breaking news
DSC-14 exams
-
నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు
తొలిరోజు ఎస్జీటీలకు పరీక్ష 35 కేంద్రాలు... 8,216 మంది అభ్యర్థులు చీకట్లోనే నంబర్లు వేసిన వైనం అనంతపురం ఎడ్యుకేషన్ : నిరుద్యోగ అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానేవచ్చింది. డీఎస్సీ-14 పరీక్షలు రాసేందుకు రోజుల తరబడి పుస్తకాలతో కసరత్తు చేసిన అభ్యర్థులకు వారి ప్రతిభాపాటవాలు నిరూపించుకునే సమయం ఆసన్నమైంది. నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ డీఎస్సీ తొలిరోజు ఎస్జీటీ అభ్యర్థులకు పరీక్ష జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.15 గంటల వరకు పరీక్ష జరగనుంది. మొత్తం 8216 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. వీరి కోసం 35 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి జిల్లా విద్యాశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. డీఈఓ అంజయ్య, డెప్యూటీ డీఈఓ మునెయ్య, ఏడీలు పగడాల లక్ష్మీనారాయణ, చంద్రలీల, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయ్ దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షించారు. చీకటిలో నంబర్లు వేసిన వైనం పరీక్షల నిర్వహణపై అనుమానాలు తలెత్తడంతో కలెక్టర్ కోన శశిధర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇన్విజిలేషన్ విధులు మొదులుకుని చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను నియమించడంలో అత్యంత గోప్యంగా ఉంచారు. మరీ ముఖ్యంగా కేంద్రాల కేటాయింపు విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించారు. ఫలితంగా ఆర్డర్లు ఇవ్వడంలో శుక్రవారం ఆలస్యమైంది. ఎట్టకేలకు సాయంత్రం ఆర్డర్లు తీసుకున్న చీఫ్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు ఆయా కేంద్రాలకు పరుగులు తీశారు. ముఖ్యంగా శనివారం జరిగే పరీక్షకు నియమించిన ఉద్యోగులు ఉరుకులు, పరుగులతో ఆయా కేంద్రాలకు వెళ్లారు. అప్పటికి చీకటి పడింది. చాలా కేంద్రాల్లో కరెంటు సదుపాయం లేకపోవడంతో సెల్ఫోన్ల వెలుగుతో నంబర్లు వేయడం కనిపించింది. రాత్రి 9 గంటల సమయంలోనూ కొన్ని కేంద్రాల్లో నంబర్లు వేశారు. -
డీఎస్సీ పై తలమునకలు!
డీఎస్సీ-14 పరీక్షలు నిర్వహణకు ఇక ఒక్కరోజు మాత్రమే గడువు ఉంది. ఈనెల 9, 10, 11 తేదీల్లో డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. అన్ని కేటగిరీలకు 37,442 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఏర్పాట్లలో విద్యాశాఖ అధికారులు తలమునకలయ్యా రు. డీఎస్సీ నిర్వహణను సవాల్‌గా తీసుకున్నారు. ఎక్కడా ఆరోపణలు రాకుండా పరీక్షలు నిర్వహించేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. గత అనుభవనాలను దృష్టిలో ఉంచుకుని, ఎలాంటి పొరబాట్లకు తావులేకుండా జిల్లా కలెక్టర్ కోన శశిధర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అదనపు జాయింట్ కలెక్టర్ సయ్యద్ ఖాజామొహిద్దీన్‌ను పర్యవేక్షణాధికారిగా నియమించారు. ఇన్విజిలేటర్ల కేటాయింపు మొదలుకొని పరీక్ష కేంద్రాలు ఏర్పాటు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు నియామకం వరకు ఏజేసీ పర్యవేక్షణలో జరుగుతున్నాయి. మరోవైపు జిల్లా విద్యాశాఖ అధికారి కే. అంజయ్య, డెప్యూటీ డీఈఓ మునెయ్య, ఏడీలు పగడాల లక్ష్మీనారాయణ, చంద్రలీల, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్ గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పలుమార్లు సమావేశమై ఏర్పాట్లపై చర్చించుకున్నారు. ఏ ఒక్క అభ్యర్థి ఇబ్బంది పడకూడదనే లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని డీఈఓ సూచించారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెలో వెళ్లిన నేపథ్యంలో బస్సులు తిరగడం లేదని అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని అభ్యర్థులు కేంద్రాలకు వేళకు చేరుకోవాలన్నారు. గడువు విషయంలో ఎలాంటి మినహాయింపు ఉండదనేది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలన్నారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, ఇన్విజినేటర్లతో శుక్రవారం ఉదయం 11 గంటలకు స్థానిక ప్రభుత్వ కేఎస్ఆర్ బాలికల పాఠశాలలో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏజేసీ ఆధ్వర్యంలో కేంద్రాల నియామకం ఉత్తర్వులు అందజేస్తామన్నారు. జిల్లాకు చేరిన ప్రశ్నపత్రాలు కాగా డీఎస్సీ ప్రశ్నపత్రాలు గురువారం తెల్లవారుజామున అనంతకు చేరాయి. డీఆర్ఓ, విద్యాశాఖ అధికారుల సమక్షంలో స్థానిక కేఎస్ఆర్ బాలికల పాఠశాలలోని స్ట్రాంగ్‌రూంలో భద్రపరిచారు. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.