ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతుల కల్పన | facilities provided at govt hospitals | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతుల కల్పన

Sep 29 2013 2:15 AM | Updated on Sep 1 2017 11:08 PM

రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని ఆరోగ్యశ్రీ సీఈఓ కె.ధనుంజయరెడ్డి తెలిపారు.

కలెక్టరేట్, న్యూస్‌లైన్: రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని ఆరోగ్యశ్రీ సీఈఓ కె.ధనుంజయరెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరోగ్యశ్రీ పథకం నిర్వహణ తీరును క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగా గజ్వేల్, నర్సాపూర్ పీహెచ్‌సీ, జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి, సదాశివపేటలోని వైద్య శిబిరాన్ని సందర్శించినట్టు తెలిపారు. జిల్లా సమస్యలపై కలెక్టర్‌తో చర్చించి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా సూచిం చినట్టు చెప్పారు. జిల్లాలో 9 నెట్‌వర్క్ ఆస్పత్రులు పనిచేస్తున్నాయన్నారు.
 
 ఇందులో 8 ప్రభుత్వ ఆస్పత్రులు కాగా ఒకటి ఎంఎన్‌ఆర్ ప్రైవేటు ఆస్పత్రి ఉందన్నారు. ఆస్పత్రులకు పరికరాలను సమకూర్చడంతోపాటు, వైద్యుల కొరతను తీర్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. తెల్ల రేషన్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరు ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలకు అర్హులేనన్నారు. రేషన్‌కార్డు లేనివారికి సీఎం క్యాంపు కార్యాల యంతోపాటు రాష్ట్రంలోని వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కర్నూల్, కాకినాడలో ఆరోగ్యశ్రీకి సంబంధించిన లబ్ధిదారుల కార్డులు జారీ చేస్తారని తెలి పారు. 104 టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా ఆరోగ్యపరమైన సూ చనలు, సలహాలు పొందవచ్చన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 1,474 వైద్య శిబిరాలు నిర్వహించి 3 లక్షల పైచి లుకు వారికి స్క్రీనింగ్ చేసి 9,878 మందికి శస్త్రచికిత్స కోసం రిఫర్ చేశామన్నారు. ఇందులో 2,660 నెట్‌వర్క్ ఆస్పత్రులు పాల్గొన్నాయన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 61,391 మందికి శస్త్ర చికిత్సలు నిర్వహించి రూ.167 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఆరోగ్యమిత్రలు, గ్రామైక్య సంఘాలు, ప్రజాప్రతినిధుల ద్వారా ఆరోగ్యశ్రీ పథకంపై విస్తృత ప్రకారం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో జీఎం డాక్టర్ జైకుమార్, విజిలెన్స్ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సి.రంగారెడ్డి, జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ సౌజన్య పాల్గొన్నారు. అంతకుముందు సంగారెడ్డిలోని పాత డీఆర్డీఎ కార్యాలయంలో స్వయం సహాయక సంఘాల సభ్యులు, ఆరోగ్యమిత్రలతో సమావేశమైన అనంతరం కలెక్టర్‌తో సమావేశమై చర్చించారు.
 
 ఆస్పత్రి తనిఖీ..
 నర్సాపూర్: స్థానిక కమ్యూనిటీ ఆసుపత్రిలోని ఆరోగ్యమిత్ర కార్యాలయాన్ని ఆరోగ్యశ్రీ పథకం సీఈఓ ధనుంజయరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్యమిత్రల పనితీరు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని గజ్వేల్, జహీరాబాద్, సదాశివపేట, జోగిపేట ప్రభుత్వాసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేస్తారని చెప్పారు. ఆయా ఆసుపత్రులకు అవసరమైన వైద్య పరికరాలను ఈ పథకం ద్వారానే సమకూరుస్తున్నట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement