గుండె కోత | Cut to the heart | Sakshi
Sakshi News home page

గుండె కోత

Nov 7 2014 1:13 AM | Updated on Sep 2 2017 3:59 PM

గుండె కోత

గుండె కోత

నెల్లూరు(హరనాథపురం) : ఎన్‌టీఆర్ భరోసా పథకం ప్రారంభం కాక ముందు అన్ని రకాల పింఛన్లు కలిపి జిల్లాలో 2,58,382 ఉన్నాయి.

సామాజిక భద్రతా పింఛన్ల పథకానికి ఎన్టీఆర్ భరోసాగా కొత్త పేరు పెట్టి పింఛను సొమ్మును ఐదురెట్లు పెంచుతున్నట్లు ప్రకటించిన టీడీపీ ప్రభుత్వం అమలుకు వచ్చే సరికి అర్హులకే ఎసరు పెట్టింది. కొత్తగా ఆసరా కోసం ఎదురు చూస్తున్న వేలాదిమందికి ఆశాభంగం కలిగించింది.

సవాలక్ష సాకులు చూపించి జిల్లాల్లో గత  నెల్లో 65 వేల పైచిలుకు పింఛన్‌దారులకు అన్యాయం చేసింది. కొత్త పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తులను బుట్టదాఖలు చేసింది. పలుచోట్ల కమిటీలు అర్హులని తేల్చినా జాబితాల్లో కూడా అడ్డగోలుగా కోతలు పెట్టి ఆసరా కోసం ఎదురు చూస్తున్న వారకి ప్రభుత్వం గుండె కోతను మిగిల్చింది.

 
 నెల్లూరు(హరనాథపురం) : ఎన్‌టీఆర్ భరోసా పథకం ప్రారంభం కాక ముందు అన్ని రకాల పింఛన్లు కలిపి జిల్లాలో 2,58,382 ఉన్నాయి. ఎన్టీఆర్ భరోసా అమలులోకి వచ్చాక వాటిలో 65,446 మంది పింఛన్లను అక్టోబర్ నుంచి నిలిపి వేశారు. వారిలో 26,509 మందిని శాశ్వత అనర్హులంటూ తొలగించేశారు. మిగిలిన వాటిని పక్కన పెట్టడానికి పలు కారణాలు చూపించారు.

అర్హులుగా గుర్తించిన జాబితాను స్టేట్ రెసిడెంట్ డేటా హబ్(ఎస్‌ఆర్‌డీహెచ్) ఆధారంగా అన్‌లైన్ అనుసంధానించే సమయంలో ఆధార్, రేషన్ కార్డులలో వయసుల్లో వ్యత్యాసం ఉందని, స్త్రీకి బదులు పురుషుడనో, పురుషుడికి బదులు స్త్రీ అనో ఉందనో, పరిమితికి మించిన పొలం ఉందనో... ఇలా పలు రకాల కారణాలతో 38,957 మంది పింఛనుదారులను అనర్హులుగా మార్చారు.

నెల్లూరు నగరంలో సెప్టెంబర్‌లో 20,826 మందికి పింఛన్లను పంపిణీ చేశారు. అక్టోబర్‌లో ఈ సంఖ్యను 15,401కి కుదించారు. 1634 మందికి ఆధార్ సీడింగ్‌లో సాంకేతిక అంశాలు కారణాలతో, 3505 మంది పూర్తి అనర్హులని ప్రకటించారు. సదరం సర్టిఫికెట్లు అందజేయలేదని 286 మంది వికలాంగులను పక్కన పెట్టారు.
ఈ కోత చాలదన్నట్లు ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేసుకున్న పింఛనుదారుల జాబితాను అడ్డంగా కోసేశారు.

జిల్లా వ్యాపితంగా వృద్ధాప్య, చేనేత, వితంతు, వికలాంగ, కల్లుగీత కార్మికుల పింఛన్ల కోసం కొత్తగా 35,927 మంది దరఖాస్తు చేసుకుంటే 18,195 మందిని జాబితా నుంచి తొలగించారు. ఈ జాబితాలు ఆయా గ్రామ కమిటీల సిఫార్సుతో మండల కమిటీల నుంచి జిల్లా యంత్రాంగానికి వచ్చినవే. అటువంటి జాబితాల్లో కూడా కోత వేయడంలో ఔచిత్యంమేమిటని పింఛన్లకోసం పడిగాపులు పడుతున్న వారు ప్రశ్నిస్తున్నారు.
 కమిటీ సిఫార్సులను

 పట్టించుకోని వైనం
 జిల్లా వ్యాపితంగా ప్రతి గ్రామ సర్పంచ్ చైర్మన్‌గా, ఎంపీటీసీ మెంబర్‌గా, ఆయా వర్గాల నుంచి ఇద్దరు మహిళలు, ముగ్గురు సామాజిక కార్యకర్తలు(టీడీపీ నేతలు), మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు, కార్పొరేషన్‌లో కార్పొరేటర్...ఇలా స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిపి కమిటీలు ఏర్పాటు చేశారు. ఆ కమిటీలు చెప్పిందే తుది నిర్ణయం అని అంతా అనుకున్నారు.

