ఎంసెట్ కౌన్సెలింగ్‌కు సమైక్య సెగ | EAMCET counselling stopped in Vizainagaram | Sakshi
Sakshi News home page

ఎంసెట్ కౌన్సెలింగ్‌కు సమైక్య సెగ

Aug 20 2013 6:21 AM | Updated on Sep 27 2018 5:56 PM

ఎంసెట్‌కు సమైక్యాంధ్ర ఆందోళన సెగ తగిలింది. ఉద్యమకారుల నిరసనలు, అధ్యాపకులు సహాయనిరాకరణతో ఎంసెట్ కౌన్సెలింగ్ వాయిదా పడింది.

విజయనగరం టౌన్, న్యూస్‌లైన్: ఎంసెట్‌కు సమైక్యాంధ్ర ఆందోళన సెగ తగిలింది. ఉద్యమకారుల నిరసనలు, అధ్యాపకులు సహాయనిరాకరణతో ఎంసెట్ కౌన్సెలింగ్ వాయిదా పడింది. ఎట్టిపరిస్థితుల్లోనూ సోమవారం కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో రవాణా సౌకర్యాలు లేకపోయినా ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి విజయనగరం పట్టణంలోని పూల్‌బాగ్ పాలిటెక్నికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన  ఎంసెట్ కౌన్సెలింగ్ కేంద్రానికి ఉదయానికే  విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అయితే కౌన్సెలింగ్ నిర్వహించవలసిన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు, సిబ్బంది సమ్మెలో ఉండడంతో పాటు సమైక్యాంధ్రులు కేంద్రం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో కౌన్సెలింగ్ వాయిదా పడింది. 
 
 దీంతో ఉదయం నుంచే జోరువానలోనూ వేచి ఉన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వెనుతిరగవలసి వచ్చింది.   గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఎదుర్కొన్న అనుభవాలు గుర్తున్నా.. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ  కౌన్సెలింగ్ ప్రారంభించాలని మొండిగా ఆదేశించడంతో విద్యార్థులు ఇక్కట్లకు గురికావలసి వచ్చింది.   కౌన్సెలింగ్‌కు హాజరైన వేయి మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ధ్రువీకరణ పత్రాల పరిశీలన, వెబ్ కౌన్సెలింగ్‌ను సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా పాలిటెక్నిక్ అధ్యాపకుల జేఏసీ తీర్మానం మేరకు బహిష్కరించారు. దీనికి తోడు ఉదయం 8 గంటలకే కౌన్సెలింగ్ కేంద్రానికి చేరుకున్న సమైక్య వాదులు ఎట్టిపరిస్థితుల్లోనూ కౌన్సెలింగ్ నిర్వహించకూడదని పట్టుపట్టారు. ఈ ప్రక్రియను నిలిపివేయాలని కోఆర్డినేటర్లను కోరారు. 
 
 అలాగే అక్కడకు వచ్చిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఉద్యమం గూర్చి అవగాహనకల్పించారు.   ఈ సందర్భంగా ఎస్‌ఐ వై.కృష్ణకిషోర్ అక్కడకు చేరుకుని ఆందోళనకారులను బయటకు పంపించివేశారు. పాలిటెక్నిక్ కళాశాల ఉద్యోగులు, సిబ్బంది అంతా సమ్మెలో పాల్గొనడంతో కౌన్సెలింగ్ సాధ్యం కాదని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ టి.ఆర్.ఎస్.లక్ష్మి తెలిపారు. చేసేది లేక అభ్యర్థులు వెనుదిరిగారు. కౌన్సెలింగ్ సమైక్యవాదులను రావడంతో వారిని ఎస్‌ఐ వై.కృష్ణకిషోర్ అదుపుచేశారు. కౌన్సెలింగ్ ఎప్పుడు నిర్వహిస్తారన్నదీ తెలియరాలేదు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement