వ్యయమా.. స్వాహామయమా..?

District Administration Has Spent Huge Amounts Of Money On The Running Of The General Election - Sakshi

‘సార్వత్రిక’ ఎన్నికల నిర్వహణ వ్యయం రూ.52 కోట్లు 

మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు పెట్టేశారు 

వీడియో చిత్రీకరణకే రూ.1.74 కోట్లు! 

సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాగం భారీగా వ్యయం చేసింది. మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల కమిషన్‌ ఆదేశాలకు విరుద్ధంగా వీడియో చిత్రీకరణకు ఏకంగా రూ.1.74 కోట్లు ఖర్చు చేశారు. నిర్వహణ వ్యయం ముసుగులో కొందరు స్వాహా పర్వానికి తెరలేపినట్లు తెలుస్తోంది.  

సాక్షి, అనంతపురం అర్బన్‌: సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లా ఎన్నికల విభాగం ఖర్చు చేసిన నిధులు అక్షరాలా రూ.52 కోట్లు. ఇందులో రూ.22 కోట్లను ప్రభుత్వం మంజూరు చేయడంతో వాటితో చెల్లింపులు చేశారు. ఇంకా రూ.32 కోట్లు కావాలంటూ ప్రభుత్వానికి నివేదికలు పంపారు. రావాల్సిన వాటిలో కలెక్టరేట్‌ యూనిట్‌ చేసిన ఖర్చుకు సంబంధించి కలెక్టర్‌ అప్రూవల్‌ చేసిన బిల్లులు రూ.6.50 కోట్లు ఉండగా, మరో రూ.2 కోట్లకు అప్రూవల్‌ చేయాల్సి ఉన్నట్లు సమాచారం. ఇక రూ.21.50 కోట్లు జిల్లాలోని 14 నియోజకవర్గాలకు సంబంధించిన ఖర్చు బిల్లులు ఉన్నట్లు తెలియవచ్చింది. 

వీడియో చిత్రీకరణకు రూ.1.74 కోట్లు 
జిల్లాలోని 14 నియోజకవర్గాల పరిధిలో 3,884 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. పోలింగ్‌ ప్రక్రియ వీడియో చిత్రీకరణకు వీడియోగ్రాఫర్లకు ఒక్కొక్కరికి రూ.4,500 ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ఇందుకు రూ.1,74,78,000 వెచ్చించారు. సమస్యాతమ్మక, అత్యంత సమస్యాత్మ, సున్నితమైన పోలింగ్‌ కేంద్రాల్లో వీడియో చిత్రీకరణ నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. అయితే అధికారులు పాదర్శకం పేరిట 3,884 కేంద్రాల్లోనూ పోలింగ్‌ ప్రక్రియను వీడియో చిత్రీకరణ చేయించారు. ఈ అంశంపై ఓ జిల్లా అధికారి మాట్లాడుతూ అనవసరంగా వీడియో చిత్రీకరణకు నిధులు వెచ్చించామని, జరిగిన చిత్రీకరణలో చివరికి ఒక ఎంబీ వీడియోనూ కూడా ఏ ఒక్క అధికారీ చూడలేదని అన్నారు. ఇందుకు వెచ్చించిన నిధులు పూర్తిగా వృథా అని పేర్కొనడం గమనార్హం. 

ఆర్‌ఓలు ఇష్టారాజ్యంగా ఖర్చు 
ఎన్నికల నిర్వహణకు సంబంధించి గుండుసూది మొదలు భోజన వసతి వరకు అన్నీ సెంట్రలైజ్డ్‌ చేసి జిల్లా ఎన్నికల విభాగం ఖర్చు చేసింది. అయితే అత్యవసర ఖర్చు కోసమంటూ అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు (ఆర్‌ఓ)ఎన్నికల ఖర్చు కింద  కొందరికి రూ.1.03 కోట్లు, మరికొందరికి రూ.1.15 కోట్లు ఇచ్చారు. అయితే ఇందులో వారు ఎంత ఎక్కువ ఖర్చు చేసినా రూ.70 లక్షలకు మించదని ఓ అధికారి పేర్కొనడం గమనార్హం. మిగతా నిధులు పక్కదారి పట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలింగ్‌ సామగ్రి తరలించే రోజున సిబ్బందికి భోజన వసతి, వారికి రెమ్యునరేషన్, వీడియో గ్రాఫర్లకు ఇవాల్సిన రెమ్యునరేషన్‌కు, ఇతరత్ర చిన్నపాటి పనులకు మాత్రమే ఆర్‌ఓలు ఖర్చు చేసినట్లు తెలిసింది. ఇందులోనూ ఇద్దరు ఆర్‌ఓలు వీడియోగ్రాఫర్లకు రెమ్యునరేషన్‌ ఇవ్వలేదని తెలిసింది. 

విచారణకు ఆదేశం 
ఎన్నికల వ్యయం ఏకంగా రూ.52 కోట్లు కావడంపై అధికారులు విచారణకు ఆదేశించినట్లు సమాచారం. ఎన్నికల ఖర్చుకు సంబంధించి ఆర్‌ఓలు ఉంచిన బిల్లులు చూసి... ఇవన్నీ నిజంగా ఖర్చు చేసినవేనా అంటూ ఓ అధికారి ఆశ్చర్యం వ్యక్తం చేశారని తెలిసింది.    

ఎన్నికల నిర్వహణ వ్యయం     : రూ.52 కోట్లు 
విడుదల చేసింది    : రూ.22 కోట్లు 
ఇంకా విడుదల కావాల్సింది    : రూ.30 కోట్లు  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top