రాష్ట్ర విభజన నేపథ్యంలో సాంకేతిక, కళాశాల, పాఠశాల విద్యాశాఖల విభజనకు కసరత్తు మొదలైంది. జూన్ 2 అపాయింటెడ్ డే కంటే ముందే విభజనకు సంబంధించిన పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం విద్యాశాఖను ఆదేశించింది.
సిబ్బంది, ఫైళ్లు, ఆస్తుల విభజనపై ఉన్నత విద్యాశాఖ దృష్టి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో సాంకేతిక, కళాశాల, పాఠశాల విద్యాశాఖల విభజనకు కసరత్తు మొదలైంది. జూన్ 2 అపాయింటెడ్ డే కంటే ముందే విభజనకు సంబంధించిన పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం విద్యాశాఖను ఆదేశించింది. అలాగే రాష్ట్ర స్థాయి విద్యా, శిక్షణ సంస్థలు ఏడాది పాటు 2 రాష్ట్రాలకు సేవలందించేలా అవసరమైన చట్ట సవరణలు, ఉత్తర్వుల జారీపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా శనివారం రాష్ట్ర స్థాయి సంస్థలకు సంబంధించిన అధికారులు, ఉన్నత విద్యాశాఖ అధికారులతో సమావేశమయ్యారు. విభజన ఎలా చేయాలన్న విషయంలో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు, ఫార్మాట్లను అధికారులకు అందజేశారు. ఈనెల 20లోగా ఈ ప్రక్రియనంతా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే ప్రతి శనివారం విభజన కార్యక్రమాలపై సమీక్షించనున్నారు. ఫైళ్లు, సిబ్బంది, ఆస్తుల విభ జనపై దృష్టి సారించారు. 58:42 నిష్పత్తిలో విభజన చేపట్టాలని నిర్ణయించారు. ఫైళ్లను కూడా రెండుగా విభజించడం, కంప్యూటరీకరణ, ఆన్‌లైన్లో పెట్టేందుకు అవసరమైన చర్యలు మొదలయ్యాయి. సాంకేతిక, కళాశాల, పాఠశాల విద్యా శాఖ కమిషనరేట్లు రాష్ట్ర పునర్విభజన చట్టం 10వ షెడ్యూలులో పేర్కొన్న రాష్ట్రస్థాయి విద్యా, శిక్షణ సంస్థల జాబితాలో చేర్చనందున వెంటనే వీటికి సంబంధించిన విభజన పనులను చేపట్టాలని నిర్ణయించారు. అపాయింటెడ్ డే నుంచి ఈ శాఖలు రెండుగా పనిచేసేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రస్థాయి విద్యా, శిక్షణ సంస్థల జాబితాలో ఉన్న రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, స్టేట్ ఆర్కివ్స్, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, గవర్నమెంట్ ఓరియంటల్ మాన్యుస్క్రి ప్ట్స్ లైబ్రరీ, ఏపీ అకాడమీ ఆఫ్ సెన్సైస్, హిందీ, తెలుగు, సంస్కృత అకాడమీలు, స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఇంటర్ బోర్డు, ఆర్‌జీయూకేటీ, జేఎన్‌యూఎఫ్‌ఏ, శ్రీపద్మావతి మహిళా వర్సిటీ, ద్రవిడ వర్సిటీ, తెలుగు వర్సిటీ, బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలు రెండు రాష్ట్రాలకు సేవలందించేలా రాష్ట్ర విద్యా చట్టం, యూనివర్సిటీల చట్ట సవరణ చేయాలని యోచిస్తున్నారు.