డీఎస్సీ పై తలమునకలు! | Education department officers on DSC-14 exams | Sakshi
Sakshi News home page

డీఎస్సీ పై తలమునకలు!

May 8 2015 4:47 AM | Updated on Feb 17 2020 5:11 PM

డీఎస్సీ-14 పరీక్షలు నిర్వహణకు ఇక ఒక్కరోజు మాత్రమే గడువు ఉంది. ఈనెల 9, 10, 11 తేదీల్లో డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి.

డీఎస్సీ-14 పరీక్షలు నిర్వహణకు ఇక ఒక్కరోజు మాత్రమే గడువు ఉంది. ఈనెల 9, 10, 11 తేదీల్లో డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. అన్ని కేటగిరీలకు 37,442 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఏర్పాట్లలో విద్యాశాఖ అధికారులు తలమునకలయ్యా రు. డీఎస్సీ నిర్వహణను సవాల్‌గా తీసుకున్నారు. ఎక్కడా ఆరోపణలు రాకుండా పరీక్షలు నిర్వహించేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నారు.

గత అనుభవనాలను దృష్టిలో ఉంచుకుని, ఎలాంటి పొరబాట్లకు తావులేకుండా జిల్లా కలెక్టర్ కోన శశిధర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అదనపు జాయింట్ కలెక్టర్ సయ్యద్ ఖాజామొహిద్దీన్‌ను పర్యవేక్షణాధికారిగా నియమించారు. ఇన్విజిలేటర్ల కేటాయింపు మొదలుకొని పరీక్ష కేంద్రాలు ఏర్పాటు, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు నియామకం వరకు ఏజేసీ పర్యవేక్షణలో జరుగుతున్నాయి.

మరోవైపు జిల్లా విద్యాశాఖ అధికారి కే. అంజయ్య, డెప్యూటీ డీఈఓ మునెయ్య, ఏడీలు పగడాల లక్ష్మీనారాయణ, చంద్రలీల, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్ గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పలుమార్లు సమావేశమై ఏర్పాట్లపై చర్చించుకున్నారు. ఏ ఒక్క అభ్యర్థి ఇబ్బంది పడకూడదనే లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని డీఈఓ సూచించారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెలో వెళ్లిన నేపథ్యంలో బస్సులు తిరగడం లేదని అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని అభ్యర్థులు కేంద్రాలకు వేళకు చేరుకోవాలన్నారు.

గడువు విషయంలో ఎలాంటి మినహాయింపు ఉండదనేది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలన్నారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, ఇన్విజినేటర్లతో శుక్రవారం ఉదయం 11 గంటలకు స్థానిక ప్రభుత్వ కేఎస్‌ఆర్ బాలికల పాఠశాలలో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏజేసీ ఆధ్వర్యంలో కేంద్రాల నియామకం ఉత్తర్వులు అందజేస్తామన్నారు.

జిల్లాకు చేరిన ప్రశ్నపత్రాలు
 కాగా డీఎస్సీ ప్రశ్నపత్రాలు గురువారం తెల్లవారుజామున అనంతకు చేరాయి. డీఆర్‌ఓ, విద్యాశాఖ అధికారుల సమక్షంలో స్థానిక కేఎస్‌ఆర్ బాలికల పాఠశాలలోని స్ట్రాంగ్‌రూంలో భద్రపరిచారు. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement