నీళ్లకు కాకి లెక్కలు! | Fake records of water | Sakshi
Sakshi News home page

నీళ్లకు కాకి లెక్కలు!

Sep 5 2015 3:21 AM | Updated on Sep 22 2018 8:22 PM

నీళ్లకు కాకి లెక్కలు! - Sakshi

నీళ్లకు కాకి లెక్కలు!

‘ఇది జూలై 29, 30 తేదీల్లో చిత్తూరు నగరంలోని మాపాక్షి సమీపంలో అద్దె ట్యాంకరు ద్వారా నీటిని సరఫరా చేసినట్లు ధ్రువీకరించే పత్రం

చిత్తూరు (అర్బన్) : ‘ఇది జూలై 29, 30 తేదీల్లో చిత్తూరు నగరంలోని మాపాక్షి సమీపంలో అద్దె ట్యాంకరు ద్వారా నీటిని సరఫరా చేసినట్లు ధ్రువీకరించే పత్రం. ఇందులో 29వ తేదీ మాపాక్షి, ఉయ్యాలచింత, శేషాచలపురం ప్రాంతాల్లో ఎక్కడయితే నీటిని సరఫరా చే శారో అదే ప్రాంతాల్లో అదే నెల 30న కూడా నీటిని సరఫరా చేసినట్లు ట్యాంకు యజమాని ట్రిప్పుషీట్ ఇవ్వగా అధికారులు సంతకాలు పెట్టి బిల్లు ఇవ్వడానికి పంపేశారు. నగరంలో ఒక రోజు ఓ ప్రాంతానికి నీళ్లు వస్తే ఆ మరుసటి రోజు ట్యాంకరు రాదు. మూడో రోజు ఆ ప్రాంతానికి మళ్లీ నీటి ట్యాంకరు వస్తుంది. దీనిని అధికారులు విస్మరించారు. పైగా ఇదే ట్యాంకరు రోజుకు 14 ట్రిప్పుల నీటిని సరఫరా చేసినట్లు చెప్పడం, అధికారులు ఆమోదించడం అవినీతికి సాక్ష్యంగా నిలుస్తోంది.’
 
 ‘ఇది గంగాసాగరం వద్ద నీటిని పంపిణీ చేసినట్లు చూపుతున్న ట్రిప్పుషీట్. ఒకే ట్యాంకరు ఏకంగా రోజుకు 16 ట్రిప్పుల నీటిని అందించినట్లు ఇందులో రాసుంది. నిబంధనల ప్రకారం ఒక్కో ట్యాంకరు 5 నుంచి 6 ట్రిప్పుల నీటిని ఇవ్వాల్సి ఉండగా 24 గంటల్లో ఏకంగా 16 ట్రిప్పుల నీటిని ఇవ్వడం ఎలా సాధ్యమయ్యిందో అర్థం కావడంలేదు. పైగా నీటిని అందించిన తలుపు నెంబర్లలో 37-113 ప్రాంతం లక్ష్మీపురంగా, 37-115 ప్రాంతం కనికాపురంగా, 37-118 ప్రాంతం నరిగపురంగా రాశారు. మూడు డోర్ నెంబర్లు ఉన్న ఒకే ప్రాంతానికి మూడు వేర్వేరు కాలనీలను చూపిస్తే, అధికారులు ఆమోదిస్తూ సంతకాలు పెట్టేయడం ఆశ్చర్యంగా ఉంది.’

 నగరంలో 120 అద్దె ట్యాంకర్ల ద్వారా ప్రజలకు నీళ్లు అందించడానికి ప్రభుత్వం కరువు నిధులు విడుదల చేస్తోంది. రోజుకు 480 ట్రిప్పుల నీటిని ప్రజలకు అందిస్తున్నట్లు అధికారులు పుస్తకాల్లో లెక్కలు చూపుతున్నారు.  నీటి ట్యాంకర్లకు నెలకు రూ.44 లక్షలు, ఏటా సుమారు రూ.5.5 కోట్లు కరువు నిధుల నుంచి చెల్లింపులు చేస్తున్నారు. ట్యాంకర్లు సక్రమంగా ప్రజలకు నీటిని అందిస్తోందా..? లేదా అనే దిశగా అధికారులు క్షేత్రస్థాయిలో ఏ మాత్రం తనిఖీలు చేయడంలేదు. పైగా కార్యాలయాలకు వచ్చే ట్రిప్‌షీట్లలో ఏం రాసుందో కూడా చూడకుండా గుడ్డిగా సంతకాలు పెట్టి కరువునిధుల్ని దొడ్డిదారిన మళ్లిస్తున్న కొందరు అధికారులు అవినీతి మత్తులో జోగుతున్నారు.

అద్దె నీటి ట్యాంకర్లకు గ్లోబల్ పొజీషన్ సిస్టమ్ (జీపీఎస్) వ్యవస్థను సైతం అధికారులు ఏర్పాటు చేశారు. ఈ నివేదికల్లో ఏ మాత్రం పారదర్శకత లేదు. కొన్ని ట్యాంకర్లు వెళ్లిన వీధులకే వెళ్లి నీళ్లు ఇస్తున్నట్లు రికార్డుల్లో నమోదవుతోంది. అవినీతికి పాల్పడే చాలా ట్యాంకర్లకు అసలు జీపీఎస్ పరికరాలను అమర్చకపోవడం గమనార్హం.
 
అక్కడ వేరే ట్యాంకర్లు ఉన్నాయి
 మాపాక్షి ప్రాంతంలో అధికారికంగా ఒకే ట్యాంకరుతో నీళ్లు ఇస్తున్నారు. అయితే జనాభా ఎక్కువగా ఉండడంతో అనధికారికంగా మూడు ట్యాంకర్లు పెట్టుకుని నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ విషయం మాకూ తెలుసు. ఇక శివారు ప్రాంతాలు కావడంతో ఆన్‌లైన్ వ్యవస్థకు నెట్‌వర్క్ రాకపోవడంతో జీపీఎస్ పరికరాలను ఉంచలేదు.
 - భాస్కరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు, చిత్తూరు కార్పొరేషన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement