వైఎస్సార్ జిల్లా వేంపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో డిగ్రీ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి.
వేంపల్లి: వైఎస్సార్ జిల్లా వేంపల్లి మండలం పాములూరు-అలవలపాడు రహదారి మార్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో డిగ్రీ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. వీరపునాయుని పల్లి మండలం ఓబులరెడ్డి పల్లి గ్రామానికి చెందిన గంగా మహేంద్ర అనే డిగ్రీ విద్యార్థి బుధవారం ఉదయం పులివెందుల లయోలా డిగ్రీ కళాశాలలో పరీక్ష రాసేందుకు మోటార్ బైక్ పై బయలుదేరాడు.
పాములూరు-వేంపల్లి రహదారి మధ్యలో గ్రావెల్ తరలిస్తున్న ఓ ట్రాక్టర్ మహేంద్ర వెళ్తున్న బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విద్యార్థికి ఎడమ చేయి, ఎడమ కాలు విరిగినట్లు సమాచారం. చికిత్స నిమిత్తం 108 లో వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ కు తరలించారు.