ఆస్పత్రి రిజిస్ట్రేషన్‌ రద్దు..

District Medical Health Department Cancelled Hospital Registration In west godavari - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి(పాలకొల్లు) : పాలకొల్లు సూర్య నర్సింగ్‌ హోంలో వైద్యురాలు పీపీఆర్‌ లక్ష్మీకుమారి  నిర్లక్ష్యం కారణంగా గర్భిణి చల్లా ధనలక్ష్మి మృతి చెందిన సంఘటనపై ఆసుపత్రి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వై.సుబ్రహ్మణ్యేశ్వరి ఆదివారం ఏలూరులో విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. స్పందన కార్యక్రమంలో మృతురాలు తండ్రి చల్లా సత్యనారాయణ కలెక్టర్‌ రేవు ముత్యాలరాజుకు స్వయంగా ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటనపై విచారణ చేయాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. నరసాపురం మండలం చిట్టవరం గ్రామ మాజీ సర్పంచ్‌ చల్లా సత్యనారాయణ ఎకైక కుమార్తె చల్లా ధనలక్ష్మి బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. వైద్య పరీక్షల కోసం పాలకొల్లులో నివాసం ఉంటున్న తల్లిదండ్రుల వద్దకు రాగా ఈ ఏడాది మే 31న పట్టణంలోని సూర్య నర్సింగ్‌ హోమ్‌లో వైద్యురాలు పీపీఆర్‌ లక్ష్మీకుమారి సలహా మేరకు ఆసుపత్రిలో ఉంచాలని చెప్పడంతో అదే రోజు ఆసుపత్రిలో చేర్పించారు.

అయితే నెలలు నిండకుండానే కాన్పు చేసే ప్రయత్నం చేయడంతో ధనలక్ష్మి  మృతిచెందింది. దీనిపై ఆమె తండ్రి సత్యనారాయణ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేయడంతో గతనెల 23న జిల్లా ప్రభుత్వాసుపత్రి ప్రసూతి వైద్యనిపుణురాలు డా.ఎం పద్మ పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిలో విచారణ నిర్వహించారు. ధనలక్ష్మి మృతికి సూర్య నర్సింగ్‌ హోం డాక్టర్‌ పీపీఆర్‌ లక్ష్మీకుమారి నిర్లక్ష్యం కారణంగా నిర్ధారించి ఏపీపీఎంసీఈ చట్టం ప్రకారం 6 నెలల పాటు ఆసుపత్రి గుర్తింపును రద్దు చేస్తూ చర్యలు తీసుకున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుబ్రహ్మణ్యేశ్వరి పేర్కొన్నారు.

నా పరిస్థితి ఎవరికీ రాకూడదు 
నాకు ఒకే ఒక కుమార్తె. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నాను. చదువులో మెరిట్‌గా నిలిచేది. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తుంది. ఎంతో ఆరోగ్యంతో ఉండేది. కేవలం పరీక్షల నిమిత్తం ఆసుపత్రిలో చూపించాను. అయితే డాక్టర్‌ పీపీఆర్‌ లక్ష్మీకుమారి నిర్లక్ష్యంగా వైద్యం చేసింది. ప్రాణాలు బలిగొంది. అధికారులు చర్యలు తీసుకోవడంతో న్యాయం జరిగింది. ఇటువంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదు. 
–చల్లా సత్యనారాయణ, మృతురాలి తండ్రి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top