కనికరించండయ్యా..!!

DSP Respond On Elder Woman Request In Krishna - Sakshi

వృద్ధురాలి వేడుకోలు

స్పందించిన డీఎస్పీ పోతురాజు

అవనిగడ్డ: ఈ ఫొటోలో నిలబడటానికి ఇబ్బంది పడుతున్న వృద్ధురాలి పేరు పంచకర్ల నాంచారమ్మ. వయసు 85ఏళ్లు పైనే. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం వద్దకు చేతికర్ర సాయంతో నడుచుకుంటూ అతి కష్టం మీద వచ్చింది. కనిపించిన వారినల్లా పలుకరిస్తూ అయ్యా! నాకు న్యాయం చేయండని వేడుకొంది. సరిగా వినబడని ఈ వృద్ధురాలిని ప్రశ్నించగా.. కన్నీరు మున్నీరవుతూ తన గోడు వెళ్లబోసుకుంది. ‘చల్లపల్లి మండలం మాజేరు గ్రామం. నా చిన్నకొడుకు చంద్రశేఖర్‌ ఏడేళ్ల క్రితం చనిపోయాడు. పెద్ద కొడుకు వెంకటేశ్వరరావు ఐదేళ్ల క్రితం లోకం విడచి వెళ్లిపోయాడు. మాజేరులో మాకు మూడు కుంటలు పొలం ఉండేది.

అంతా అమ్మేసి నన్ను రోడ్డున పడేశారు. మనుమడు, మనుమరాలు ఉన్నా చూడరు. రాత్రి వర్షానికి గోనెసంచి దొరికితే తలపై పెట్టుకుని చల్లపల్లిలో ఓ షాపు ముందు తలదాచుకున్నాను. కట్టుకున్న చీర తడచి పోవడంతో చలికి వణకిపోయాను. అవనిగడ్డ వెళ్లు అక్కడ అధికారులకు చెప్పుకుంటే నీ బాధలు తీరతాయి అంటే ఇక్కడకు వచ్చాను. ఇక్కడ ఎక్కడుంటారో,  ఎవరిని కలవాలో తెలియదయ్యా? నాకు న్యాయం చేసి పుణ్యం కట్టుకోండయ్యా అంటూ కనబడిన వారినల్లా ఆ బామ్మ చేతులు పట్టుకుని వేడుకుంటున్న దృశ్యం చూపరులను కలచి వేసింది. ఆ వృద్ధురాలికి స్థానికులు భోజనం పెట్టించి కూర్చోబెట్టారు.

స్పందించిన డీఎస్పీ..
ఈ విషయాన్ని స్ధానిక విలేకరులు వాట్సాప్‌ గ్రూపులో పోస్టు చేయగా స్పందించిన డీఎస్పీ వి.పోతురాజు సిబ్బందిని పంపించి స్థానిక కార్యాలయానికి తీసుకొచ్చారు. మాజేరు తీసుకెళ్లి బంధువులకు అప్పగించారు. వృద్ధురాలిని జాగ్రత్తగా చూసుకునేలా కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్‌ ఇచ్చినట్టు డీఎస్పీ తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top