దురంతో కోచ్‌లు దారి మళ్లించేశారు..!!

Duronto Train Coaches Changed to Charminar Express - Sakshi

సికింద్రాబాద్‌ – విశాఖపట్నం రైలు కోచ్‌లు చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌కు కేటాయించిన వైనం

వైజాగ్‌ స్టేషన్‌లో సరైన నిర్వహణ లేదంటూ తప్పించుకునే ఆరోపణలు

సామాజికమాధ్యమాల్లో వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు

సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం రైల్వే జోన్‌ ప్రకటించినప్పటి నుంచి ఈ పేరంటే అటు దక్షిణ మధ్య రైల్వేకు, ఇటు తూర్పు కోస్తా రైల్వేకు మింగుడు పడటం లేదు. అందుకే ఈ స్టేషన్‌ ప్రతిష్టని దిగజార్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కొత్తగా ఏ స్పెషల్‌ ట్రైన్‌ వేసినా విశాఖ స్టేషన్‌ ముఖం కూడా చూడనివ్వకుండా బైపాస్‌లో పంపించేస్తున్నారు. తాజాగా సికింద్రాబాద్‌ నుంచి విశాఖకు వచ్చే దురంతో ఎక్స్‌ప్రెస్‌ కోచ్‌లను కూడా మాయం చేసేసి చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌కు దారి మళ్లించెయ్యడంతో ప్రయాణికులు సామాజిక మాధ్యమాల్లో యుద్ధం చేస్తున్నారు.

దురంతో ఎక్స్‌ప్రెస్‌... తక్కువ స్టేషన్లలో హాల్టులతో త్వరగా గమ్యస్థానానికి తీసుకెళ్లేందుకు ప్రారంభించిన రైలు. అన్నీ ఏసీ బోగీలతో సౌకర్యవంతమైన ప్రయాణం సాగించేలా ఈ రైలు ఉంటుంది. ఈ ట్రైన్లు ప్రధాన నగరాల మధ్య మాత్రమే పరుగులు పెడుతుంటాయి. అయితే దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌ – విశాఖపట్నం మధ్య (ట్రైన్‌ నం.22203/22204) 2012 జూలైలో వారానికి మూడు రోజులపాటు నడిచేలా రైలుని ప్రారంభించారు. అయితే 1994 నాటి ఐసీఎఫ్‌ కోచ్‌లకు మరమ్మతులు, ఆధునికీకరిస్తూ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లుగా మార్చి ఇచ్చారు. అనంతరం క్రమంగా సమస్యలు మొదలయ్యాయి. పాత కోచ్‌లు కావడంతో ఏసీ నుంచి లీకేజీలు రావడం, బెర్తులు వంగిపోవడం మొదలైన ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో 2017లో దురంతోకి కొత్త రేక్‌ మంజూరు చేస్తామంటూ దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఎట్టకేలకు నెల రోజుల క్రితం ఒక రేక్‌ (14 బోగీలు)ని దక్షిణ మధ్య రైల్వేకి కేటాయించారు.

ట్విటర్‌లో ఫిర్యాదు చేసిన ప్రయాణికుడు 
12 కోచ్‌లు పక్కదారి...
ఈ రేక్‌ని చెన్నైలోని పెరంబూర్‌ ఐసీఎఫ్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో తయారు చేశారు. దీన్ని కేవలం సికింద్రాబాద్‌ – విశాఖపట్నం దురంతో ఎక్స్‌ప్రెస్‌ కోసం కేటాయించాలంటూ బోగీలపై ట్రైన్‌ నబర్‌ కూడా ముద్రించారు. అయితే సౌత్‌ సెట్రల్‌ రైల్వే అధికారులు దురంతో కోసం ఇచ్చిన బోగీలను దారి మళ్లించారు. హైదరాబాద్‌ – చెన్నై చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌కి అప్పనంగా అప్పగించేశారు.
దురంతోకి మొత్తం 14 కోచ్‌లు కేటాయిచగా అందులో హైదరాబాద్‌ – చెన్నై చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌కు 6 కోచ్‌లు, చెన్నై – హైదరాబాద్‌ చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌కి మరో 6 కోచ్‌లు పెట్టారు. ఇలా దురంతోకి వచ్చిన కోచ్‌లను పక్కదారి పట్టించడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో దక్షిణ మధ్య రైల్వే, రైల్వే బోర్డు, రైల్వే మంత్రిత్వ శాఖకు ట్విటర్‌లలో ఫిర్యాదుల రూపంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సత్వరమే స్పందించి దురంతోకి రావాల్సిన రేక్‌ని తిరిగి అప్పగించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

వాల్తేరు వైఫల్యమే కారణమంటూ ఆరోపణలు
కోచ్‌లు దారి మళ్లింపుపై వచ్చిన ఫిర్యాదులపై దక్షిణ మధ్య రైల్వే కుంటి సాకులు చెబుతోంది. వాల్తేరు రైల్వే డివిజన్‌లో సరైన నిర్వహణ ఉండటం లేదనీ.. ఫలితంగా కొత్త కోచ్‌లు ఏర్పాటు చేసినా త్వరగా పాడైపోతున్నాయంటూ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణల్లో వాస్తవం ఉందో లేదో పక్కన పెడితే.. ఒక ట్రైన్‌ కోసం కేటాయించిన బోగీలను మరో ట్రైన్‌కు కేటాయించడాన్ని వాల్తేరు అధికారులు సైతం తప్పుపడుతున్నారు. మరోవైపు విశాఖ జోన్‌గా ప్రకటించినప్పటి నుంచి ఈస్ట్‌కోస్ట్, సౌత్‌ సెంట్రల్‌ జోన్లు విశాఖపట్నంపై పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నాయి. ఏ ట్రైన్‌నీ విశాఖకు కేటాయించకుండా బైపాస్‌లో పంపించి డీగ్రేడ్‌ చేసే విధంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి.ప్రయాణికుల్లోనూ ఇదే అభిప్రాయం వెల్లువెత్తుతోంది. పాతికేళ్ల క్రితం ఏసీ బోగీలను వేగంగా వెళ్లే రైలుకి కేటాయిస్తే, జరగరాని ప్రమాదం ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. సాధారణ ఏసీ ప్రయాణం కంటే అదనపు ఛార్జీని దురంతో పేరుతో వసూలు చేసి ఇలా డొక్కు కోచ్‌లతోనే ఎన్నాళ్లు నడిపిస్తారని ప్రశ్నిస్తున్నారు. కేటాయించిన కోచ్‌లతోనే దురంతో నడిపేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top