వారు ఎలా ఇస్తే.. అలానే....!

Eggs Are Not Properly Distributing In Anganwadi Centres - Sakshi

చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యమే లక్ష్యంగా ఏర్పాటైన అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న పౌష్టికాహారంలో అనేక లోటుపాట్లు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఆహార పదార్ధాల సరఫరా చేసే సమయంలో ప్రభుత్వ నిబంధనలు సంబంధిత కాంట్రాక్టర్లు పాటించడం లేదు. ఇది ఏంటని అడిగే పరిస్థితి కేంద్రాల నిర్వాహకులకు లేదు. ఒకవేళ అడిగినా... సరఫరా చేసే వారు ఎటువంటి సమాధానం చెప్పకుండా తమ పని తాము కానిచ్చేసి ఆదరాబాదరాగా వెళ్లిపోతున్నారు. సంబంధిత కాంట్రాక్టర్‌ కేంద్రాలకు ఏం సరఫరా చేస్తే అవే తీసుకోవాలి మరి. వారు ఎలా ఇస్తే...అలా తీసుకోవాల్సిందే...!

సాక్షి,బలిజిపేట(విజయనగరం) : పౌష్టికాహారంలో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే గుడ్లును కేంద్రం వద్ద అట్టలతో కలిపి తూకాలు వేసి కార్యకర్తలకు అప్పగించాల్సి ఉంది. కానీ గుడ్లు వ్యానుతో తెచ్చేవారు అట్టలను కార్యకర్తల చేతికి అందించి వెళ్లిపోవడమే తప్ప వాటిని తూచి ఇచ్చిన దాఖలాలు లేవు.  తూకం వేసి ఇమ్మని కేంద్రం నిర్వాహకులు అడిగినా పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ క్రమంలో ఇచ్చే గుడ్లులో చాలా వరకు పాడైనవి వస్తున్నాయి. అట్టలతో దొంతులుగా ఇచ్చేసి ఆదరాబాదరాగా వ్యాన్‌తో వెళ్లిపోవడమే తప్ప వాటి నాణ్యతను పరిశీలించే పరిస్థితులు ఎక్కడా కానరావడం లేదు. దీంతో కార్యకర్తలు స్థానికులకు సమాధానం చెప్పలేక అవస్థలు పడుతున్నారు. గుడ్లు చిన్న, పెద్ద ఉండడంతో పాటు ఒకే బరువుతో ఉండనందున తూకం వేసి కేంద్రాలకు అప్పగించాల్సి ఉంది. ఒక అట్టలో 30 గుడ్లు ఉంటాయి. దీని బరువు కేజిన్నర నుంచి 1600 గ్రాములు ఉండాలి. ఈ ప్రాప్తికి తూనిక వేసి కేంద్రాలకు అప్పగించాల్సి ఉంది. కాంట్రాక్టు ప్రకారం గుడ్లు తెచ్చే వ్యాన్‌లో కాటాను తీసుకువచ్చి కేంద్రాలకు అప్పగించేటప్పుడు తూకం వేసి అందించాల్సి ఉంది. కాంట్రాక్టర్‌ ఈ నిబంధనను పాటించకున్నా అధికారులు పట్టించుకునే దాఖలాల్లేవు. మెనూ ప్రకారం గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పంపిణీ చేసే గుడ్లు ఎక్కువగా ఉంటాయి.

ఇవ్వాల్సిన మెనూ...
► గర్భిణులు, బాలింతలు, ప్రీస్కూలు పిల్లలకు : సోమ, గురువారాల్లో సాంబారు, అన్నం, మంగళ, శుక్రవారాల్లో పప్పు, ఆకుకూర, అన్నం, బుధ, శనివారాల్లో కాయగూర దీనికి బదులు ఆకుకూరతో పప్పున్నం.   
►గర్భిణులు, బాలింతలకు: గుడ్లు, పాలు, శనగ చెక్కీలు సోమవారం నుంచి శనివారం వరకు ఇవ్వాలి.  
►మూడు నుంచి ఆరేళ్ల చిన్నారులకు వారానికి నాలుగు రోజులు గుడ్లు ఇవ్వాలి.(గురువారం, శనివారం ఉండవు)
►మూడేళ్లలోపు వారికి వారానికి రెండు రోజులు మాత్రమే గుడ్లు పంపిణీ చేస్తారు.
►మూడు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులలో బరువు తక్కువ ఉండే వారికి బరువు పెరిగే వరకు పాలు పంపిణీ చేస్తారు.
►గుడ్లు పది రోజులకు  ఒకసారి కేంద్రాలకు పంపిణీ చేస్తున్నారు.
►కొత్త మెనూలో బాలసంజీవిని అమలు చేయాలి:  గర్భిణులకు, బాలింతలకు నెలకు కిలో ఖర్జూరం, అరకిలో బెల్లం, కిలో రాగి పిండిని అందిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top