రాష్ట్ర విభజనపై కేంద్రం నియమించిన మంత్రుల కమిటీని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, కమిటీని ఆమోదించేది లేదని మంత్రులు కాసు కృష్ణారెడ్డి, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, సాకే శైలజానాథ్ స్పష్టం చేశారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై కేంద్రం నియమించిన మంత్రుల కమిటీని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, కమిటీని ఆమోదించేది లేదని మంత్రులు కాసు కృష్ణారెడ్డి, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, సాకే శైలజానాథ్ స్పష్టం చేశారు. బుధవారం వారు సీఎల్పీ కార్యాలయం వద్ద వేర్వేరుగా మాట్లాడారు. తెలుగు రాష్ట్ర విభజనకు ఏర్పాటైన కమిటీలో తెలుగువారెవ్వరికీ చోటు లేకపోవడం విచారకరమని వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాన్ని ఇతరులు విభజించడం దుర్మార్గమైన చర్య అని దుయ్యబట్టారు. ‘‘మేము ముందు నుంచి సమైక్యవాదులమే. కమిటీలో కొన్ని ముఖ్యమైన అంశాలను పొందుపర్చలేదు. ఈ కమిటీ ఏవిధంగా పనిచేస్తుందో తెలియదు. రాష్ట్రానికి వస్తుందో రాదో కూడా స్పష్టతలేదు. 70 రోజులుగా అన్ని వర్గాల ప్రజలు ఉద్యమం చేస్తున్నా పట్టించుకోకుండా కమిటీని ఏర్పాటుచేయడం ఏమిటి? దీన్ని ఎదిరించి తీరుతాం. కేంద్రం నిర్ణయాన్ని మార్చుకోవాలి’’ అని కాసు కృష్ణారెడ్డి అన్నారు.
అసెంబ్లీకి తీర్మానం రావాల్సిందేన ని, దాన్ని తామంతా ఓడించి తీరుతామని చెప్పారు. రాజీనామాలపై సీఎం అభీష్టానానికి వదిలేశామని, ఆయన త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటారని ఏరాసు ప్రతాప్‌రెడ్డి చెప్పారు. మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ.. జీఓఎంలో పదిమంది సభ్యులుంటారని కేబినెట్‌లో తీర్మానించారని, ఇపుడు ఏడుగురికే పరిమితం చేశారన్నారు. కేబినెట్ నిర్ణయాన్ని ఎలా మారుస్తారో అర్థం కావడం లేదని చెప్పారు. గందరగోళం మయంగా ఉన్న విభజనను ఆపాలని కోరుతున్నామని, తెలుగువారికి సంబంధం లేకుండా విభజనను చేయడం సరికాదని అయన పేర్కొన్నారు.