దళితుల సత్తా చూపిస్తాం

Dalit Welfare Fires on Chintamaneni Prabhakar - Sakshi

చింతమనేని వ్యాఖ్యలపై నిరసన  వెల్లువ

ఎమ్మెల్యేను వెనుకేసుకొచ్చిన టీడీపీ తీరుపై మండిపాటు

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుకు డిమాండ్‌

రాజ్యాంగాన్ని అపవిత్రం చేశారంటూ అంబేడ్కర్‌కు క్షీరాభిషేకాలు

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ వ్యాఖ్యలపై జిల్లాలో నిరసన పెల్లుబికింది. దళితులకు రాజకీయాలెందుకంటూ చింతమనేని వ్యాఖ్యలు చేయడాన్ని ఎస్సీ, ఎస్టీలతో పాటు మేధావులు, సామాజిక కార్యకర్తలు తప్పుబట్టారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించే అధికారం ఎవ్వరికీ లేదన్నారు. రాజ్యాంగంపై కనీస పరిజ్ఞానం లేనివారు ప్రజాప్రతినిధులుగా ఎంపిక కావడం, వారిని టీడీపీ వెనుకేసుకురావడంపై మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీల సత్తా ఏమిటో చూపిస్తామంటూ హెచ్చరించారు. చింతమనేని వ్యాఖ్యలకు నిరసనగా  జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేశారు. అంబేడ్కర్‌ విగ్రహాలకు అభిషేకాలు చేసి నిరసన తెలిపారు.

విజయనగరం, పాచిపెంట: దళితులపై అసభ్యకరంగా మాట్లాడిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని సామాజిక కార్యకర్త మామిడి శ్రీనివాస కళాధర్‌ డిమాండ్‌ చేశారు. దళితులు పట్ల  చింతమనేని మాటలను నిరసిస్తూ పాచిపెంట మండల కేంద్రంలో అంబేడ్కర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు  గడుస్తున్నా  దేశవ్యాప్తంగా ఇంకా కుల వివక్ష తాండవిస్తోందన్నారు. దళితులుకు పదవులు ఇవ్వడం రాజ్యాంగం కల్పించిన హక్కనే విషయాన్ని చింతమనేని తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో యజ్జల రామస్వామి,గోవిందు,అజయ్,యువత తదితరులు  పాల్గొన్నారు.

ఎస్సీలను తూలనాడేవారికి బుద్ధిచెబుతాం
చీపురుపల్లి: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితుల అణిచివేతకు చర్యలు చేపడుతున్న టీడీపీ సర్కారుకు బుద్ధిచెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ఎస్సీ ఎస్టీ విభాగం అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్‌ అన్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ దళితులపై అసభ్య పదజాలంతో దుర్భాషలాడడాన్ని నిరసిస్తూ గురువారం చీపురుపల్లిలో ఆందోళన చేశారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహేబ్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. సీఎం చంద్రబాబునాయుడు దళితులను హీనంగా చూస్తున్నారన్నారు. దళితుల ఇంట్లో ఎవరైనా పుడతారా అని చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారని, ఆయనేమైనా జమిందారీ ఇంట్లో పుట్టారా చెప్పాలని డిమాండ్‌ చేశారు. దేశంలో 18 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీలను తెలుగుదేశం ప్రభుత్వం హీనాతి హీనంగా చూసిందన్నారు. దళితులతో పెట్టుకుంటే ఏ రాజకీయ పార్టీలకైనా పుట్టగతులు ఉండవని స్పష్టం చేశారు. తక్షణమే చింతమనేని ప్రభాకర్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో దళిత నాయకుల అడ్డూరి రామకృష్ణ, రేగిడి రామకృష్ణ, డి.రాము, సిమ్మాల అప్పన్న, సిమ్మాల రామ్మూర్తి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సాకేటి మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top