వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు 

Extensive arrangements for Vaikunta Ekadashi in Tirumala - Sakshi

టీటీడీ ఈవో సింఘాల్‌  వెల్లడి

తిరుమల: వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో తిరుమలకు వచ్చే భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. జేఈవో  కె.ఎస్‌.శ్రీనివాసరాజు, సీవీఎస్‌వో గోపినాథ్‌జెట్టితో కలిసి ఆయన శుక్రవారం ఏర్పాట్లను పరిశీలించారు. ఈసందర్భంగా 18న వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం 16వతేదీ అర్ధరాత్రి 12.30 గంటల నుంచి భక్తులను వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోకి అనుమతిస్తామన్నారు. అక్కడ  28 గంటలు భక్తులు వేచి ఉండాల్సి వస్తుందన్నారు. గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చలికి ఇబ్బందులు పడకుండా ఈసారి మాడ వీధుల్లో దాదాపు 40 వేల మంది కూర్చునేందుకు ప్రత్యేకంగా షెడ్లు ఏర్పాటుచేశామన్నారు.

భక్తులను ముందుగా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌– 2, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌– 1లోకి అనుమతిస్తామని, అవి నిండిన తర్వాత వరుసగా ఆళ్వార్‌ ట్యాంక్‌ లైన్, నారాయణగిరి ఉద్యానవనాల్లోని షెడ్లలోకి పంపుతామన్నారు. తరువాత మేదరమిట్ట వద్ద గల ఎన్‌–1 గేటు ద్వారా మాడ వీధుల్లో షెడ్లలోకి అనుమతిస్తామని తెలిపారు. షెడ్ల వద్ద తాగునీరు, అన్నప్రసాద వితరణ చేస్తామన్నారు. గతేడాది ఏకాదశి, ద్వాదశి రోజుల్లో 1.70 లక్షల మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించామని చెప్పారు. ఈసారి భక్తులు యాత్ర ప్రణాళిక రూపొందించుకోవాలని కోరారు.  

 శ్రీవారికి రూ.5.19కోట్లు విరాళం  
తిరుమల శ్రీవారి వేంకటేశ్వరస్వామి ట్రస్ట్‌కు శుక్రవారం ఎన్నడూలేని విధంగా రూ.5.19 కోట్లు విరాళంగా వచ్చింది. ఇందులో  శ్రీబాలాజీ ఆరోగ్యవరప్రసాదినికి రూ.5 కోట్లు,  ఎస్వీ అన్నప్రసాదానికి రూ. 15.42లక్షలు, ఎస్వీ గోసంరక్షణకు రూ.2 లక్షలు, ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ. ఒకలక్ష,  ఎస్వీ విద్యాదాన ట్రస్టుకు రూ. ఒకలక్ష  విరాళంగా భక్తులు సమర్పించుకున్నారు. తిరుమల జేఈవో కార్యాలయం సమీపంలో ఉన్న ఆదిశేష విశ్రాంతి సముదాయంలోని దాతల విభాగంలో అధికారులను యాత్రికులు కలసి  విరాళాలను అందజేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top