రైతులెవరైనా తమ పంటల్ని అమ్ముకోవచ్చు..

Deregulation of terms In Rythu Bazars In AP - Sakshi

రైతు బజార్లలో నిబంధనల సడలింపు 

ఎటువంటి అనుమతులు అక్కర్లేదు.. 

ఆదేశాలు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు బజార్లలోని నిబంధనలు పూర్తిగా సడలించింది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న మినీ రైతు బజార్లలో రైతులెవరైనా తాము పండించిన కూరగాయలు, పూలు, పండ్లు, అమ్ముకోవచ్చని చెబుతోంది. ఎటువంటి అనుమతులు, కార్డులు అవసరం లేదంటోంది. అక్కడి ఎస్టేట్‌ అధికారులను కలిసి ఒక పాయింట్‌ను రైతులు ఏర్పాటు చేసుకోవచ్చని చెబుతోంది.  ఈ మేరకు ఎస్టేట్‌ అధికారులకు ఆదేశాలు జారీఅయ్యాయి.  

- కొత్తగా ఎవరైనా రైతులు వస్తే.. అప్పటి వరకు రైతు బజార్లలో పేరును రిజిస్టరు చేసుకుని, కార్డుతో అమ్మకాలు కొనసాగిస్తున్న రైతులకు వీరిని జత చేస్తారు.  
- వీరద్దరూ వారికి కేటాయించిన పాయింట్‌లో ఎవరి కూరగాయలు వారు అమ్ముకునే సౌలభ్యాన్ని  కలిగిస్తున్నారు.  
- రాష్ట్రంలో ఇంతకు పూర్వం 102 రైతు బజార్లున్నాయి. కరోనా వైరస్‌ కట్టడికి ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించి నిర్ణీత సమయాల్లోనే నిత్యావసర వస్తువులు, కూరగాయల కొనుగోలుకు అనుమతిచ్చింది.  
- అయితే ఆ సమయాల్లోనే కొనుగోలుదారులు అధిక సంఖ్యలో రావడంతో రైతు బజార్లన్నీ రద్దీతో నిండిపోయాయి. కొనుగోలుదారుల మ«ధ్య దూరం లేకపోవడంతో ఈ వైరస్‌ మరింత వ్యాపించే అవకాశాలేర్పడ్డాయి.    
- కొనుగోలుదారుల రద్దీని తగ్గించేందుకు వీటిని వికేంద్రీకరించి పాఠశాలలు, పార్కులు, ఇతర మైదాన ప్రాంతాల్లో మినీ రైతు బజార్లను ఏర్పాటు చేస్తోంది.  
- ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 300కు పైగా మినీ రైతు బజార్లు ఏర్పాటు కావడంతో కొనుగోలుదారుల రద్దీ తగ్గింది. ఈ రద్దీని ఇంకా తగ్గించేందుకు కొత్త రైతులకు అవకాశం కల్పిస్తున్నారు.  
- దీనితోపాటు లాక్‌డౌన్‌ కారణంగా రైతులు పండించిన కూరగాయలు ఇతర రాష్ట్రాలకు రవాణా అయ్యే అవకాశాలు తగ్గిపోవడంతో వాటి ధరలు గణనీయంగా తగ్గాయి. స్థానికంగా వీటిని అమ్ముకునే సౌలభ్యాన్ని కలిగిస్తే రైతులు కొంత వరకు లబ్ధి పొందుతారన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైతు బజార్ల డైరెక్టర్‌ ఇస్సార్‌ అహ్మద్‌ తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top