
యర్రగుంటపల్లి అటవీ అభివృద్ధి సంస్థ జామాయిల్ ప్లాంట్‌ను పరిశీలించి ఫిర్యాదుదారుల నుంచి వివరాలు తెలుసుకుంటున్న అధికారులు
సాక్షి, పశ్చిమ గోదావరి : చింతలపూడి మండలం యర్రగుంటపల్లి అటవీ అభివృద్ధి సంస్థలో కలప అక్రమ తరలింపుపై గుంటూరు అటవీ శాఖ విజిలెన్స్ డీఎం రామలింగారెడ్డి ఆదివారం విచారణ జరిపారు. శుక్రవారం అర్ధరాత్రి యర్రగుంటపల్లి అటవీ ప్రాంతం నుంచి 22 టన్నుల జామాయిల్ కలపతో వెళ్తున్న లారీని యర్రగుంటపల్లికి చెందిన కొంత మంది యువకులు అడ్డుకుని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరపడానికి ఆయన వచ్చారు. అటవీ అభివృద్ధి సంస్థకు చెందిన జామాయిల్ బీట్‌లను పరిశీలించారు. అధికారుల పరిశీలనలో అడవిలో అనేక ప్రాంతాల్లో జామాయిల్ గుట్టలుగా పడి ఉండటాన్ని గుర్తించారు. అధికారులు విచారణకు వచ్చిన విషయాన్ని తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకుని రోజూ కలప అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్నట్లు స్థానిక అటవీ అభివృద్ధి సంస్థ అధికారులపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుదారులతో పాటు బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ టి.కుటుంబరావు, కలపను రవాణా చేసిన ట్రాక్టర్ డ్రైవర్ల నుంచి కూడా లిఖిత పూర్వకంగా స్టేట్‌మెంట్లు తీసుకున్నారు. విచారణ వివరాలు వెల్లడించకూడదని, నివేదికను ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఆయన విలేకరులకు చెప్పారు.