ఈ నగరానికి ఏమైంది? | Drainage Canal Problems In Prakasam | Sakshi
Sakshi News home page

ఈ నగరానికి ఏమైంది?

Feb 10 2019 10:29 AM | Updated on Feb 10 2019 10:29 AM

Drainage Canal Problems In Prakasam - Sakshi

24వ డివిజన్‌ మంగలిపాలెం నివాసాల మధ్య వ్యర్థాలతో నిండిన డ్రైనేజి కాలువ వద్ద ఆందోళన చేస్తున్న స్థానికులు 

జిల్లా కేంద్రంలోని ఒంగోలు నగరం నడిబొడ్డునున్న కూరగాయల మార్కెట్‌ సమీపంలోని ప్రాంతమది. అక్కడ నివసించే మూడు కాలనీల ప్రజలకు నిత్యం మురుగుతో యుద్ధం చేస్తున్నారు. వర్షాకాలంలో అయితే ఇళ్లల్లో కూడా ఉండలేని దుస్థితి. కాలువల గుండా మురుగునీరు ప్రవహించే మార్గం లేకపోగా, ఇతర కాలనీల్లోని మురుగంతా అక్కడకొచ్చి చేరుకుంటుంది. దీనికి తోడు ఇక్కడికి సమీపంలో ఉన్న చేపల మార్కెట్‌లో వ్యర్ధాలన్నీ ఈ కాలనీల్లోని కాలువల్లో వచ్చి చేరుతున్నాయి.

నీరు, ఇతర వ్యర్ధాలు బయటకు పోయే మార్గం లేక ఐదడుగుల వెడల్పు కాల్వలు కూడా పూర్తిగా బ్లాక్‌ అయిపోయాయి. వినియోగంలో లేని కాల్వల నుంచి వెదజల్లే దుర్గంధం కారణంగా ఎప్పడు ఎలాంటి రోగాల బారిన పడాల్సివస్తుందోనని కాలనీల ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకొని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఒంగోలు నగరాన్ని ఎంతగానో అభివృద్ధి చేశానని, రోడ్లు, సైడ్‌ కాలువలు నిర్మించానని గొప్పలు చెప్పుకుంటున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్‌రావు నగర 
నడిబొడ్డున ఈ కాలనీల దుస్థితి చూసి సిగ్గు పడాలి.

ఒంగోలు టౌన్‌: ఒంగోలు నగరంలోని కొత్త కూరగాయల మార్కెట్‌ నుంచి అద్దంకి బస్టాండు మీదుగా  పోతురాజు కాలువలోకి మురుగు నీరు వెళ్లేందుకు ఇటీవల కాలువ నిర్మించారు. నిర్మాణం జరిగి నెలలు గడుస్తున్నా దానిని వినియోగంలోకి తీసుకురావాలన్న ఆలోచన నగర పాలక సంస్థ అధికారులకు రాలేదు. కాలువలు నిర్మించామా లేదా.. అవి ప్రజలకు కనబడుతున్నాయా లేదా. అంతేచాలు అన్నట్లుగా ఉంది నగర పాలక సంస్థ అధికారుల తీరు. కాలువలు నిర్మించినప్పటికీ వాటిని వినియోగంలోకి తీసుకురాకపోవడంతో లక్షలాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. కొత్త కూరగాయల మార్కెట్‌ నుంచి అద్దంకి బస్టాండు మీదుగా నిర్మించిన కాలువకు కనెక్షన్‌ ఇస్తే ఇక్కడి మంగళపాలెం, చాకలివారివీధి, వడ్డిపాలెం కాలనీవాసులకు కష్టాలు తొలగుతాయి. మెయిన్‌ లైన్‌ కాలువకు కనెక్షన్‌ ఇవ్వకుండా వదిలేయడంతో చేపల మార్కెట్‌లోని వ్యర్ధాలన్నీ ఆ మూడు కాలనీలపై దాడి చేస్తూనే ఉన్నాయి.

నిత్యం.. ప్రాణ సంకటం..
ఆ మూడు కాలనీల్లో నివసించే ప్రజలు ఇళ్లముందు కాలువల్లో మురుగు నీరు ఉన్నప్పటికీ తమ తలరాతలు ఇంతేనని గడుపుతూ వస్తున్నారు. శనివారం మాత్రం చేపల మార్కెట్‌లోని వ్యర్థాలన్నీ ఆ కాలువ గుండా ఇళ్ల మధ్యకు చేరుకున్నాయి. అసలే దుర్గంధం వెదజల్లుతూ, దోమల బారిన పడుతూ బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్న ఆ కాలనీవాసుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది. చేపల వ్యర్ధాలతో భరించలేని దుర్వాసన వెదజల్లుతుండటంతో అనేక మందికి ప్రాణసంకటంగా మారింది. పగలు, రాత్రి తేడా లేకుండా దోమలు దాడి చేస్తుండటంతో మలేరియా, ఫైలేరియా వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. గతంలో ఆ కాలువలో పడిపోయిన ఓ చిన్నారిని అదృష్టవశాత్తు గమనించి బయటకు తీయడంతో ప్రాణాపాయం తప్పింది.

అభివృద్ధి అంటే ఇదేనా..?
ఒంగోలు నగరాన్ని అభివృద్ధి చేశానంటూ పదేపదే చెప్పుకుంటున్న స్థానిక శాసనసభ్యుడు దామచర్ల జనార్దనరావు ఒంగోలు నగరంలోని ఈ మూడు కాలనీల్లో పర్యటిస్తే ఆయన చేసిన అభివృద్ధి ఏమిటో తెలుస్తుందని వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు పేర్కొన్నారు. ఈ కాలనీల ప్రజలతో కలిసి శనివారం ఆయన కాలువ గట్టుపై కూర్చొని నిరసన తెలిపారు. అనంతరం మాట్లాడుతూ కాంట్రాక్టర్ల కోసం కాలువలు కట్టడం తప్పితే ప్రజల కోసం కాదని విమర్శించారు. చేపల మార్కెట్‌లోని వ్యర్ధాలన్నీ ఈ మూడు కాలనీల్లోకి వస్తుండటంతో ప్రజలు భయపడుతున్నారన్నారు. ఊరచెరువులో ఏడు ఎకరాల స్థలం ఉందని, దానిలో నుంచి అద్దంకి బస్టాండు మీదుగా మురుగు నీరు చెరువులోకి వెళ్లే మార్గం ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్నారు. కేవలం కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసమే కాలువలు తవ్వి వదిలేస్తున్నారని ఆయన విమర్శించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement