సెల్‌ఫోన్‌ కోసం ఆశపడితే.. స్వీట్‌బాక్సు మిగిలింది

Cyber Crime Online Cheating in YSR Kadapa - Sakshi

వెలుగు చూసిన ఘరానా మోసం

లబోదిబోమంటున్న గ్రామీణులు

వైఎస్‌ఆర్‌ జిల్లా, బ్రహ్మంగారిమఠం : హలో.. మేము సెల్‌ఫోన్‌ కంపెనీ నుంచి మాట్లాడుతున్నామండి.. మా కంపెనీకి చెందిన ఆండ్రాయిడ్‌ ఫోన్లు ఆఫర్లు ప్రకటించాము. తక్కువ ధరకే విక్రయిస్తున్నాము. మీరు బుక్‌ చేసుకుంటే ఫోన్‌ మీ చేతికి అందాక రూ.1600 చెల్లించండి.. అంటూ ఫోన్‌ చేస్తారు.. వారి మాటలు నమ్మి బుట్టలో పడితే చేతికి అందేది సెల్‌ఫోన్‌ బాక్సు కాదు.. స్వీట్‌ బాక్సు.. వివరాల్లోకెళితే.. బ్రహ్మంగారిమఠం మండలంలో ఇటీవల పలువురికి ఓ మహిళ నుంచి ఫోన్‌కాల్‌ వచ్చింది. మీకు తక్కువ ధరకే ఆండ్రాయిడ్‌ ఫోన్‌ పంపిస్తాం.. మీ చిరునామా తెలపండి.. మీ ఇంటికి సెల్‌ఫోన్‌ బాక్సు వస్తుంది.. తరువాత రూ.1600 చెల్లించి బాక్సు తీసుకోండి అని పేర్కొంది. ఆమె మాటలు నమ్మి మల్లేపల్లి పంచాయతీలోని లింగాలదిన్నె, చెంచయ్యగారిపల్లె తదితర గ్రామాలకు చెందిన వారు ఫోన్‌ కోసం ఆర్డర్‌ ఇచ్చారు. ఆ తర్వాత బెంగళూరుకు చెందిన మిరాకీ వరల్డ్‌ అనే కంపెనీ పేరుతో ఓ సెల్‌ఫోన్‌ బాక్సు వచ్చింది. డబ్బులు చెల్లించి ఆ బాక్సు తీసుకుని తెరిచి చూడగా అందులో సెల్‌ఫోన్‌కు బదులు స్వీట్స్‌ ఉన్నాయి. తక్కువ ధరకు సెల్‌ఫోన్‌ వస్తుంది అని ఆశపడితే చివరకు స్వీట్‌ బాక్సు రావడంతో మోసపోయామని లబోదిబోమంటున్నారు.

ఇది మరో రకం మోసం..
పులివెందుల రూరల్‌ : పులివెందుల పట్టణం ముద్దనూరు రోడ్డులో నివాసముంటున్న రవికుమార్‌ నాలుగు రోజుల క్రితం ఆన్‌లైన్‌లో సెల్‌ఫోన్‌ బుక్‌ చేశాడు. రూ.3వేలు విలువ చేసే మొబైల్‌ ఫోన్‌ కేవలం రూ.1500కు ఇస్తున్నారని చెప్పడంతో బుక్‌ చేశాడు. బుక్‌ చేసిన నాలుగు రోజుల తర్వాత కొరియర్‌ బాయ్‌ సెల్‌ఫోన్‌ బాక్సు ఇచ్చి వెళ్లాడు. తెరిచి చూడగా అందులో కేవలం రూ.500 విలువ గల సెల్‌ఫోన్‌ ఉండటంతో వెంటనే కొరియర్‌ బాయ్‌కు ఫోన్‌ చేశాడు. మేం చేసేదేమీలేదని ఆన్‌లైన్‌ ద్వారా వచ్చిన వాటిని మేము డెలీవరీ  చేస్తున్నామని చెప్పాడు. దీంతో బాధితుడు చేసేదేమీలేక మిన్నకుండి పోయాడు. తక్కువ మొత్తంతోనే సరిపోయింది. పెద్ద మొత్తంలో ఏదైనా బుక్‌ చేసుకుని ఉంటే తన పరిస్థితి ఏమిటని వాపోయాడు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top