
సముద్రంలో విహరించే మినీ క్రూయిజ్
సాక్షి, విశాఖపట్నం: ‘పర్యాటకుల స్వర్గధామం విశాఖపట్నం.. ప్రకృతి రమణీయత విశాఖ సొంతం.. ఒకపక్క అందమైన సముద్రం.. మరోపక్క పచ్చని కొండలు..’ అంటూ విశాఖ వచ్చిన ప్రతిసారీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవే మాటలు వల్లె వేస్తుంటారు. ఏ వేదికైనా, ఏ సందర్భమైనా ఆయన నోటినుంచి అలవోకగా ఇవే పలుకులు జాలువారుతాయి. కానీ వందల కోట్ల రూపాయల పర్యాటక ప్రాజెక్టులను ప్రకటించడం, ఆ తర్వాత వాటికి నిధులు విడుదల చేయకుండా వదిలేయడం మాత్రం రివాజుగా మారింది. ఆ కోవలోకే వస్తోంది విశాఖ క్రూయిజ్ టూరిజం ప్రాజెక్టు!
పర్యాటకులను ఆకర్షించాలని...
దేశ, విదేశాల నుంచి విశాఖ వచ్చే పర్యాటకులను ఆకర్షించడానికి ప్రభుత్వం మూడేళ్ల క్రితం క్రూయిజ్ టూరిజాన్ని అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. రూ.300 కోట్లు వెచ్చించి తొలిదశలో విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి భీమిలి, యారాడ బీచ్‌లకు చిన్నతరహా క్రూయిజ్‌లను నడపాలని ప్రతిపాదించింది. మలిదశలో కాకినాడ హోప్ ఐలాండ్, కళింగపట్నం బీచ్‌లకు వీటిని విస్తరించాలని నిర్ణయించింది. ఈ క్రూయిజ్‌ల్లో పర్యాటకులకు రెస్టారెంట్, డ్రింకులు, మ్యూజిక్, గేమ్స్ వంటివి అందుబాటులో ఉంచుతారు. ఇలా పగటి పూట ఈ క్రూయిజ్‌లో సాగరంలోని అలల మధ్య విహరించేలా ప్రాజెక్టును సిద్ధం చేశారు. ఇలా ఫిషింగ్ హార్బర్, యారాడ, భీమిలిలో క్రూయిజ్‌ల కోసం జెట్టీలు నిర్మించాలని భావించారు. క్రూయిజ్‌లను నడపడానికి ఆపరేటర్లను ఆహ్వానించడానికి సన్నద్ధమయ్యారు. పర్యాటకశాఖ అధికారులు కూడా ఇందుకు అవసరమైన ప్రక్రియకు నడుం బిగించారు.
ఒక్క రూపాయీ విదల్చని ప్రభుత్వం
విశాఖలో ఏ జాతీయ, అంతర్జాతీయ సదస్సు జరిగినా ఇతర టూరిజం ప్రాజెక్టులతోపాటు క్రూయిజ్ టూరిజాన్ని కూడా ఎంతో గొప్పగా చూపేవారు. ఇది విశాఖకు ప్రతిష్టాత్మక పర్యాటక ప్రాజెక్టుగా పేర్కొనేవారు. దీంతో ఎప్పటికప్పుడే నిధుల ఆవశ్యకత గురించి ఆ శాఖ ఉన్నతాధికారులకు నివేదిస్తూ ఉన్నారు. కానీ రూ.300 కోట్ల ఈ ప్రాజెక్టుకు ఈ మూడేళ్లలో ప్రభుత్వం రూ.300లు కూడా కూడా విదల్చలేదు. దీంతో క్రూయిజ్ టూరిజం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. ఈ ప్రాజెక్టుపై పర్యాటకశాఖ అయినా చొరవ తీసుకోవాలని జిల్లా యంత్రాంగం కోరినా పట్టించుకునే నాథుడే లేకుండాపోయాడు. ప్రస్తుత పరిస్థితుల్లో క్రూయిజ్ టూరిజం ప్రాజెక్టు మునకేసినట్టేనని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు ప్రగతికి సంబంధించి తన వద్ద సమాచారం లేదని పర్యాటకశాఖ ప్రాంతీయ సంచాలకుడు రాధాకృష్ణమూర్తి ‘సాక్షి’తో చెప్పారు. మంగళవారం విజయవాడలో పర్యాటక శాఖపై వివిధ జిల్లాల అధికారులతో ఆ శాఖ ఉన్నతాధికారులు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలోనైనా క్రూయిజ్ టూరిజంపై కదలిక ఉంటుందో? లేదో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.