ప్రభుత్వ శాఖలే శాపం

 Electricity Department Have Over Dues From government Branches In East Godavari - Sakshi

విద్యుత్తు శాఖకు బకాయిలు షాక్‌ కొడుతున్నాయి. ప్రజలు ఠంఛన్‌గా బిల్లులు జమ చేస్తున్నా ప్రభుత్వ శాఖలు మాత్రం పైసా చెల్లించకుండా వాయిదా మంత్రాన్ని జపిస్తున్నాయి. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విద్యుత్తు శాఖకు ఆయా శాఖల నుంచి బిల్లులు జమచేయకపోవడంతో బకాయిలు గుదిబండగా మారాయి. ఈ రకంగా కోట్ల రూపాయల్లోనే బకాయిలు వసూలు కాకుండా ఉన్నాయి. ఫలితంగా ఏటేటా విద్యుత్తుశాఖ రెవెన్యూ లక్ష్యాలు నీరుగారిపోతున్నాయి. 

సాక్షి, తూర్పు గోదావరి: ఏపీఈపీడీసీఎల్‌ పరిధిలోకి వచ్చే జిల్లాలోని ఆరు విద్యుత్తు డివిజన్లలో గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ శాఖల వద్ద పేరుకుపోయిన బకాయిలు రూ.342.58 కోట్లు పైమాటే ఉన్నాయి గత జూన్‌ నెలలో బకాయిలు రూ.216.04 కోట్లుంటే తాజాగా జూలై నెలకు వచ్చేసరికి బకాయిలు రూ.230.83 కోట్లకు చేరుకుంది. గత చంద్రబాబు సర్కార్‌ స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఇందుకు జిల్లాలో ఉన్న 1072 గ్రామ పంచాయతీలు కూడా మినహాయింపు కాదు. గత సర్కార్‌ గ్రామాలకు వచ్చిన నిధులను వంది మాగధుల స్వప్రయోజనాల కోసం దారిమళ్లించడంతో గడచిన ఐదేళ్లుగా పంచాయతీల పాలకవర్గాలు చిల్లిగవ్వ కూడా విద్యుత్తు బిల్లులు చెల్లించలేకపోయాయి. ఈ కారణంగానే విద్యుత్తు శాఖకు బకాయి పడిన వాటిలో అత్యధికంగా గ్రామ పంచాయతీల వద్దనే ఉండిపోయాయి.

జిల్లాలో 17 లక్షల మంది వినియోగదారుల్లో 90 శాతంపైనే నెలనెలా ఏపీఈపీడీసీఎల్‌కు క్రమం తప్పకుండా బిల్లులు చెల్లించేస్తున్నారు. కానీ ప్రభుత్వ శాఖల నుంచి మాత్రం బకాయిలు ఊడిపడటం లేదు. అందులోను బకాయిలు గుదిబండగా మారిన విభాగాల్లో గ్రామ పంచాయతీలదే ఎక్కువగా ఉంది. గ్రామ పంచాయతీల నుంచి రావాల్సిన విద్యుత్‌ బకాయిలు గడచిన మూడు నెలల లెక్కలు తీస్తే రూ.14.22 కోట్లు ఉంటే అందులో వసూలైంది కేవలం రూ.4.22 కోట్లు మాత్రమే. అంటే ఒక్క గ్రామ పంచాయతీల నుంచి మూడు నెలల బకాయిలు రూ.10 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వ శాఖలు, గ్రామ పంచాయతీలన్నీ కలిపితే ఉన్న బకాయిలు రూ.342.58 కోట్లు. ఇందులో గ్రామ పంచాయతీల నుంచే అత్యధికంగా రూ.201.34 కోట్లు విద్యుత్‌ బిల్లుల రూపంలో పెండింగ్‌లో ఉన్నాయి.

గ్రామ పంచాయతీల తరువాత రెండో స్థానంలో నీటిపారుదల, కమాండ్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ శాఖ నుంచి రూ.97.87 కోట్లు బకాయిలు ఉన్నాయి. మూడో స్థానంలో ఉన్న గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్‌ శాఖల నుంచి రూ.20.98 కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. ఈ బకాయిలు వసూలు కాకపోవడంతో విద్యుత్తు శాఖ తలపట్టుకుంటోంది. ఉన్నత స్థాయి నుంచి ఇచ్చే రెవెన్యూ వసూళ్ల లక్ష్యాలను అధిగమించేందుకు ఈ బకాయిలు ప్రతిబంధకమవుతున్నాయని ఏపీఈపీడీసీఎల్‌ అధికారులు పేర్కొంటున్నారు.

రెవెన్యూ లక్ష్యాలు పడిపోతున్నాయి 
బకాయిలు వసూలు కాకపోవడంతో ఏటా రెవెన్యూ లక్ష్యాలు పడిపోతున్నాయి.  రాష్ట్రంలోనే అతి పెద్ద జిల్లా కావడంతో బకాయిలు కూడా ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలో మరే జిల్లాలో లేని విధంగా అత్యధికంగా 17 లక్షల మంది గృహ విద్యుత్‌ వినియోగదారులు ఉన్నారు. వీరు సకాలంలో బిల్లులు చెల్లిస్తుండడంతో రెవెన్యూ బాగానే వస్తున్నా, ప్రభుత్వ శాఖల నుంచి బకాయిలు వల్ల లక్ష్యాన్ని అందుకోలేక పోతున్నాం.
సీహెచ్‌ సత్యనారాయణరెడ్డి,సూపరింటెండింగ్‌ ఇంజినీర్, ఏపీఈపీడీసీఎల్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top