైతు సాధికార సదస్సులు తూతూమంత్రంగా నడిపించారు. ఎస్‌కోట, వేపాడ, కొత్తవలస మండలాల్లో ఈ సదస్సులకు హాజరైన రైతులకు రుణమాఫీ పత్రాలు లేకపోవడం విచారకరం. చాలా మండలాల్లో అన్ని ఆధారాలు  సమర్పించిన వారికి కూడా రుణమాఫీ జరగకపోవడంతో వారంతా ఇదేం రుణమాఫీ అని సణుక్కోవడం కనిపించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement