కోవెలకుంట్ల: ‘నేను డిగ్రీ తర్వాత డీఎడ్ పూర్తి చేసినా ఉద్యోగం లేని కారణంగా దినసరి కూలికి వెళ్లి కుటుంబాన్ని పోషించుకోవాల్సి వస్తోంది.. నాలా ఉన్నత చదువులు చదివి కూలికెళ్తున్నవారు చాలామంది ఉన్నారు’.. అంటూ వాణి అనే యువతి జగన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. ప్రజాసంకల్ప యాత్ర శనివారం కోవెలకుంట్ల మండలం భీమునిపాడు గ్రామ శివారుకు చేరుకోగానే.. సీడు పత్తి పొలంలో పనిచేస్తున్న కూలీలు జగన్‌ను కలిసేందుకు వచ్చారు. వారిలో వాణి అనే యువతి ముందుకొచ్చి ‘ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు దాన్ని నెరవేర్చకపోవడం వల్లే నాకు ఈ దుస్థితి వచ్చింది.. నా తండ్రికి గుండె జబ్బు. నాకొస్తున్న రూ.200 కూలితోనే కుటుంబాన్ని పోషించుకోవాల్సి వస్తోంది..’ అంటూ వాపోయింది. అలాగే నవీనా అనే యువతి మాట్లాడుతూ ‘నేను ఎం ఫార్మసీ పూర్తిచేసినా ఇప్పటివరకూ ఉద్యోగం రాలేదు’ అని జగన్‌కు విన్నవించుకుంది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే అందరికీ న్యాయం జరుగుతుందని జగన్ వారికి భరోసా ఇచ్చారు.