డ్వాక్రా మహిళల పడిగాపులు

Dwcra Women Suffering in West Godavari Meeting - Sakshi

సెల్‌ఫోన్ల కోసం పేర్లు నమోదు అంటూ పిలిచిన యానిమేటర్లు

టీవీలో సీఎం ప్రసంగం వినిపించేందుకు యత్నం

ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళలు ఎట్టకేలకు పేర్లు నమోదు   

పశ్చిమగోదావరి, ఆకివీడు: గత ఎన్నికల్లో డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ పూర్తి చేయకుండానే చేసినట్టుగా నమ్మించి మోసం చేసిన చంద్రబాబు తాజాగా స్మార్ట్‌ ఫోన్లు, రూ.10 వేలు ఎకౌంట్‌లో వేస్తామంటూ భారీ స్కెచ్‌కి తెర తీశారు. డ్వాక్రా మహిళలు పేర్లు నమోదు చేయించుకున్నవారికి ఫోన్లు, రూ.10 వేలు ఇస్తామని యానిమేటర్లు చెప్పడంతో శుక్రవారం గ్రామ పంచాయతీల వద్దకు మహిళలు పోటెత్తారు. తీరా అక్కడకు వెళ్లాక ముఖ్యమంత్రి ప్రసంగం వినాలంటూ చెప్పడంతో డ్వాక్రా మహిళలు అవాక్కయ్యారు. డ్వాక్రా గ్రూపులకు సెల్‌ఫోన్లు ఇస్తామని, రూ.10 వేలు ఎకౌంట్‌లో వేస్తామని ప్రకటించి యాని మేటర్లతో పేర్లు నమోదు చేయించుకునే ప్రక్రియ శుక్రవారం ఆకివీడు పంచాయతీ వద్ద రసాభాసగా మారింది. పంచాయతీ కార్యాలయం వద్ద డ్వాక్రా మహిళల పేర్లు నమోదు చేస్తామని, ఆధార్‌ కార్డుతో మహిళలు హాజరుకావాలని యానిమేటర్లు పిలుపునివ్వడంతో 2 వేల మందికి పైగా మహిళలు కార్యాలయానికి చేరుకున్నారు.

కార్యాలయం వద్ద టెంట్, కుర్చీలు, ఎల్‌సీడీ టీవీని అమర్చారు. అవి చూసి మహిళలు అవాక్కయ్యారు. పేర్లు నమోదు చేసుకుంటామని చెప్పి మీటింగ్‌ పెట్టారేమిటని యానిమేటర్లను ప్రశ్నించగా కొద్దిసేపు ఉండాలని, ముఖ్యమంత్రి ప్రసంగిస్తారని, అది వినాలని చెప్పడంతో మహిళలు తిట్ల పురాణం అందుకున్నారు. సీఎం ప్రసంగం వినడానికి ఈ విధంగా మోసపూరితంగా పిలవడమేమిటని ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. మరోవైపు టీవీలో సీఎం ప్రసంగం రాకపోవడం, మహిళలు వెళ్లిపోతుండడంతో యానిమేటర్లు పేర్లు నమోదు చేసుకుంటాం ఉండాలని చెప్పారు. దీంతో మహిళలు క్యూకట్టి పేర్లు నమోదు కోసం నిల్చున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు పడిగాపులు పడిన అనంతరం డ్వాక్రా మహిళల పేర్లు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత టీవీలో సీఎం ప్రసంగం మొదలైంది. లైనులో నిల్చోలేక అప్పటికే ఎక్కువ మంది డ్వాక్రా మహిళలు వెనుదిరిగారు. సీఎం ప్రసంగం వినేందుకు పేర్లు నమోదు అంటూ పిలవడంపై డ్వాక్రా మహిళలు, నాయకులు అక్కడున్న సిబ్బందిపై ధ్వజమెత్తారు. ప్రభుత్వం ప్రతిసారి ఇదే విధంగా మోసం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

మరోసారి మోసగిస్తున్నారు
డ్వాక్రా మహిళల్ని మరోసారి మోసగిస్తున్నారు. పేర్లు నమోదు అంటూ పిలిచి సీఎం ప్రసంగం వినమన్నారు. సెల్‌ఫోన్లు, రూ.10 వేలంటూ ఉసిగొలుపుతున్నారు. ఎన్ని చేసినా మీకు ఓటు వేయం. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే ఓటు వేస్తాం. మహిళల్ని గొర్రెలుగా చూస్తున్నారు. ఈ సారి చంద్రబాబు మోసాలను నమ్మే ప్రసక్తి లేదు.– పెద్దింట్లు, మాదివాడ, ఆకివీడు

రుణమాఫీ అంటూ అధిక వడ్డీ వసూలు
డ్వాక్రా రుణమాఫీ అంటూ గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాన్ని నమ్మి ఓటు వేశాం. రుణమాఫీ చేయలేదు సరికదా రూ.10 వేలు ఎకౌంట్‌లో వేసి తలో వెయ్యి తీసుకోమన్నారు. పావలా వడ్డీని తొలగించి, రూ.1.50 పైసలు వడ్డీ వసూలు చేశారు. సెల్‌ఫోన్, మళ్లీ పదివేలని అధికారంలోకి వస్తే ఎంత వడ్డీ వసూలు చేస్తారో? – జహీరున్నీసా, ముస్లిం వీధి, ఆకివీడు  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top