బేంతచెర్ల లోని ఎస్సీ బాలుర హాస్టల్ ను మూసివేయాలనే ఆలోచనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని సీపీఐ అనుబంధ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది.
బేతంచెర్ల: కర్నూలు జిల్లా బేంతచెర్ల చుట్టుపక్కల గ్రామీణ విద్యార్థులకు ఎంతో సౌకర్యవంతంగా ఉన్న ఎస్సీ బాలుర హాస్టల్ ను మూసివేయాలనే ఆలోచనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని సీపీఐ అనుబంధ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. విద్యార్థులతో కలిసి బుధవారం తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించిన అనంతరం ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు భార్గవ్ మాట్లాడుతూ దళితులు అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలి అని ప్రచారం చేసి నేడు అధికారం చేపట్టగానే దళితుల నడ్డి విరిచే విధంగా ప్రణాళికలు రుపొందించడం దారుణమని బాబు సర్కారుపై నిప్పులు చెరిగారు.
రేపో, మాపో పడినోయే అద్దెభవనంలో వసతి గృహాన్ని నిర్వహిస్తూ కనీస మౌలిక వసతులు కల్పించకుండా నిత్యం సమస్యలు తాండ విస్తుంటే విద్యార్థులు అందులో ఎందుకు చేరతారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం పేద బడుగు,బలహీన వర్గాల విద్యార్థుల పట్ల నిరంకుశధోరణితో వ్యవహిరిస్తే తగిన మూల్యం చెల్లించుకుంటుందన్నారు. ఈ మేరకు తహశీల్దార్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ హనుమంత్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు.