ఇవేం కష్టాలు.. భగవంతుడా..!

Devotees Suffering in Dwaraka Tirumala Temple Hair Donation - Sakshi

క్షేత్రంలో మొక్కులు తీర్చుకునే యాత్రికులకు తప్పని తిప్పలు

దొంగతనంగా కేశఖండన చేస్తున్న క్షురకులు

అడ్డుకుంటున్న స్థానిక నాయీ బ్రాహ్మణులు

సగం గుండ్లుతో పరుగులు తీస్తున్న యాత్రికులు

ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రానికి మొక్కుబడులు తీర్చుకునేందుకు వచ్చే భక్తులకు కష్టాలు తప్పడం లేదు. కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా దేవస్థానం కేశఖండనశాలను మూసివేయడంతో, ప్రస్తుతం చుట్టుపక్కల క్షురకులు, దళారుల దందా ఎక్కువైంది. ఏదో ఒక మూల మొక్కులు సమర్పిస్తే సరిపోతుందని భావిస్తున్న భక్తులను వారు దోచుకుతింటున్నారు. అంతే కాకుండా స్వామివారికి చెందాల్సిన తలనీలాలను వ్యర్థాలపాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం పెద్ద ఎత్తున యాత్రికులకు సత్తెన్నగూడెం, వెంకటకృష్ణాపురానికి వెళ్లే మార్గాల్లోని తోటలు, ముళ్ల పొదల్లో క్షురకులు గుండ్లు గీశారు. అలాగే సుద్ద గనుల్లో సైతం గుండ్లు గీసి, ఒక్కో భక్తుడి నుంచి రూ.500 వసూలు చేశారు.

ఇదిలా ఉంటే స్థానిక నాయీ బ్రాహ్మణులు గుండ్లు గీస్తున్న పలువురు క్షురకులను పట్టుకుని, తీవ్రంగా హెచ్చరించారు. ఈ సమయంలో సగం గీసిన గుండ్లతో భక్తులు అక్కడి నుంచి పరుగులు తీశారు. మిగిలిన సగం గుండ్లను వేరే క్షురకులతో గీయించుకుని, వారికి పెద్ద మొత్తంలో సొమ్ములు సమర్పించుకున్నారు. ఈ కష్టాలేమిట్రా భగవంతుడా.. అంటూ పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇళ్ల వద్దే యాత్రికులు తలనీలాలను తీయించుకుని, ముడుపులు కట్టి తమకు అందించాలని దేవస్థానం అధికారులు నిత్యం ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. అయినా భక్తులు వాటిని లెక్కచేయకుండా క్షేత్రానికి వచ్చి అష్టకష్టాలు పడుతున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top