అనంతగిరి కాఫీ తోటల సమీపంలో మంగళవారం రాత్రి ఒంటి గంట ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.
వ్యాన్ బోల్తా - డ్రైవర్, క్లీనర్ మృతి
Aug 29 2013 3:48 AM | Updated on Sep 1 2017 10:12 PM
అనంతగిరి రూరల్ (విశాఖ జిల్లా), న్యూస్‌లైన్ : అనంతగిరి కాఫీ తోటల సమీపంలో మంగళవారం రాత్రి ఒంటి గంట ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం... విజయనగరం జిల్లా జామి గ్రామానికి చెందిన మినరల్ వాటర్ వ్యాన్ పాడేరు, అరకులోయలో కేన్లను సరఫరా చేసింది. తిరిగి పాడేరు నుంచి విజయనగరం జిల్లా జామి బయల్దేరింది. అనంతగిరి మండల కేంద్రానికి కిలోమీటరు దూరాన షూటింగ్ చాపరాయి సమీపంలో డ్రైవర్ నిద్రమత్తులో జోగుతూ వ్యాన్‌ను అదుపు చేయలేక ఎదురుగా బండరాయిని ఢీకొన్నాడు.
దీంతో వాహనం బోల్తా పడింది. ప్రమాదంలో విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం కొత్తూరు గ్రామానికి చెందిన డ్రైవర్ పాపాల వెంకటరమణ (40), జామి గ్రామానికి చెందిన గొలగాని నర్సింగరావు(దేముడు)(43) మృతి చెందారు. అదే సమయంలో అరకులోయ నుంచి బొర్రా కూడలికి వస్తున్న జీపు డ్రైవర్ ప్రమాదాన్ని చూసి అనంతగిరి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై రామకృష్ణ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి బుధవారం ఉదయం స్థానికుల సాయంతో వ్యాన్ కింద ఉన్న మృతదేహాలను బయటకు తీయించారు. శవపంచనామా, పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు.
అనాథలైన కుటుంబ సభ్యులు
జామి, న్యూస్‌లైన్ : ప్రమాదంలో మృతి చెందిన జామి గ్రామానికి చెందిన గొలగాని నర్సింగరావుకు భార్య కొండమ్మతోపాటు 11, 8 ఏళ్ల వయస్సు గల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పి.వెంకటరమణ కొత్తూరు వాసి. అయి తే ప్రస్తుతం ఎస్.కోటలోని శ్రీని వాసకాలనీలో నివాసం ఉంటున్నాడు. వెంకటరమణకు భార్య రాములమ్మ, ముగ్గురు కుమారైలు ఉన్నారు. మృతులిద్దరూ స్థానిక ఆక్వా ఫ్రెష్ వాటర్‌ప్లాంట్‌లో పని చేస్తున్నారు. ప్లాంట్ నుంచి వాటర్ క్యాన్లను అరకు తీసుకెళ్లి తిరిగొస్తున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. వీరిది నిరుపేద కుటుంబం.
మంగళవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయల్దేరాడని, బుధవారం తెల్లవారేసరికి వచ్చేస్తానని, కృష్ణాష్టమి వేడుకలకు వెళ్దామని చెప్పాడని, ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని మృతుడు నర్సింగరావు భార్య కొండమ్మ గుండెలవిసేలా రోదిస్తోంది. నాన్న మరిరాడా... అంటూ పిల్లలిద్దరూ బిక్కుబిక్కుమంటూ అడగడం స్థానికులకు కంటతడి పెట్టించింది. వెంకటరమణ కుటుంబానిది మరీ దీన పరిస్థితి. ముగ్గురు కుమార్తెలతో తాను ఎలా బతికేదంటూ భార్య రాములమ్మ విలపిస్తోంది.
Advertisement
Advertisement