ముందు‘చూపు’తో రక్షించుకుందాం

Eyes Protection From Glaucoma - Sakshi

అంధత్వానికి మూలం గ్లకోమా

ప్రపంచవ్యాప్తంగా వేధిస్తున్న నేత్ర వాధి

నేటి నుంచి గ్లకోమా వారోత్సవాలు

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. తెలిసోతెలియకో కొంతమంది కంటి వ్యాధుల బారిన పడటంతో జీవితం అంధకారమయం అవుతోంది. ఈ వ్యాధుల్లో అత్యంత ప్రమాదకరమైనదిగా గ్లకోమాను ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. గ్రామీణ ప్రాంతాల్లో నీటికాసులు, నల్లముత్యంగా వ్యవహరించే ఈ వ్యాధి తెలియకుండానే కళ్లపై దాడి చేస్తోంది. కంటి చూపును శాశ్వతంగా దూరం చేసి చీకటిమయం చేసేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 6 కోట్ల మంది, భారతదేశంలో 1.2కోట్ల మంది కంటే ఎక్కువగా గ్లకోమా కారణంగా చూపును కోల్పోతున్నారు.

అంటే జనాభాలో ఒక శాతం దీని బారిన పడుతున్నారంటే ఈ వ్యాధి ఎంత తీవ్రంగా ప్రభావం చూపుతోందో అర్థం చేసుకోవచ్చు. ప్రారంభంలోనే ముందుచూపుతో వ్యవహరించి దీనిని గుర్తిస్తే నివారించడం సాధ్యమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.  ఈ వ్యాధిపై అవగాహన లేకపోవడంతో ఎక్కువ మంది దీని బారిన పడుతున్నారని తేలింది. గ్లకోమాపై ప్రజల్లో అవగాహన కల్పించి ఆదిలోనే గుర్తించి సరైన చికిత్స అందించేందుకు ప్రపంచవ్యాప్తంగా మార్చి 11 నుంచి 17 వరకు ‘ప్రపంచ గ్లకోమా వారోత్సవాలు’ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కంటి పరీక్షలు, వ్యాధి నివారణకు సూచనలు, మందులు అందజేస్తారు. అవరసమైతే శస్త్ర చికిత్సలు చేస్తారు.

గ్లకోమా అంటే..
అంధత్వానికి కారణమయ్యే వ్యాధుల్లో గ్లకోమా (నీటి కాసుల వ్యాధి) ప్రమాదకరమైంది. కంటి ముందు భాగం అక్వయిస్‌ హ్యూమర్‌ అనే ఒక ద్రవంతో నిండి ఉంటుం ది. అది నిత్యం ఉత్పత్తి అవుతుంది. ఈ క్రమంలో కొత్త ద్రవం ఉత్పత్తి అయిన కొద్దీ పాత ద్రవం బయటకు వెళుతుంది. కొన్ని కారణాల వల్ల ఈ ద్రవం బయటకు వెళ్లే మార్గంలో అడ్డుంకులు ఏర్పడతాయి. అప్పు డు కంటిలో ఒత్తిడి పెరిగి  ప్రధాన నాడి దెబ్బతింటుంది. పక్కచూపు నుంచి మొదలై క్రమంగా చూపు మందగిస్తుంది. దీని ఫలితంగా పూర్తిగా చూపుపోయే ప్రమాదం కలుగుతుంది.

