ఆడపిల్లనని తనను తల్లిదండ్రులే చిన్నచూపు చూశారని ఆ పెద్దకూతురు బాధపడింది. నాలుగు రోజులుగా తాను, తమ్ముడు జ్వరంతో బాధ పడుతుంటే తండ్రి మాత్రం తమ్ముడికి వైద్యం చేయించడానికే మొగ్గు చూపించడం... నన్నూ డాక్టర్‌కు చూపించు నాన్నా అంటున్నా పట్టించుకోకుండా వెళ్లిపోవడంతో ఆ యువతి బలవన్మరణానికి పాల్పడింది.
ధారూరు, న్యూస్‌లైన్: ఆడపిల్లనని తనను తల్లిదండ్రులే చిన్నచూపు చూశారని ఆ పెద్దకూతురు బాధపడింది. నాలుగు రోజులుగా తాను, తమ్ముడు జ్వరంతో బాధ పడుతుంటే తండ్రి మాత్రం తమ్ముడికి వైద్యం చేయించడానికే మొగ్గు చూపించడం... నన్నూ డాక్టర్‌కు చూపించు నాన్నా అంటున్నా పట్టించుకోకుండా వెళ్లిపోవడంతో ఆ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద సంఘటన ధారూరు మండలంలోని సర్పన్‌గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఎం.డి.ఖయ్యూం, షబానా బేగంలకు ముంతాజ్ బేగం(21), అమీనా బేగం, ఇమ్రాన్‌లు సంతానం. ఖయ్యూం వికారాబాద్ మండలం మద్గుల్ చిట్టెంపల్లి గ్రామ సమీప ఫాంహౌస్ వాచ్‌మన్‌గా పనిచేస్తూ అప్పుడప్పుడూ ఇంటికి వచ్చిపోతుంటాడు. ముంతాజ్ బేగం వికారాబాద్‌లోని విశ్వభారతి కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. నాలుగు రోజులుగా ముంతాజ్‌బేగం, ఇర్ఫాన్‌లు జ్వరంతో బాధ పడుతున్నారు.
ఆదివారం మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తండ్రి చిన్నకొడుకు ఇర్ఫాన్‌ను వికారాబాద్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా తననూ తీసుకెళ్లాలని ముంతాజ్ బేగం బతిమిలాడింది. అయితే తన దగ్గర ఇద్దరి వైద్యానికి సరిపడా డబ్బులు లేవని, నిన్ను తర్వాత డాక్టర్ వద్దకు తీసుకెళ్తానని తండ్రి చెప్పాడు. ముంతాజ్ బేగం ఎంత ప్రాధేయపడినా విన్పించుకోకుండా ఇర్ఫాన్‌ను తీసుకొని ఆస్పత్రికి వెళ్లిపోయాడు. దీంతో ముంతాజ్ బేగం తల్లి షమీమ్ బేగంతో వాదనకు దిగింది. ఆడపిల్లనని నన్ను చులకన చేస్తారా, నేను కూడా జ్వరంతో బాధ పడుతుంటే తమ్ముణ్ని మాత్రం ఆస్పత్రికి తీసుకెళ్తారా అంటూ నిలదీసింది. అయినా కూతురి మాటలను తేలిగ్గా తీసుకొని తల్లి బయటకు వెళ్లిపోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ముంతాజ్ ఇంట్లో ఉన్న క్రిమిసంహారక మందు తాగింది. పక్కనే ఉన్న పెదనాన్న ఇంటికి వెళ్లి పురుగుమందు తాగానని చెప్పి స్పృహతప్పి పడిపోయింది.
ఆయన వెంటనే ముంతాజ్ బేగంను ఆటోలో వికారాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించి, తల్లిదండ్రులకు సమాచారమిచ్చాడు. వారు వచ్చే లోపే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముంతాజ్ తుదిశ్వాస విడిచింది. తండ్రి ఖయ్యూం ధారూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్‌ఐ జెములప్ప కేసు నమోదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు.