మందుపై ముందుచూపు!

Extension Proposals of liquor shops up to 2023 - Sakshi

     ఐదేళ్ల ఫీజు ఒకేసారి.. సర్కారుకు రూ.2,500 కోట్ల జాక్‌పాట్‌

     మద్యం షాపుల లైసెన్సు 2023 వరకు పొడిగింపు ప్రతిపాదనలు

     ఇప్పటికే బార్లకు 2022 వరకు లైసెన్సులు ఇచ్చిన ప్రభుత్వం

సాక్షి, అమరావతి: అధికార పార్టీ నేతల కనుసన్నల్లోని లిక్కర్‌ లాబీకి దాసోహమైన రాష్ట్ర ప్రభుత్వం మరో బంపర్‌ ఆఫర్‌ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే బార్లకు ఐదేళ్ల పాటు (2022 వరకు) వ్యాపారం చేసుకునేందుకు లైసెన్సులు ఇచ్చిన సర్కారు సార్వత్రిక ఎన్నికలకు ముందుగా మద్యం షాపులకు కూడా ఐదేళ్ల పాటు లైసెన్సులు జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. 

రెన్యువల్‌ స్థానంలో ఐదేళ్ల పాటు పొడిగింపు
గతేడాది ప్రకటించిన మద్యం పాలసీ ప్రకారం మద్యం దుకాణాలకు రెండేళ్లకు లైసెన్సులు జారీ చేశారు. ఈ ఏడాది జూన్‌ నెలాఖరున రాష్ట్రంలోని 4,380 మద్యం షాపులకు లైసెన్సులు ఏడాది పాటు రెన్యువల్‌ చేయాల్సి ఉంది. అయితే రెన్యువల్‌ స్ధానంలో ఐదేళ్ల పాటు మద్యం లైసెన్సులు పొడిగించేలా ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించినట్లు విశ్వసనీయ సమాచారం. లైసెన్సు పొడిగింపు రాజకీయ కారణాలతో ముడిపడి ఉన్నట్లు అధికార వర్గాలే వెల్లడించడం గమనార్హం. మద్యం వ్యాపారులతో ప్రభుత్వం లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని వారి వ్యాపారానికి ఆటంకాలు లేకుండా లైసెన్సు కాలపరిమితి పొడిగించనుందని అధికారులు చెబుతున్నారు. ఇందుకుగాను మద్యం వ్యాపారుల నుంచి ఐదేళ్ల లైసెన్సు ఫీజు ఒకేసారి వసూలు చేయనున్నారు. 

ఒకేసారి రూ.2,500 కోట్లు
గతేడాది రాష్ట్రంలోని మద్యం షాపుల నుంచి లైసెన్సు ఫీజుల రూపంలో రూ.500 కోట్ల ఆదాయం లభించింది. ఇప్పుడు ఐదేళ్లకు ఒకేసారి వసూలు చేస్తే సుమారుగా రూ.2,500 కోట్లకు పైగా ఆదాయం సర్కారుకు సమకూరుతుంది. అధికార పార్టీకి చెందిన వారే అధిక శాతం మద్యం షాపులు నిర్వహిస్తున్నారు. లాటరీ విధానంలో షాపులు దక్కించుకున్న వారిని బెదిరించి గుడ్‌విల్‌ చెల్లించి అధికార పార్టీ నేతలు స్వాధీనం చేసుకున్నారు. అధికార పార్టీ ముఖ్యులే తెర వెనుక ఉండి సిండికేట్లుగా జత కట్టారు. 2019 జూన్‌తో మద్యం దుకాణాల లైసెన్సుల కాలపరిమితి ముగుస్తుంది. అయితే వీరి వ్యాపారానికి ఆటంకాల్లేకుండా 2023 వరకు మద్యం వ్యాపారం చేసుకునేలా లైసెన్సు ఫీజు వసూలు చేసేలా ప్రతిపాదనలు రూపొందించారు. 

మరో ఐదేళ్లు...
రాబోయే ఐదేళ్ల పాటు మద్యం వ్యాపారం ఆటంకాల్లేకుండా కొనసాగించేందుకు వీలుగా ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు ప్రభుత్వం లైసెన్సీలకు సమాచారం అందించింది. కొద్ది రోజుల క్రితం మద్యం విక్రయాలపై కమీషన్‌ 18 శాతం పెంచాలని సిండికేట్లు సర్కారు పెద్దల్ని కలిశారు. మార్జిన్‌ పెంచాల్సిందేనని చిత్తూరు, అనంతపురం, తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాల్లో మద్యం షాపులు బంద్‌ చేసి నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో వారిని బుజ్జగించి లైసెన్సులు ఐదేళ్ల పాటు పొడిగిస్తామని సర్కారు పెద్దలు హామీనిచ్చినట్లు సమాచారం.

మద్యం వ్యాపారులకు ప్రోత్సాహం
గతేడాది బార్లకు లైసెన్సులు 2022 వరకు ఇచ్చి లైసెన్సు ఫీజుల్ని గణనీయంగా తగ్గించారు. గతంలో 50 వేల జనాభా వరకు బార్ల లైసెన్సు ఫీజు రూ.25 లక్షలు ఉండేది. దీన్ని రూ.2 లక్షలకు తగ్గించారు. రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.8 లక్షలు కలిపి మొత్తం రూ.10 లక్షలు లైసెన్సు ఫీజుగా నిర్ణయించారు. 50 వేల నుంచి 5 లక్షల జనాభా ఉన్న పట్టణాలు, నగరాల్లో లైసెన్సు ఫీజు రూ.40 లక్షలు ఉండేది. ఈ ఫీజును రిజిస్ట్రేషన్‌ ఛార్జి, లైసెన్సు ఫీజు కలిపి రూ.20 లక్షలుగా నిర్ణయించారు. ఐదు లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.50 లక్షలుగా ఉన్న  లైసెన్సు ఫీజును తగ్గించి కేవలం రూ.30 లక్షలే వసూలు చేశారు. మద్యం షాపులకు కూడా లైసెన్సు ఫీజులు తగ్గించి వ్యాపారాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top