లక్షణాలు
ప్రారంభ దశలో ఎటువంటి లక్షాలు కనిపించవు. గ్లకోమా బారిన పడిన వారిలో 50 శాతానికి పైగా తమకు వ్యాధి వచ్చినట్టు తెలియదు. ఈ దశలో గుర్తించగలిగితే సరైన చికిత్సతో చూపు కాపాడవచ్చు.
ఎలా గుర్తిస్తారు
కంటిలోని నీటి ఒత్తిడిని టోనోమీటర్‌ అనే పరికరంతో కొలుస్తారు. గోనియోస్కోపి(నీటి సరఫరా మార్గం పరీక్ష) ద్వారా తెలుసుకుంటారు. ఇందులో కంటి ప్రధాన నాడిని పరీక్షిస్తారు. దృష్టి లోపాలను  గుర్తించేందుకు విజువల్‌ ఫీల్డ్‌ టెస్ట్‌ చేస్తారు. ప్రారంభ దశలో వ్యాధిని గుర్తించేందుకు ఓసీటీ, జీడీఎక్స్‌ అనే అధునాతన పరికరాలు అందుబాటులో ఉన్నాయి. గ్లకోమాను కనుగొనడానికి కంటి వైద్యులచే పూర్తి పరీక్ష చేయించుకోవడం ఒక ఉత్తమ మార్గం. సంపూర్ణ కంటి పరీక్షలో ఐఓపీ కొలత, కంటి డ్రైనేజీ యాంగిల్‌ ఆప్టిక్‌ నరాన్ని పరిశీలిస్తారు. అదనంగా విజువల్‌ ఫీల్డ్‌ పరీక్షల ద్వారా కంటి చూపు ఫెరిఫెరీని పరిశీలిస్తారు.

ఎన్ని రకాలు
ప్రైమరీ, సెకండరీ (కంటి గాయల వలన, ఇతర మందుల వాడకం వల్ల), కంజెనిటర్‌ గ్లకోమా (పుట్టుకతో సంక్రమించేది) అనే రకాలు ఉన్నాయి.
పరీక్ష ఎవరు చేయించుకోవాలి
40 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ, దీర్ఘకాలం నుంచి ఏదో ఒక రూపంలో స్టెరాయిడ్‌ మందులు వాడినవారు, మధుమేహ వ్యాధి గ్రస్తులు, కంటికి గాయాలైనవారు, కుటుంబంలో పెద్దలు ఎవరికైనా గ్లకోమా ఉంటే వారి పిల్లలు, అతిమూత్ర (మధుమేహ) వ్యాధి ఉన్నవారు  పరీక్ష చేయించుకోవాలి.

చిక్సిత విధానాలు
గ్లకోమాను పూర్తిగా నయం చేయలేం. పోయిన చూపును తీసుకురావడం సాధ్యపడదు. కానీ సరైన చికిత్స తీసుకో వడం వల్ల మిగిలి ఉన్న చూపు దెబ్బతినకుండా కాపాడవ చ్చు. కంటి చుక్కల మందులు వేయడం వల్ల ద్రవఉత్పత్తి నియంత్రించవచ్చు. ఇవి జీవితాంతం వాడాలి. కొన్ని రకా ల గ్లకోమాలకు లేజర్‌ ఉపయోగపడుతుంది. మందులు గానీ, లేజర్‌ గానీ గ్లకోమాను నియంత్రించలేకపోతే శస్త్ర చికిత్స చేయించుకోవాలి. ఆధునిక చికిత్సలైన ట్రేబెక్యులేక్టమీ, స్టంట్‌ సర్జరీ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

నేత్రాలు జాగ్రత్తగా కాపాడుకోవాలి
సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. శరీరంలో ఉన్న భాగాల్లో కళ్లు అత్యంత ప్రధానమైనవి, వీటిని సురక్షితంగా కాపాడుకోవాలి. జిల్లాలో ఏడు విజన్‌ సెంటర్లలో రణస్థలం, రాజాం, పాతపట్నం, పలాస, ఇచ్ఛాపురం, ఆమదాలవలస, నరసన్నపేటలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి సీఎం ఈఐ స్టెంట్లు పేరిట గ్లకోమాపై పరీక్షలు చేస్తున్నాం. రిమ్స్‌లో వైద్యం అందుబాటులో ఉంది. నేత్రాలకు సంబంధించి సమస్య చిన్నదైనా, పెద్దదైనా కంటి వైద్య నిపుణులను సంప్రదించాలి. శస్త్ర చికిత్సలు కూడా ఉచితంగానే చేస్తున్నారు. – డాక్టర్‌ ఎస్‌ తిరుపతిరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, శ్రీకాకుళం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top