అందుకే కమిటీల్లో చోటుకోసం అధికార పార్టీ నేతల మధ్య తీవ్ర పోటీకూడా కన్పించింది. అప్పుడేమో కమిటీలదే తుది నిర్ణయమని, ఇప్పుడేమో సవాలక్ష సాకులు చూపించి కొత్తగా పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తులను బుట్టదాఖలు చేయడం ఎంతవరకు సమంజసమని, కమిటీల్లో వేసింది తమను బలిపశువులను చేయడం కోసమేనా అని సభ్యులు మండిపడుతున్నారు. స్థానిక కమిటీలు పింఛన్లకు అర్హతను నిర్ధారించి మండల కమిటీల ద్వారా జిల్లా యంత్రాంగానికి పంపించిన జాబితాలను కాగితాలకే పరిమితం చేసి, ఆశగా ఎదురు చూస్తున్న వారికి నిరాశనే మిగిల్చారు.
 
 డెత్‌సర్టిఫికెట్ తెమ్మంటున్నారు :
 నా భర్త చనిపోయి 30 ఏళ్లు అవుతోంది. నెల నెలా వితంతు పింఛను అందుకుంటున్నా. నాభర్త చనిపోయినట్లు మరణ ధ్రువీకరణ సర్టిఫికెట్ చూపించలేదని నాకు పింఛను తొలగించారు. ఎప్పుడో చనిపోయిన నాభర్త సర్టిఫికెట్ ఇప్పుడు ఎలా చూపించేది. నాకు వస్తున్న కొద్దిపాటి పింఛను ఎంతో ఆధారంగా ఉండేది. మానవతా ధృక్పథంతో నాకు పింఛను పునరుద్ధరించాలి.         - నసీమా,
 మహాత్మగాంధీనగర్,  నెల్లూరు
 
 మా ఇంట్లో రెండో పింఛను అని తొలగించారు :
 నాకు 80 ఏళ్లు. నేను అంధుడను. వృద్ధాప్యంతో, పేదరికంలో ఉన్న నాకు వికలాంగుల కోటాలో వస్తున్న పింఛన్ సొమ్ము ఎంతో ఆదుకుంటోంది. నా భార్యకు వృద్ధాప్య పింఛను వస్తుందన్న సాకుతో నాకు పింఛన్ రద్దు చేశారు.  ఒక ఇంట్ల్లో ఒకరికే పింఛను అంటూ ప్రభుత్వం నాకు పింఛను రద్దు చేయడం న్యాయమా?  
 - షేక్ నబీసా,
 గాంధీనగర్, నెల్లూరు
 
 పింఛన్ తొలగించారు :
 నా రెండు కాళ్లు పూర్తిగా చచ్చుబడిపోయాయి. పదేళ్లుగా నాకు పింఛన్ వస్తుండేది. ఇప్పుడు పెరిగిన పింఛన్ వస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూశా. రకరకాల కారణాలు చూపుతూ వస్తున్న పింఛన్‌ను అధికారులు తొలగిం చారు. నాకు పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలి.
 - షేక్.జాకీర్, వికలాంగుడు. వీఎంఆర్ నగర్, నెల్లూరు.
 
 ఆధార్ కార్డులో తప్పు ఉందని నా పేరు తొలగించారు :
 నాకు 75 ఏళ్లు. ఆధార్‌కార్డులో తప్పులు ఉన్నాయని నాకు వస్తున్న వృద్ధాప్య పింఛన్‌ను తొలగించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దయవల్ల పదేళ్లుగా పింఛను అందుకుంటున్నాను. చంద్రబాబు పింఛను పెంచుతారని అనుకుంటే.. వస్తున్న పింఛను తొలగించారు. నాకు పింఛన్‌ను పునరుద్ధరించాలి. - షేక్ కాలేషా, డైకస్
 రోడ్డు సెంటర్, నెల్లూరు
 
 అర్హత గల వారికే
 పింఛను మంజూరు :
 జిల్లా వ్యాపితంగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హత కలిగినవారికే పింఛను మంజూరు చేస్తాం. నూతనంగా దరఖాస్తు చేసున్న వారిలో 17 వేల మందిని అర్హులుగా గుర్తించాం. వీరికి త్వరలో పింఛను పంపిణీ చేస్తాం. తొలగించిన  జాబితాలో ఎవరైనా అర్హులు ఉంటే సంబంధిత పత్రాలతో దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి మంజూరు చేస్తాం.
 - చంద్రమౌళి, పీడీ, డీఆర్‌డీఏ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement