కలహాలు తుడిపి...కాపురాలు కలిపి | Family counseling center provided in kamareddy | Sakshi
Sakshi News home page

కలహాలు తుడిపి...కాపురాలు కలిపి

Feb 9 2014 4:11 AM | Updated on Sep 2 2017 3:29 AM

2004లో కామారెడ్డి డీఎస్‌పీగా పనిచేసిన పరిమళ ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. డీఎస్‌పీ కార్యాలయ ఆవరణలో దీనికి ప్రత్యేక గదిని కేటాయించారు.

కామారెడ్డి, న్యూస్‌లైన్: 2004లో కామారెడ్డి డీఎస్‌పీగా పనిచేసిన పరిమళ ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. డీఎస్‌పీ కార్యాలయ ఆవరణలో దీనికి ప్రత్యేక గదిని కేటాయించారు. భార్య, భర్త మధ్య తలెత్తే విభేదాలతోపాటు, సంతానం ద్వారా నిర్లక్ష్యానికి గురవుతున్న తల్లిదండ్రుల సమస్యలకూ ఈ కేంద్రం పరిష్కారం చూపుతోంది. గడిచిన పదేళ్ల కాలం లో ఇందుకు సంబంధించిన నాలుగు వందలకు పైగా కేసులను  పరిష్కరించారు. విడిపోవాలనుకున్న ఎన్నో జంటలు కౌన్సెలింగ్ ద్వారా కలహాలు వదిలి అన్యోన్యంగా ఉంటున్నాయి. ఇది తమకెంతో సంతృప్తినిస్తుందని కేంద్రం నిర్వాహకులు బీఎంఎస్‌వీ భద్రయ్య అంటున్నారు.

 స్వచ్ఛందంగా
 డీఎస్‌పీ సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కౌన్సెలింగ్ కేంద్రంలో విశ్రాంత ఉపవిద్యాధికారి బీఎంఎస్‌వీ భద్రయ్య, విశ్రాంత తహశీల్దార్ పి.విశ్వనాథం, విశ్రాం త ఉద్యోగులు కుసుమ నర్సయ్య, నిట్టు విఠల్‌రావు, కుసుమ బాల్‌చంద్రం సభ్యులు. ప్రతి శనివారం వీరు కౌన్సెలింగ్ సెంటర్‌కు చేరుకుని ఇరువర్గాలతో మాట్లాడతారు. వారి సమస్యలను వింటారు.
ఒకటి, రెండు పర్యాయాలు నచ్చజెప్పి, కలహాలను తొలగించి కాపురాలను చక్కదిద్దుతున్నారు. ఎలాంటి రుసుము తీసుకోకుండా వీరంతా కౌన్సెలింగ్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. 2013లో 65 కేసులు రాగా 54 కేసులు పరిష్కారమయ్యాయని, 11 కేసులు పెండింగులో ఉన్నాయని డీఎస్‌పీ తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆరు కేసులు రాగా, మూడు కేసులు పరిష్కారమయ్యాయని, మరో మూడు ప్రాసెస్‌లో ఉన్నాయన్నారు.
 
 వివాదాలకు కారణాలు
     భర్త ఆదర్శంగా ఉండాలని కోరుకునే భార్య మనసును అర్థం చేసుకోలేకపోవడం.
     అతిగా మద్యం సేవించడం, పేకాటకు అలవాటుపడి డబ్బులు పోగొట్టి అప్పులపాలవడం.
     ఇతర మహిళలతో వివాహేతర సంబంధాలు.
     అత్తామామలను కోడలు గౌరవించకుండా, వారిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసినపుడు భర్త చికాకుపడడం.

     కొన్ని సందర్భాలలో భార్య ప్రవర్తన సరిగా లేదని భర్త ఫిర్యాదు.
     కని పెంచిన తల్లిదండ్రుల పోషణభారాన్ని సంతానం విస్మరించడం.

 వీటన్నిటికీ ‘కౌన్సెలింగ్’ ద్వారా పరిష్కారం లభిస్తోంది. దంపతులను విడివిడిగా, ఒకరి ముందు ఒకరిని, కుటుంబ సభ్యుల ముందు పిలిచి రకరకాలుగా కౌన్సెలింగ్ నిర్వహించడం ద్వారా వారి మధ్యన కలహాలు రూపుమాపే ప్రయత్నం చే స్తున్నారు.

 అత్తారింట సమస్యలతో
 కామారెడ్డి ప్రాంతానికి చెందిన ఓ ఎస్‌ఐ కూతురికి అత్తారింట సమస్యలు ఎదురుకావడంతో పోలీసులను ఆశ్రయించింది. దంపతులను కౌన్సెలింగ్ కేంద్రానికి పిలిపించి సమస్యలు తెలుసుకున్నారు. ఇద్దరూ కామారెడ్డిలో కలిసి ఉండాలని, ఇక్కడే ఏదైనా జాబ్ చేసుకోవాలని సూచించారు.  రెండు, మూడు పర్యాయాలు మాట్లాడిన తరువాత ఇద్దరి మధ్య రాజీ కుదిరింది. దీంతో  వారిద్దరూ ఇప్పుడు కామారెడ్డిలోనే కాపురం పెట్టి అన్యోన్యంగా ఉంటున్నారు.

 పెద్దలకు న్యాయం జరిగింది
 కామారెడ్డి పట్టణానికి చెందిన వృద్ధ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. ఇద్దరికి పెళ్లిళ్లు చేశారు. తరువాత ఓ ఇల్లు నిర్మించుకుని ఉంటున్నారు. ఒక అల్లుడు వారిని బాగానే చూసుకునేవారు. మరో అల్లుడు పట్టించుకునేవాడు కాదు. పైగా ఆస్తి పంచి ఇవ్వమని వేధించాడు. తమ మరణానంతరం ఆస్తి ఇద్దరు కూతుళ్లకే దక్కుతుందని చెప్పినా వినిపించుకోలేదు. దీంతో ఆ వృద్ధ దంపతులు కౌన్సెలింగ్ కేంద్రాన్ని ఆశ్రయించారు. నిర్వాహకులు కూతుళ్లు, అల్లుళ్లను పిలిపించి మాట్లాడారు.పెద్దవారిని బాగా చూసు కుంటే వారే ఆస్తి ఇస్తారని నచ్చజెప్పడంతో వారు కలిసిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement