చెత్త కుంభకోణం

Dumping Corruption In Kurnool - Sakshi

ప్రభుత్వ ట్రాక్టర్లు పక్కన పెట్టి..ప్రైవేట్‌ వాటితో చెత్త తరలింపు   

కర్నూలు మున్సిపల్‌ కార్పొరేషన్‌లో భారీ అక్రమాలు

ప్రైవేట్‌ ట్రాక్టర్లకు ఏటా రూ. కోటికిపైగా చెల్లింపు

కర్నూలు నగరంలో చెత్త తరలించడానికి 12 ట్రాక్టర్లు,  2 టిప్పర్లు  4 కాంపాక్టర్లు ( భారీ స్థాయిలో చెత్త తరలించే వాహనాలు) ఉన్నాయి. ఇవి చాలదన్నట్లు అధికారులు ప్రైవేట్‌ చెత్త ట్రాక్టర్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒక్కో ట్రిప్పుకు రూ.780 ప్రకారం ఏడాదికి కోటి రూపాయలకు పైగా కట్టబెట్టడం విమర్శలకు తావిస్తోంది.

కర్నూలు (టౌన్‌): కర్నూలులో 5.50 లక్షల జనాభా ఉంది. ఇక్కడ 51 వార్డులను పారిశుద్ధ్య పరంగా 13 డివిజన్లుగా విభజించారు. ప్రతి రోజు 170 మెట్రిక్‌ టన్నుల చెత్త తరలించాల్సి ఉంది. వీటిని తరలించేందుకు నగరపాలక సంస్థకు సంబంధించిన ట్రాక్టర్లు ఉన్నా వినియోగించడం లేదు. ప్రైవేట్‌ ట్రాక్టర్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఎందుకంటే..
చెత్తను తరలించేందుకు ట్రిప్పుల విధానం అమలవుతోంది. ప్రభుత్వ ట్రాక్టర్లను ప్రతి రోజూ రెండు ట్రిప్పులు తిప్పుతున్నారు. వీటికి ఎలాంటి ఖర్చు ఉండదు. అయితే ప్రైవేట్‌ ట్రాక్టర్లకు ప్రతి రోజు ఐదు ట్రిప్పులు కేటాయించారు. ఒక్కో ట్రిప్పుకు రూ. 780ప్రకారం ఐదు ట్రిప్పులకు రూ. 3,900 నగరపాలక సంస్థ చెల్లిస్తుంది. ప్రతి రోజూ 13 ప్రైవేట్‌ ట్రాక్టర్లకు రూ. 49,400 చెల్లిస్తున్నారు. నెలకు. రూ. 14,80,000 ప్రకారం ఏడాదికి రూ.1,77,84,000 చెల్లిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ప్రైవేట్‌ ట్రాక్టర్లకు నిధులు చెల్లిస్తున్నా...కర్నూలులో పారిశుద్ధ్యం మెరుగుపడడం లేదు. ఇదిలా ఉండగా.. ప్రతి రోజూ రెండు ట్రిప్పులు తిప్పుతున్న ప్రభుత్వ ట్రాక్టర్లకు డీజీల్‌ ఖర్చు ఏటా రూ.1,20,00,000 అవుతున్న విషయం విదితమే. ప్రైవేట్‌ ట్రాక్టర్ల నుంచి మున్సిపల్‌ అధికారులు ట్రిప్పుకు ఇంత అని కమీషన్‌ తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 

డంపింగ్‌ యార్డు వద్దా ఇదే పరిస్థితి..
నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతి రోజు 25కు పైగా ట్రాక్టర్ల ద్వారా వస్తున్న చెత్తను పాతబస్తీ జమ్మిచెట్టు వద్ద (ట్రాన్సిట్‌ పాయింట్‌)కు తరలిస్తున్నారు. ఇక్కడ నుంచి చెత్తను గార్గేయపురానికి తరలించాలి. ఇక్కడ కూడా ప్రభుత్వ ట్రాక్టర్లు ఉన్నాయి. టిప్పర్లు ఉన్నాయి. కాంపాక్టర్లు ఉన్నాయి. అయినా... వీటన్నింటినీ పక్కన పెట్టారు. ఇక్కడి నుంచి చెత్తను తరలించేందుకు రెండు ప్రైవేట్‌ టిప్పర్లకు అప్పగించారు. ఒక్కో ట్రిప్పుకు రూ. 2 వేల ప్రకారం చెల్లిస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top