మాదకద్రవ్యాల అడ్డాగా రాజధాని

Drugs Smaggling Increased In Guntur - Sakshi

 దారి తప్పుతున్న విద్యార్థులు

మద్యం, గంజాయితోపాటు డ్రగ్స్‌కు అలవాటు

నిఘా పెంచిన పోలీసులు

సాక్షి, మంగళగిరి(గుంటూరు) : ఈ నెల ఒకటో తేదీన మంగళగిరిలోని టిప్పర్ల బజార్‌లోగల శ్రీ చైతన్య కళాశాలలో కొందరు విద్యార్థులు అల్లరి చేస్తున్నారనే సమాచారంలో పోలీసులు వెళ్లారు. అక్కడ విద్యార్థుల పరిస్థితిని బట్టి మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు అనుమానించిన పోలీసులు వారి రక్త నమూనాలు తీసుకుని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. దీనిపై విచారణ చేస్తున్నారు. రాజధానిలోని ప్రైవేటు యూనివర్సిటీలలో విద్యార్థుల ద్వారా మాదక ద్రవ్యాలు సరఫరా అవుతున్నట్లు అనుమానిస్తున్నారు. తాడేపల్లి మండలంలోని వడ్డేశ్వరం గ్రామంలోగల ఓ ప్రైవేటు యూనివర్సిటీ మాదక ద్రవ్యాలు సరఫరా కేంద్రంగా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంగళగిరి మండలంలోని నీరుకొండలో గల యూనివర్సిటీతోపాటు చినకాకాని మెడికల్‌ కళాశాల విద్యార్థులు అధికంగా గంజాయి, మత్తు పదార్థాలు తీసుకుంటున్నట్లు సమాచారం. వీరు పట్టణంలోని ప్రైవేటు కళాశాలల విద్యార్థులకూ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు అనుమా                 నిస్తున్నారు.  

వేడుకల వేళ..
పుట్టిన రోజులకో లేక ఏదైనా ఫంక్షన్లకో విద్యార్థులు సరదాగా ఒక దమ్ము కొడదామని చిన్న వయసులో మత్తు పదార్థాల రుచి చూస్తున్నారు. క్రమేణా ఇది వ్యవసనంగా మారుతోంది. ఒడిశా, విశాఖ ప్రాంతాలకు చెందిన పలువురు గంజాయి సరఫరాదారులు రాజధాని ప్రాంతంలోని విద్యార్థులను లక్ష్యం చేసుకుని వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గంజాయి విచ్చలవిడిగా లభిస్తుండడంతో ప్రస్తుతం ఇంటర్‌ విద్యార్థులు సైతం దానికి బానిసలుగా మారుతున్నారు. 

మత్తు పదార్థాలకు అలవాటు పడిన విద్యార్థులు చదువును నిర్లక్ష్యం చేయడంతోపాటు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. పదో తరగతిలో 10 జీపీఏ సాధించిన విద్యార్థి ఇంటర్‌లో అశ్రద్ధగా ఉంటే కచ్చితంగా తల్లిదండ్రులు అనుమానించాలని పోలీసులు సూచిస్తున్నారు. మత్తు మహమ్మారిన పడిన విద్యార్థులు యూనివర్సిటీలు, కళాశాలలో ఘర్షణలకు దిగుతున్నారు. పిల్లల నడవడికపై ఎప్పటికప్పుడు యూనివర్సిటీలు, కళాశాలల్లో తల్లితండ్రులు ఆరా తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యూనివర్సిటీల యాజమాన్యాలు విదేశీ విద్యార్థులపై నిఘా ఉంచాలని పోలీసులు చెబుతున్నారు.

విద్యార్థులను గమనించాలి
విద్యార్థులు తొలుత సరదాగా లేక తోటి స్నేహితుడు ఒత్తిడితోనో మత్తు పదార్థాలకు అలవాటు పడతారు. అనంతరం వారికి తెలియకుండానే బానిసలవుతారు.  మద్యంతోపాటు మత్తు పదార్థాల కారణంగా కిడ్నీలు దెబ్బతిని క్యాన్సర్‌ బారిన పడతారు. ఇంటర్, బీటెక్‌ మొదటి సంవత్సరం చదివే సమయాలలో ఎక్కువగా స్నేహాలు మారుతుంటాయి. ఇలాంటి సమయంలో జాగ్రత్తలు పాటించాలి.  
– డాక్టర్‌ అన్నపురెడ్డి శివనాగేంద్రరెడ్డి, నెఫ్రాలజిస్ట్, ఎండీ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top